ఆ మాట విన్నప్పుడల్లా బాధేస్తుంది: పరుచూరి

ఏ పాత్రకైనా ప్రాణం పోయగల నటీమణి రమాప్రభ, ఆమె నటనకు దూరంగా ఉండటం చాలా బాధకలిగించే విషయమని రచయిత, దర్శకులు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. రమాప్రభ గారితో తన పరిచయం, సినీ ప్రయాణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన

Published : 23 Jul 2021 13:18 IST

రమాప్రభ సినిమాల్లోకి మళ్లీ తిరిగిరావాలి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ పాత్రకైనా ప్రాణం పోయగల నటీమణి రమాప్రభ, ఆమె నటనకు దూరంగా ఉండటం చాలా బాధకలిగించే విషయమని రచయిత, దర్శకులు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. రమాప్రభ గారితో తన పరిచయం, సినీ ప్రయాణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన ‘పరుచూరి పలుకులు’లో పంచుకున్నారు. ఇప్పుడున్న ఈ ఓటీటీలు సీనియర్‌ అర్టిస్టుల కోసమే అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ఈరోజు మహా హాస్యనటి రమాప్రభ గురించి మాట్లాడుదాం.. మహా హాస్యనటి అని ఎందుకన్నానంటే.. నాకు తెలిసి దగ్గరదగ్గర వెయ్యి పాత్రలైనా చేసి ఉంటుందామె. నిర్మలమ్మ, అన్నపూర్ణమ్మ ఎలా అయితే అతి సహజంగా కనిపిస్తారో.. ఆమె కూడా హాస్యంలో అంతే సహజంగా కనిపిస్తారు. చిరంజీవి గారికి ఎలాగైతే బాడీ లాంగ్వేజ్‌లోనే ఫైట్‌.. డ్యాన్స్‌ ఉందో.. రమాప్రభకు కూడా బాడీలాంగ్వేజ్‌లోనే హాస్యం ఉంటుంది. ‘కథానాయకుడు’ సినిమాలో రమాప్రభ గారి ‘చంకలో పిల్లాడిని వేసుకొని వచ్చే పాత్ర’ మామూలుగా పండలేదు. నిజానికి తొలుత ఆ సినిమాలో ఆమెకు పాత్రే లేదు. కానీ.. ఆ పాత్రను మా అన్నయ్య సృష్టించారు. అప్పటికీ నేను కొన్ని సినిమాలకు పనిచేసినా.. ‘రేపటి స్వరాజ్యం’తో మొదటిసారిగా స్టార్ట్‌ కెమెరా అన్నాను. అందులో రమాప్రభ విలన్‌ పాత్ర చేస్తానన్నారు. అందులో శారద కలెక్టర్‌. నేను విలన్‌. ఆ సినిమా థియేటర్‌లో చూస్తున్నప్పుడు శారదగారు నాతో ‘పరుచూరి గారూ.. మీరు నాకు విలన్‌గా చేయడం బాలేదండీ.. చేస్తే మరిదిగానో.. తమ్ముడిగానో చేయండి’ అని అన్నారు. ఆ సినిమాలోనూ రమాప్రభ గారు చాలా అద్భుతంగా నటించారు’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

‘‘ఒకరోజు షూటింగ్‌కు కొంచెం ఆలస్యంగా ఒక ఆర్టిస్టు వచ్చింది. ఏంటి సోదరీ ఎందుకు ఆలస్యంగా వచ్చారని అడిగితే.. ఆమె చెప్పకూడని మాటొకటి చెప్పింది. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. పదిమంది మాట్లాడినంత మాత్రాన సత్యం అసత్యం కాదు.. అసత్యం సత్యంగా మారదు. మీలో ఎవరైతే ఆ భావన కలిగించారో అది తప్పు అని చెప్పాను. సినిమా ఇండస్ట్రీలో ఉన్నని రూమర్స్‌ మరెక్కడా ఉండవు. ఇద్దరు కలిసి ఒక నాలుగు సినిమాలకు వరుసగా పనిచేస్తున్నారూ అంటే.. ఇండస్ట్రీ వాళ్లకంటే బయటివాళ్లు ఎక్కువగా మాట్లాడుతారు’ అని ఆయన అన్నారు. 

‘‘రాజాబాబుతో కలిసి రమప్రభ ఎన్నో సినిమాల్లో నటించారు. ఒకటికాదు.. రెండు కాదు.. ఎన్నోసార్లు జంటగా ప్రేక్షకులను నవ్వించే వైభోగం వాళ్లకే దక్కింది. ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల వేశాలు వేసిన ఆవిడ ఇక్కడ ఉండకుండా.. తన సొంతగ్రామానికి వెళ్లి ఉంటున్నారని విన్నప్పుడల్లా బాధేస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడి నుంచి చాలా మంది వెళ్లిపోయారు. మేము రాకముందు ప్రతిభావంతమైన ఆర్టిస్టులు కూడా ఇక వేషాలు లేవని వెళ్లినవాళ్లే. కానీ.. రమాప్రభ గారికి మీరు ఏ పాత్రిచ్చినా దానికి ఆవిడ ప్రాణం పోస్తారు.. పోసి తీరతారు. అంతటి నటీమణి ఆవిడ. మా ఇంటికి నడకదూరంలోనే వాళ్ల ఇల్లు ఉంటుంది. రమాప్రభ, శరత్‌బాబు విడిపోవడం చాలా బాధనిపించింది’ అని ఆయన అన్నారు.

‘‘ఓటీటీలు వచ్చాయి. ఈ మధ్య ఓ సినిమా చూశాను. అందులో మొత్తం పాత ఆర్టిస్టులే ఉన్నారు. చూడగానే ఆ దర్శకుడికి నమస్కారం చేయాలనిపించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అనేది కేవలం సీనియర్‌ ఆర్టిస్టుల కోసమే పుట్టిందని నేను నమ్ముతున్నా. ప్రాణం పోసే ఆర్టిస్టుల్లో ఒకరైన రమాప్రభ.. అద్భుతమైన వేషాలు వేస్తూ.. అక్కినేని నాగేశ్వర్రావు గారు కోరుకున్నట్లుగా.. ఊపిరి ఆగిపోయేవరకూ నటిస్తూనే ఉండాలి. అలాగే రచయిత.. ఊపిరి ఆగేవరకూ రాస్తూనే ఉండాలి.. దర్శకులు.. నటీనటులు అలాగే కోరుకుంటారు. ఒక్కసారి ఈ సినిమా రంగంలోకి వచ్చాక మిగతావన్నీ మర్చిపోతాం. ఇదే మా బడి.. ఇదే మా ఒడి.. మమ్మల్ని కంటతడిపెట్టించేదీ ఇదే.. మా కళ్లలో ఆనందభాష్పాలు చూసేదీ ఇదే. కాబట్టి.. సీనియర్‌ ఆర్టిస్టులకు మళ్లీ అవకాశం ఇవ్వాలని.. అందులో రమాప్రభ ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ ఆయన ముగించారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని