Vijay Deverakonda: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. ఆ విషయం ఎవరికీ చెప్పను: విజయ్‌ దేవరకొండ

తన తాజా చిత్రం ‘ఖుషి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు హీరో విజయ్‌ దేవరకొండ. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ నుంచి పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఎదురవగా స్పందించారు. ఆయన సమాధానమేంటంటే?

Updated : 31 Aug 2023 15:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) ప్రధాన పాత్రల్లో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). ఈ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయ్‌ తన అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా చిట్‌చాట్‌ నిర్వహించారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అనేక అంశాలు పంచుకున్నారు. దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత రవిశంకర్‌, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్‌ మధ్యలో సందడి చేశారు. మరి, ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అనే ప్రశ్నకు విజయ్‌ సమాధామేంటో చూసేయండి..

నటన కాకుండా మీకు ఆసక్తి కలిగించే అంశం?

విజయ్‌ దేవరకొండ: దర్శకత్వం చేయడం. నటనకు కొన్నాళ్లు విరామం ఇచ్చి ఏదైనా సినిమా డైరెక్ట్‌ చేయాలనుంది. కానీ, ప్రస్తుతం నేను వింటున్న స్క్రిప్టులు నన్ను ఇంకా నటించేలా చేస్తున్నాయి. యవ్వనంలో ఉన్నాను గనక నటుడిగా పడాల్సినంత కష్టపడతా. ఆర్కిటెక్చర్‌పైనా నాకు ఆసక్తి ఉంది. ఏదో రోజు ఓ ఫామ్‌ తీసుకుని అందులో కాటేజ్‌ నిర్మించాలని ఉంది.

మీకు బాగా ఇష్టమైన వంటకం?

విజయ్‌ దేవరకొండ: బిర్యానీ, దోశె, బర్గర్‌, రసమలై, చీజ్‌ కేక్‌.

మీ ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ మూవీ?

విజయ్‌ దేవరకొండ: హాలీవుడ్‌ సినిమా ‘గ్లాడియేటర్‌’, తెలుగు సినిమా ‘పోకిరి’ నాపై బాగా ప్రభావం చూపాయి. ‘పోకిరి’లోని మహేశ్‌బాబు ఇంట్రడక్షన్‌ సీన్‌ చూసి నేనూ నటుడిని కావాలని ఫిక్స్‌ అయ్యా.

ఆ సినిమా కథకు, సమంత లైఫ్‌కు సంబంధం లేదు: డైరెక్టర్‌ శివ నిర్వాణ

కాలక్షేపం కోసం ఏం చేస్తుంటారు?

విజయ్‌ దేవరకొండ: విహార యాత్రలు చేస్తుంటా. వాలీబాల్‌, క్రికెట్‌ ఆడుతుంటా. నాకు వచ్చే ఆలోచనలన్నింటినీ కుటుంబంతో చర్చించి ఆచరణలో పెడుతుంటా. ఆ క్రమంలోనే వ్యాపారం మొదలుపెట్టా. మరికొన్ని కొత్త అంశాలపై దృష్టి పెట్టా. అవేంటో త్వరలోనే చెబుతా.

ఫెయిల్యూర్‌ని ఎలా అధిగమిస్తారు?

విజయ్‌ దేవరకొండ: ప్రతి ఒక్కరికీ పరాజయం ఎదురవుతుంది. దాన్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఫెయిల్‌ అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందడుగు వేస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారు?

విజయ్‌ దేవరకొండ: ఇంటిలిజెంట్‌ అయి ఉండాలి. నేను ఇష్టపడే వాటిని తనూ ఇష్టపడాలి.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?

విజయ్‌ దేవరకొండ: చేసుకోవాలనిపించినప్పుడు చేసుకుంటా. చాలా సింపుల్‌గా చేసుకోవాలని అనుకుంటున్నా. అందుకే చేసుకునే సమయంలో ఎవరికీ చెప్పను.

మిమ్మల్ని ‘అంజి’, ‘దేవీ పుత్రుడు’లాంటి సోషియో ఫాంటసీ చిత్రాల్లో చూడాలనుంది. చేస్తారా?

విజయ్‌ దేవరకొండ: నాకూ చేయాలనే ఉంది. కానీ, అలాంటి కథలతో నన్ను ఎవరూ సంప్రదించలేదు. సరైన స్క్రిప్టు వస్తే తప్పకుండా నటిస్తా.

మీ డ్రీమ్‌ రోల్‌?

విజయ్‌ దేవరకొండ: డ్రీమ్‌ రోల్‌ అంటూ ప్రత్యేకంగా ఏం లేవు. మనసుకు నచ్చిన పాత్రలు పోషిస్తుంటా.

మీ ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?

విజయ్‌ దేవరకొండ: ఫలానా వ్యక్తి అంటూ ఎవరూ లేరు. నేనెప్పుడూ గౌరవం, డబ్బు కావాలనుకుంటా. ఇవే నాకు స్ఫూర్తిగా నిలుస్తుంటాయి.

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో మళ్లీ ఎప్పుడు నటిస్తారు?

విజయ్‌ దేవరకొండ: ఎప్పుడనేది చెప్పలేనుగానీ తప్పకుండా ఉంటుంది. (దీనిపై నిర్మాత రవిశంకర్‌ స్పందిస్తూ.. ఈ కాంబినేషన్‌ కోసమే ప్రయత్నిస్తున్నామని తెలిపారు)

పెళ్లి అంశం ఉన్న మీ సినిమాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. మీరు ఎప్పుడైనా గమనించారా?

విజయ్‌ దేవరకొండ: కొత్త సెంటిమెంట్‌ క్రియేట్‌ చేయకండి (నవ్వుతూ..). అలా చెబితే ప్రతి సినిమాలో పెళ్లి సీన్‌ పెట్టాల్సి వస్తుంది.

‘ఖుషి మ్యూజికల్‌ ఈవెంట్‌’లో మీరు, సమంత కలిసి డ్యాన్స్‌ చేశారు కదా. రిహార్సల్స్‌ చేశారా?

విజయ్‌ దేవరకొండ: రెండు సార్లు రిహార్సల్స్‌ చేశాం. సమంతకు ఆరోగ్యం బాగా లేకపోయినా చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని