Updated : 26 Apr 2022 10:45 IST

Koratala Siva: ఈ నలుగురు.. కొరటాల శివ ‘ప్రత్యేక’ మార్క్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజికాంశాలతో కూడిన కథలకు కమర్షియల్‌ హంగులద్ది, పరాజయం ఎరుగని దర్శకుడిగా పేరొందారు కొరటాల శివ. హీరోలతో ఆయన చెప్పించే డైలాగులు ఏ స్థాయిలో ఉంటాయో తన చిత్రాల్లోని పాటలూ అదే రేంజ్‌లో అలరిస్తుంటాయి. ఆయన ఒక్కో సినిమాలోని ఒక్కో పాటను ఎంతో ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. 100 శాతం న్యాయం చేయగలిగే కథానాయికలనే వాటి కోసం ఎంపిక చేసుకుంటారు. చిరంజీవి- రామ్‌చరణ్‌ హీరోలుగా శివ తెరకెక్కించిన ‘ఆచార్య’ ఏప్రిల్‌ 29న విడుదలవుతున్న సందర్భంగా ఆ విశేషాలు చూద్దాం..

మిర్చిలాంటి నందిని

పలు విజయవంతమైన చిత్రాలకు సంభాషణలు, కథ అందించిన కొరటాల శివ ‘మిర్చి’తో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. కథానాయకుడి వ్యక్తిత్వాన్ని గురించి వివరించే టైటిల్‌ గీతం ‘మిర్చి మిర్చి మిర్చిలాంటి కుర్రాడే’ కోసం హంసా నందిని ఎంపిక చేసి, ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సాహిత్యానికి తగ్గట్టు మిరప కల్లంలో షూట్‌ చేసిన ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కండలు తిరిగిన యువకుల బృందం చొక్కాలు లేకుండా హంసతో కలిసి కాలు కదపడం, ఆఖరున వారితో కలిసి ప్రభాస్‌ స్టెప్పులేయడం అదరహో అనిపించింది.


శ్రీమంతుడితో పూర్ణ

మహేశ్‌బాబు హీరోగా కొరటాల రూపొందించిన చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రానికీ దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్‌ అందించాడు. ఇందులోని ‘రాములోడు వచ్చినాడురో’ పాట గ్లామర్‌ కోసం పూర్ణను తీసుకున్నారు. శ్రీరాముడి గురించి కథానాయకుడు వర్ణించే ఈ గీతంలో ‘రామ సక్కనోడు మా రామచంద్రుడంట..’ అంటూ పూర్ణ ఎంట్రీ ఇచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కనిపించింది సెకన్లపాటే అయినా తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. కొరటాల- మహేశ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో ఇలాంటి సన్నివేశం లేకపోవడం గమనార్హం.


గ్యారేజ్‌లో కాజల్‌

అగ్ర కథానాయికగా కొనసాగుతూనే ‘పక్కా లోకల్‌’ అంటూ కుర్రకారుని ఫిదా చేసింది కాజల్‌ అగర్వాల్‌. ‘చందమామేనా ఇలా డ్యాన్స్‌ చేసింది?’ అని ఆమె అభిమానులంతా ఆశ్చర్యంలో పడేంతగా ప్రతిభ చూపింది. ఎన్టీఆర్‌ హీరోగా శివ తెరకెక్కించిన ‘జనతా గ్యారేజ్‌’లోని ప్రత్యేక గీతమిది. ఈ పాటలో ‘అది కొనిస్తా.. ఇది ఇప్పిస్తా.. విదేశాలు తిరిగొద్దాం’ అని ఎన్టీఆర్‌ ఆఫర్‌ ఇస్తే వాటిని తిరస్కరించి ‘నేను లోకల్‌’ అంటూ కాజల్‌ పలికించిన హావభావాలు ఎవరూ మరిచిపోలేరు. హుషారైన స్టెప్పులతో అంతగా మాయ చేసింది మరి. ఈ చిత్రానికీ దేవిశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు.


సంగీత లాహే లాహే

కొరటాల శివ తెరకెక్కించిన 5వ చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి, రామ్‌చరణ్‌ కథానాయకులుగా తెరకెక్కిన ఈ ప్రాజెక్టుకు మణిశర్మ స్వరాలందించారు. చిరంజీవి- మణిశర్మ కాంబోకు మాంచి క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. తమ మునుపటి ఆల్బమ్స్‌ను మించే స్థాయిలోనే ‘ఆచార్య’ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదేమో. ‘లాహే లాహే’, ‘భలే బంజారే’తోపాటు రామ్‌చరణ్ పాత్ర కోసం స్వరపరిచిన ‘నీలాంబరి’... ఇలా ప్రతి గీతానికి శ్రోతల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ‘లాహే లాహే’ నంబరు 1గా నిలిచింది. ఆదిదంపతులు శివపార్వతుల నేపధ్యంలో చిత్రీకరించిన గీతమిది. ఆ సంగతులను వివరించేందుకు సంగీత తెరపైకి వచ్చింది. చిరంజీవికి పోటీగా నృత్యం చేసిందని ఇటీవల విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతోంది. మరి కొరటాల తన తదుపరి సినిమాల్లో ఎవరెవరిని ‘ప్రత్యేకం’గా నిలుపుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని