US Visa: అమెరికా వీసా కష్టాలు.. అపాయింట్‌మెంట్‌కు 510 రోజులు నిరీక్షించాల్సిందే!

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాకింగ్‌ న్యూస్‌. ఎందుకంటే.. మీకు పర్యాటక వీసా (Visitor Visa) రావాలంటే దాదాపు ఏడాదిన్నరకు పైగా వేచి ఉండాల్సిందే. 

Updated : 19 Aug 2022 15:53 IST

వీసాల జారీ వేగవంతం చేస్తామన్న యూఎస్‌ ఎంబసీ

దిల్లీ: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాకింగ్‌ న్యూస్‌. ఎందుకంటే.. మీకు పర్యాటక వీసా (Visitor Visa) రావాలంటే దాదాపు ఏడాదిన్నరకు పైగా వేచి ఉండాల్సిందే. అవును.. అమెరికా పర్యాటక వీసా అపాయింట్‌మెంట్‌ (Visa Appointment) కోసం దాదాపు 500ల రోజులకు పైగా వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. దీంతో నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ విభాగంలో ఎవరైనా అమెరికా వెళ్లేందుకు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే వారికి 2024 మార్చి లేదా ఏప్రిల్‌లో వీసా అపాయింట్‌మెంట్‌ లభిస్తుందన్నమాట. అది కూడా కచ్చితంగా చెప్పలేం. అంతేకాదు, స్టూడెంట్‌ వీసా (Student/Exchange Visitor Visas) కోసం కూడా దాదాపు 470 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. ఇతర నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల కోసమైతే దాదాపు ఆరున్నర నెలలు (197 రోజులు) వేచిచూడాల్సి రావడం గమనార్హం.

భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణులు, విద్యార్థులు, పర్యాటకుల కోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలను జారీ చేస్తుంది. ఇందుకోసం దరఖాస్తుదారులకు వీసా అపాయింట్‌మెంట్‌కు పట్టే సమయాన్ని అమెరికా ఎంబసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంటుంది. అయితే, ఆయా ఎంబసీ, కాన్సులేట్‌లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బంది తదితర అంశాలను బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్‌డేట్‌ చేస్తుంది. భారత్‌లో దిల్లీ ఎంబసీతోపాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు(వర్చువల్‌గా) కాన్సులేట్ల నుంచి వీసా జారీ సేవలు అందిస్తోంది. తాజాగా ఈ కేంద్రాల నుంచి వీసా కోసం నిరీక్షణ సమయాన్ని అమెరికా అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించగా దిల్లీ ఎంబసీ నుంచి పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు అపాయింట్‌మెంట్‌ కోసం 582 రోజులపాటు నిరీక్షించాల్సి ఉంటుందని తెలియజేస్తోంది. అదే హైదరాబాద్‌ నుంచి పర్యాటక వీసా అపాయింట్‌మెంట్‌ కోసం 582 రోజులు, స్టూడెంట్‌/ఎక్స్ఛేంజీ పర్యాటక వీసా కోసం 471 రోజులపాటు వేచి ఉండాలని చూపిస్తోంది. మనదేశంలో ఆయా నగరాల్లో ఉన్న అమెరికా కాన్సులేట్ల నుంచి అపాయింట్‌మెంట్‌ వేయిట్‌ టైమ్‌ ఈ విధంగా ఉంది.

ఇలా అమెరికా వెళ్లాలనుకునే వారి వీసా ఇంటర్వ్యూ సమయం భారీగా ఉందన్న విషయంపై మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీనిపై అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. ఇమ్మిగ్రెంట్‌తోపాటు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల కోసం ప్రయాణికులకు సాధ్యమైనంత త్వరగా వీసాలు జారీ చేసేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించింది. కరోనా వైరస్‌ విజృంభణ సమయంలో లాక్‌డౌన్‌ తోపాటు సిబ్బంది కొరత కారణంగా వీసా జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని.. కేవలం కొత్తగా వీసా పొందేవారికే నిరీక్షణ సమయం ఎక్కువగా ఉంటోందని వెల్లడించింది. మెడికల్‌ ఎమర్జెన్సీ, అంత్యక్రియలు, పాఠశాలల ప్రారంభం వంటి అత్యవసర పనుల నిమిత్తం వెళ్లాలనుకునే వారికి ఇంటర్వ్యూను వీలైనంత త్వరగా చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయని.. అయినా ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపింది.

వీసా జారీ ప్రక్రియను వేగంగా చేపట్టేందుకు ఎక్కువ సంఖ్యలో అమెరికా సిబ్బందిని నియమించుకోవడంతోపాటు కొత్తవారికి కూడా శిక్షణ ఇస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. త్వరలోనే అమెరికా అధికారులు భారత్‌తో సహా ఇతర రాయబార/కాన్సులేట్‌ కేంద్రాలకు చేరుకుంటారని వెల్లడించింది. ఇదిలాఉంటే, అమెరికా వీసా కోసం భారత్‌ నుంచి భారీ స్థాయిలో దరఖాస్తులు పెరగడం కూడా అపాయింట్‌మెంట్‌ నిరీక్షణ సమయం ఈ స్థాయిలో ఉండడానికి మరొక కారణంగా ప్రైవేటు ట్రావెల్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. మరోవైపు కెనడా, యూకే వీసాల కోసం భారతీయులు చేసుకున్న దరఖాస్తులు కూడా లక్షల సంఖ్యలో పేరుకుపోయినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు