vaccine: నిమిషాల వ్యవధిలో మహిళకు 3 డోసులు

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మొన్నటికి మొన్న బిహార్‌లో ఓ మహిళకు నిమిషాల వ్యవధిలో రెండు వేర్వేరు టీకాలు వేయగా.. తాజాగా

Published : 29 Jun 2021 13:05 IST

ఠాణె: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మొన్నటికి మొన్న బిహార్‌లో ఓ మహిళకు నిమిషాల వ్యవధిలో రెండు వేర్వేరు టీకాలు వేయగా.. తాజాగా మహారాష్ట్రలోని ఠాణెలోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.  ఓ మహిళకు 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో మూడు డోసులు వేశారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఠాణె ప్రాంతానికి చెందిన ఓ 28ఏళ్ల మహిళ గత శుక్రవారం తన భర్తతో కలిసి స్థానిక టీకా పంపిణీ కేంద్రానికి వెళ్లారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన ఆమె.. తనకు నర్సు మూడు సార్లు టీకా వేసిందని భర్తకు చెప్పారు. ఆమె భర్త మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగి కావడంతో ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్యకు వ్యాక్సినేషన్ గురించి తెలియదని, అందుకే ఆమె గుర్తించలేకపోయిందని మహిళ భర్త చెబుతున్నారు.

ఘటనపై ఠాణె మేయర్‌ నరేశ్ మస్కే దర్యాప్తునకు ఆదేశించారు. ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అయితే మహిళకు మూడు డోసులు ఎలా వేశారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఆమె భుజంపై సూదులు గుచ్చిన గుర్తులు ఉన్నట్లు తెలిసింది.

మరోవైపు తాజా ఘటనపై భాజపా నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతటి నిర్లక్ష్యం ఎలా చోటుచేసుకుంది..? అని విరుచుకుపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇటీవల బిహార్‌లోని ఓ 63ఏళ్ల మహిళకు 15 నిమిషాల వ్యవధిలో రెండు వేర్వేరు టీకా డోసులు వేసిన విషయం తెలిసిందే. టీకా వేసుకునేందుకు ఆ మహిళ వ్యాక్సిన్‌ కేంద్రానికి వెళ్లారు. తొలుత ఓ టేబుల్‌ వద్దకు వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఆ తర్వాత మరో టేబుల్‌ వద్దకు వెళ్లాలని అక్కడ సిబ్బంది చెప్పారు. ఆ టేబుల్‌ దగ్గర మరోసారి టీకా ఇచ్చినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని