VandeBharat: వందేభారత్‌ భోజనంలో బొద్దింక.. ప్రయాణికుడి రియాక్షన్‌ ఇదే

Vande Bharat| వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి సిబ్బంది ఇచ్చిన ఆహారంలో బొద్దింక కనిపించింది. తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన.. ఈ విషయాన్ని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

Published : 06 Feb 2024 17:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్‌ (Vande Bharat Express) రైళ్లలో అందిస్తున్న ఆహారంపై విమర్శలు వస్తున్నాయి. నాసిరకమైన భోజనం పెడుతున్నారంటూ ఇప్పటికే పలువురు ప్రయాణికులు సామాజిక మాధ్యమాల (Social media) వేదికగా అసహనం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి 2న మధ్యప్రదేశ్‌లోని (Madhya pradesh) రాణికమలాపతి స్టేషన్‌ నుంచి జబల్‌పుర్‌ జంక్షన్‌కు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్న సుభేందు కేసరి అనే వ్యక్తికి ఈతరహా అనుభవం ఎదురైంది. ఆయనకు ఇచ్చిన ఆహారంలో బొద్దింక కనిపించడంతో చిర్రెత్తుకొచ్చింది. స్టేషన్‌లో దిగిన వెంటనే రాతపూర్వకంగా అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక లేఖతో పాటు.. ఆ ఆహారాన్ని ఫొటో  తీసి సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

దీనిపై ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) స్పందించింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెబుతూ.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆ మార్గంలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తామని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని తెలిపింది. ఇటీవల దిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఓ ప్రయాణికుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రైల్వేసిబ్బంది తీసుకొచ్చిన భోజనం నాసిరకంగా ఉండటమే కాకుండా, దుర్వాసన వచ్చింది. తీవ్ర అసహనానికి గురైన అతడు వెంటనే వీడియో తీసి.. ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఇండియన్‌ రైల్వేస్‌, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలకు కూడా ట్యాగ్‌ చేశారు. భోజనం సరిగా లేనందుకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరగా అధికారులు రిఫండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు