Sai Dharam Tej: సినిమాలు, రాజకీయాన్ని కలపొద్దు: సాయిధరమ్‌ తేజ్‌

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సాయిధరమ్‌ తేజ్‌ ‘విజయ యాత్ర’లో పాల్గొన్నారు.

Published : 01 Aug 2023 20:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బ్రో’ (BRO) సినిమాలోని శ్యామ్‌బాబు పాత్ర ఎవరినీ ఉద్దేశించి రూపొందించింది కాదని హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) స్పష్టం చేశారు. సినిమాలు, రాజకీయాన్ని కలపొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనరావడంతో చిత్ర బృందం ‘విజయ యాత్ర’ను చేపట్టింది. ఈ మేరకు సాయిధరమ్‌ తేజ్‌, దర్శకుడు సముద్రఖని.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెనాలి, గుంటూరు తదిరర ప్రాంతాల్లోని పలు థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను పలకరించారు. అనంతరం, స్థానిక మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో శ్యామ్‌బాబు పాత్ర వివాదంపై ప్రశ్న ఎదురవగా సాయిధరమ్‌ తేజ్‌ స్పందించారు.

‘‘బ్రో’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఇందులో మామయ్య (పవన్‌ కల్యాణ్‌)తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. గురువుతో కలిసి పనిచేసినట్లు అనిపించింది. చిరంజీవి మామయ్యతో కలిసి సినిమా చేయాలనేది నా కోరిక. అది తప్పక నెరవేరుతుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. పాలిటిక్స్‌లోకి వస్తే విమర్శలు తప్పవని పవన్‌ కల్యాణ్‌ గతంలోనే చెప్పారని అన్నారు.

పవన్‌ నన్ను కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారు: అంబటి రాంబాబు

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ హీరోలుగా దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమా జులై 28న విడుదలైన సంగతి తెలిసిందే. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు. తన గత సినిమాల్లోని కొన్ని పాటలకు పవన్‌ వేసిన స్టెప్పులు, దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) అందించిన సంభాషణలు సినీ అభిమానుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. మరోవైపు, నటుడు పృథ్వీరాజ్‌ పోషించిన శ్యామ్‌బాబు పాత్రపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఏపీ మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ శ్యామ్‌బాబు డ్యాన్స్‌ చేశారని కామెంట్స్‌ వెల్లువెత్తాయి. ఇప్పటికే దీనిపై అంబటి కూడా స్పందించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక.. సినిమాల్లో తన క్యారెక్టర్‌ పెట్టి పవన్ కల్యాణ్‌ ఆనంద పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై పృథ్వీరాజ్‌ స్పందించడంతో వివాదాస్పదమైంది. దాంతో, అంబటి తాజాగా మరోసారి పవన్‌ కల్యాణ్‌ను విమర్శించారు. సినిమాకు కలెక్షన్లు తగ్గుతుండటంతోనే ‘బ్రో’ సినిమాలోని నటీనటులతో తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని