45 రోజుల్లో WFIకి ఎన్నికలు నిర్వహించకపోతే..: అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ హెచ్చరిక

Wrestlers Protest: గత కొద్దికాలంగా దేశ రాజధాని దిల్లీలో రెజ్లర్లు చేస్తోన్న నిరసనపై యూడబ్ల్యూడబ్ల్యూ స్పందించింది. ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 

Updated : 31 May 2023 12:57 IST

దిల్లీ:  లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేస్తోన్న ఆందోళనపై అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ(United World Wrestling (UWW))స్పందించింది. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ.. అటుగా మార్చ్‌ చేపట్టిన రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అలాగే రెజ్లింగ్ సమాఖ్యకు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే సస్పెన్షన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. (Wrestlers Protest)

‘రెజర్లతో వ్యవహరించిన తీరు, వారి నిర్బంధాన్ని ఖండిస్తున్నాం. అలాగే లైంగిక వేధింపుల ఆరోపణలపై చేస్తోన్న దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. రెజ్లర్లు చేస్తోన్న ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరుతున్నాం. అంతేగాకుండా 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే.. భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్‌ చేయాల్సి ఉంటుంది. గత కొద్దినెలలుగా రెజ్లర్ల చేస్తోన్న ఆందోళనను మేం గమనిస్తున్నాం. ఈ నిరసనల ప్రారంభ రోజుల్లోనే భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిని ఆయన బాధ్యతల నుంచి పక్కన పెట్టిన విషయం మా దృష్టిలో ఉంది. ఆయన ప్రస్తుతం సమాఖ్య ఇంఛార్జ్‌ కాదు.  రెజ్లర్ల భద్రత, నిష్పాక్షిత దర్యాప్తు నిర్ధారించేందుకు మరోసారి సమావేశం నిర్వహించనున్నాం’అని యూడబ్ల్యూడబ్ల్యూ తన ప్రకటనలో స్పష్టం చేసింది. 

మంగళవారం రెజ్లర్లు తీవ్ర నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లైంగిక ఆరోపణలు, బ్రిజ్‌ భూషణ్‌పై చర్యల విషయంలో కేంద్రం స్పందించనందుకు నిరసనగా పతకాలను గంగలో కలిపేందుకు హరిద్వార్ చేరుకున్నారు. హర్‌ కీ పౌఢీ వద్ద సుమారు 20 నిమిషాలపాటు పాటు మౌన దీక్ష చేశారు. ఆ తర్వాత గంగా నది ఒడ్డుకు చేరుకుని పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు. ప్రాణ సమానమైన పతకాలను నిమజ్జనం చేయాల్సి వస్తోందంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. తమను ఈ స్థితికి తీసుకొచ్చిన నేతలపై విమర్శలు గుప్పించారు. వారి రోదనలతో అక్కడి వాతావరణం గంభీరంగా మారిపోయింది. అయితే, చివరి క్షణంలో ఖాప్‌, రైతు సంఘాల నేతలు వారిని వారించారు. కేంద్ర ప్రభుత్వానికి కొంత గడువిద్దామని ప్రతిపాదించారు. దాంతో ప్రభుత్వానికి ఐదు రోజుల గడువిస్తున్నామని, అప్పటిలోగా చర్యలు తీసుకోకుంటే పతకాలు గంగలో కలిపేస్తామని స్పష్టం చేశారు. 

వ్యంగ్యంగా స్పందించిన బ్రిజ్‌ భూషణ్‌..

‘పతకాలను గంగలో కలిపేస్తామని వారు(రెజ్లర్లు) హరిద్వార్ వెళ్లారు. కానీ, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వాటిని టికాయత్‌కు అప్పగించారు. అట్లుంది మరి వారి సిద్ధాంతం. మేం ఏం చేయగలం? నాపై వచ్చిన ఆరోపణలను దిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. అవి నిజాలైతే.. నేను అరెస్టవుతా’ అని బ్రిజ్‌ భూషణ్ వ్యాఖ్యానించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు