Finland: కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ప్రధాని.. మీమ్ షేర్ చేసిన ఎలాన్‌ మస్క్‌..!

కరోనా నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్(36) తీరు విమర్శలకు దారితీసింది. దానిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించిన తీరు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Updated : 14 Dec 2021 04:44 IST

హెల్సింకీ: కరోనా నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్(36) తీరు విమర్శలకు దారితీసింది. దానిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించిన తీరు నెట్టింట్లో వైరల్‌గా మారింది. తన సహచర మంత్రికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిసినప్పటికీ.. మారిన్ గతవారంలో నైట్‌ క్లబ్‌లో పార్టీకి హాజరయ్యారు. దానికి సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో షేర్ అయ్యాయి. దాంతో ఆమె దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. 

ఫిన్లాండ్ ప్రధాని వైఖరిని నిరసిస్తూ మస్క్‌ ఒక మీమ్‌ను ట్విటర్‌లో షేర్ చేశారు. అందులో ఓ వ్యక్తి ఒక మహిళ చెవిలో మాట్లాడుతూ.. మీరే చేస్తుంటారు..? అని అడుగుతాడు. అందుకు ఆమె.. నేను ఫిన్లాండ్ ప్రధాన మంత్రిని అంటూ సమాధానం ఇవ్వగా.. ఆ వ్యక్తి షాక్‌కు గురవుతారు. తన విదేశాంగ మంత్రికి కరోనా సోకిందని తెలిసిన తర్వాత కూడా.. చాలా గంటలు పాటు మారిన్‌ క్లబ్‌లో అందరిమధ్య ఉండటాన్ని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారు.  

కాగా, తనపై విమర్శలు రావడంతో మారిన్ క్షమాపణలు తెలియజేశారు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకోనందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో టీకాలు తీసుకోవడంతో ఐసోలేషన్‌లో ఉండాల్సిన పనిలేదని మొదట తనకు సమాచారం అందిందన్నారు. ఆ తర్వాత ఐసోలేషన్‌లో ఉండాలంటూ అందిన సందేశాన్ని చూడకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగినట్లు తెలియజేశారు. ఆ తర్వాత ఆమె ఐసోలేషన్‌లోకి వెళ్లడంతో పాటు, పరీక్ష చేయించుకున్నారు. ఫలితం మాత్రం నెగెటివ్‌ అని తేలింది. 

ఓ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. ఫిన్లాండ్‌లో కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వ్యక్తి.. తన సన్నిహితుల్లో ఎవరికైనా పాజిటివ్‌ వచ్చినా, ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. అధికారికంగా ఈ వెసులుబాటు ఉన్నప్పటికీ.. అక్కడ ప్రతిఒక్కరు స్వచ్ఛందంగా ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని