Amit Shah: సున్నా ప్లస్ సున్నా సున్నానే..దిల్లీలో ఆప్‌, కాంగ్రెస్‌ పొత్తుపై అమిత్‌ షా

దిల్లీలో ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీల పొత్తుపై హోం మంత్రి అమిత్‌ షా తీవ్ర విమర్శలు చేశారు. సున్నా ప్లస్‌ సున్నా సున్నాగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. 

Published : 12 Mar 2024 17:43 IST

దిల్లీ: దిల్లీలో ఆప్‌, కాంగ్రెస్‌ పొత్తుపై అమిత్‌షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. గతంలో దిల్లీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను భాజపా గెలుచుకుందని, దిల్లీలో ఆప్, కాంగ్రెస్‌లకు లోక్‌సభ స్థానమే లేదని ఎద్దేవా చేశారు. సున్నా ప్లస్‌ సున్నా సున్నాగానే మిగిలిపోతుందన్నారు. మీరు పొత్తులు పెట్టుకోండి. అయినా మోదీ 400 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దిల్లీ గ్రామోదయ అభియాన్ కింద 41 గ్రామాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా లైన్, 178 గ్రామాలలో అభివృద్ధి పనులను అమిత్‌ షా ప్రారంభించారు. ఆయన వెంట దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ పూరి ఉన్నారు.

‘మీరు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా, అందులో  విలీనం చేసినా ఏమీ జరగదు’ అని దిల్లీ, గుజరాత్,  హర్యానాల్లో రెండు పార్టీల మధ్య పొత్తును ప్రస్తావిస్తూ షా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలకు వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చానన్న కేజ్రీవాల్‌ ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటున్నారని ఆయనపై మండిపడ్డారు. కేజ్రీవాల్ వరుస స్కామ్‌లకు పాల్పడ్డారని షా ఆరోపించారు. ఎక్సైజ్‌ కుంభకోణంలో విద్యాశాఖ మంత్రి జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి అంటూ విద్యాశాఖ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను అరెస్టు చేసిన విషయంపై స్పందించారు.

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలుచేస్తూ ప్రధాని మోదీ గత పదేళ్లలో దేశంలో కొత్త సంస్కృతికి నాంది పలికారని షా అన్నారు. మోదీ దేశంలోని 13 కోట్ల మంది తల్లులకు ఎల్‌పీజీ సిలెండర్లు అందించారు. కోటి మందికి పైపుల ద్వారా గ్యాస్ కనెక్షన్లు, 14 కోట్ల ఇళ్లకు కుళాయిల ద్వారా నీటి సౌకర్యం, 14 కోట్ల మందికి మరుగుదొడ్లు, మూడు కోట్లకు పైగా ఇళ్లు నిర్మించారని షా వివరించారు. ట్రిపుల్ తలాక్ రద్దు, సీఏఏ అమలు వంటి ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రధాని దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. దీనిద్వారా ప్రజలు కొత్త విశ్వాసంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారన్నారు. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందని షా చెప్పారు. 41 గ్రామాలకు పైపుల ద్వారా సహజ వాయువు సౌకర్యం కల్పిస్తున్నామని, దిల్లీ గ్రామోదయ అభియాన్ కింద రూ.383 కోట్లతో 178 గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించడం గ్రామాల్లోని ప్రజలకు ఉపయోగకరమని ఆయన అన్నారు.

దిల్లీ ప్రజలు నిజాయతీ గల ప్రభుత్వం కోసం తమ పార్టీని ఎన్నుకున్నారని షా మాటలపై స్పందిస్తూ ఆప్‌ పార్టీ సమాధానం చెప్పింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను గద్దె దింపడం, పార్లమెంట్‌లో కేజ్రీవాల్‌కు మరింత బలం చేకూర్చడం ఖాయమని పార్టీ పేర్కొంది. ఇవి ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే ఎన్నికలని ఆప్ పేర్కొంది. ఒకవైపు పార్టీ ప్రజల కేంద్రీకృత సమస్యలపై పోరాడుతుంటే మరోవైపు భాజపా అడ్డంకులు సృష్టిస్తోంది. దిల్లీ ప్రజల అభ్యున్నతి కోసం మేము తీసుకువచ్చే పథకాలను అడ్డుకుంటోంది అని ఆప్‌ విమర్శించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని