కొవిడ్‌పై పోరాడే మానవ జన్యువులివే!

కరోనా వైరస్‌పై పోరాటం చేసే మానవ జన్యువులను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.

Updated : 18 Oct 2022 16:28 IST

 కొత్త చికిత్సలకు మార్గం సుగమం 

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌పై పోరాటం చేసే మానవ జన్యువులను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితంగా వ్యాధి తీవ్రతపై ప్రభావం చూపే అంశాలను అర్థం చేసుకోవడానికి, కొత్త చికిత్స మార్గాలను కనుగొనడానికి మార్గం సుగమమవుతుంది. కాలిఫోర్నియాలోని శాన్‌ఫర్డ్‌ బర్న్‌హామ్‌ ప్రెబిస్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను నిర్వహించగా.. వీరికి భారత సంతతికి చెందిన సుమిత్‌ కె చందా నేతృత్వం వహించారు. తాజాగా గుర్తించిన జన్యువులు ఇంటర్‌ఫెరాన్లకు సంబంధించినవి. వైరస్‌పై పోరాటంలో ఆ ఇంటర్‌ఫెరాన్లు మనకు మొదటి అంచె రక్షణ వ్యవస్థగా ఉపయోగపడుతున్నాయి. కరోనా వైరస్‌కు స్పందనగా మానవ కణాల్లో జరిగే ప్రతిచర్యల గురించి తాము మెరుగ్గా అర్థం చేసుకోవాలని భావించినట్లు సుమిత్‌ చెప్పారు. ఇన్‌ఫెక్షన్‌కు బలమైన లేదా బలహీన స్పందనను ప్రేరేపించే అంశాలను గుర్తించడం దీని ఉద్దేశమని తెలిపారు. కొవిడ్‌-19 సోకిన కొందరిలో ఇంటర్‌ఫెరాన్‌ స్పందన బలహీనంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఫలితంగా వారిలో వ్యాధి తీవ్రత పెరిగిందని చెప్పారు. 

దీంతో ఇంటర్‌ఫెరాన్‌లతో ప్రేరేపితమయ్యే ‘ఇంటర్‌ఫెరాన్‌ స్టిమ్యులేటెడ్‌ జీన్స్‌’ (ఐఎస్‌జీలు)ను గుర్తించేందుకు పరిశోధన మొదలుపెట్టారు. కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ను పరిమితం చేసే సామర్థ్యం వాటికి ఉందన్నారు. మొత్తంమీద ఈ వ్యాధిని 65 ఐఎస్‌జీలు నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. ‘‘వాటిలో కొన్ని.. కణాల్లోకి ప్రవేశించే వైరస్‌ సామర్థ్యాన్ని అడ్డుకున్నాయి. మరికొన్ని.. వైరస్‌లోని జన్యు పదార్థమైన ఆర్‌ఎన్‌ఏ తయారీని నిలువరించాయి. మిగతావి.. వైరస్‌ కూర్పునకు అడ్డుకట్ట వేశాయి’’ అని సుమిత్‌ తెలిపారు. సీజనల్‌ ఫ్లూ, వెస్ట్‌ నైల్, హెచ్‌ఐవీ వంటి వ్యాధులనూ కొన్ని ఐఎస్‌జీలు నియంత్రిస్తున్నాయని వివరించారు. ‘‘మానవ కణాలను వైరస్‌ తనకు అనుకూలంగా మార్చుకుంటున్న తీరుపై కొత్త విషయాలను తెలుసుకున్నాం. అందులో బలహీన అంశం గురించి ఇంకా శోధిస్తున్నాం. తద్వారా.. వాటిని లక్ష్యంగా చేసుకొని మెరుగైన ఔషధాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని