Adivi Sesh: నాకు డబ్బు మీద పెద్ద ఆసక్తి లేదు

వైవిధ్యభరితమైన థ్రిల్లర్‌ కథలు ఎంచుకుంటూ సినీప్రియుల్లో  ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు అడివి శేష్‌.

Updated : 17 Dec 2023 14:52 IST

వైవిధ్యభరితమైన థ్రిల్లర్‌ కథలు ఎంచుకుంటూ సినీప్రియుల్లో  ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు అడివి శేష్‌. ‘మేజర్‌’తో జాతీయ స్థాయిలో మెరిసిన ఆయన.. ఇప్పుడు ‘గూఢచారి 2’తో పాటు శ్రుతిహాసన్‌తో కలిసి ఓ యాక్షన్‌ సినిమా  చేస్తున్నారు. ఆదివారం శేష్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన శనివారం విలేకర్లతో ముచ్చటించారు.

ఈ 2023లో మీ నుంచి ఒక్క చిత్రం రాలేదు. ఇంతకీ ఏడాదంతా ఎలా గడిపారు?

‘‘ప్రస్తుతం నేను ‘గూఢచారి 2’తో పాటు శ్రుతిహాసన్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు, పూర్వ నిర్మాణ పనులతోనే ఏడాదంతా తీరిక లేకుండా గడిపేశా. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాదిలోనే వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి’’.

మీ సినీ ప్రయాణం ఎక్కడ మొదలై ఎక్కడి దాకా వచ్చిందని ఆలోచించుకుంటుంటారా?

‘‘నా సినీ ప్రయాణం ఎక్కడి దాకా వచ్చిందని కాదు కానీ దాన్ని ఎంత ఆస్వాదిస్తున్నాను.. మనసుకు ఎంత దగ్గరగా తీసుకుంటున్నాను అని ఆలోచిస్తుంటా. నేను చాలా కాలం ఇది చేయాలి.. అది చేయాలంటూ ఓ పరుగులోనే ఉండిపోయా. కానీ, వాటి తాలూకూ జ్ఞాపకాలేం లేవు. ఎందుకంటే ఒక దాన్ని చూసి.. ఆస్వాదించి.. ఎంజాయ్‌ చేసేంత తీరిక ఉండేది కాదు. అందుకే ఇప్పుడా అనుభూతులన్నీ ఆస్వాదించాలని అనుకుంటున్నా’’.

ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మీ మార్కెట్‌ పెరిగింది. ఎంత బడ్జెట్‌ పెట్టడానికైనా నిర్మాతలు వెనకాడటం లేదు. ఈ దశని ఎలా ఆస్వాదిస్తున్నారు?

‘‘ఇదంతా దేవుడిచ్చిన వరమే. ఎందుకంటే మనమెంత కష్టపడినా.. భగవంతుడి అనుగ్రహం ఉండాలి, రాసిపెట్టి ఉండాలి, అంతిమంగా ప్రేక్షకులు మనకు ఆ స్థాయి ఇవ్వాలి. కచ్చితంగా నేనిదంతా కష్టంతో సంపాదించుకున్నాననే ఫీలింగ్‌ ఉంది’’.

‘మేజర్‌’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపై మీ ప్రతి చిత్రం తెలుగుతో పాటు అన్ని భాషల్లో విడుదల చేస్తారా?

‘‘అలా ఏం లేదు. కథను బట్టే దాన్ని ఎలా విడుదల చేయాలని నిర్ణయిస్తాం. ‘గూఢచారి 2’నే తీసుకుంటే అది ఐదు దేశాల్లో జరిగే కథతో ఉంటుంది. ఆ స్క్రిప్ట్‌.. దాని స్కేల్‌ మన తెలుగు వాళ్లకే కాక మిగిలిన అన్ని భాషల వాళ్లకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇక శ్రుతిహాసన్‌తో కలిసి చేయనున్న యాక్షన్‌ డ్రామాని ‘మేజర్‌’ తరహాలో తెలుగు, హిందీ భాషల్లో విడివిడిగా చిత్రీకరించనున్నాం.అందుకే తెలుగు, హిందీ భాషల్లో పట్టున్న నటీనటుల్నే ఆ సినిమా కోసం ఎంచుకుంటున్నాం’’.

‘గూఢచారి 2’ కథ ‘గూఢచారి’కి కొనసాగింపుగా ఉంటుందా? మరో కొత్త కథతో సాగుతుందా?

‘‘గూఢచారి’ ఏ మంచు పర్వతాల్లో ముగిసిందో అక్కడి నుంచే ‘గూఢచారి 2’ కథ మొదలవుతుంది.’’

సినిమాల ఎంపికలో మీరు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఈ మధ్య చాలా పెద్ద ఆఫర్‌ను కాదనుకున్నారని తెలిసింది. నిజమేనా?

‘‘ఇండస్ట్రీలో డబ్బులైనా సంపాదించొచ్చు. మంచి సినిమాలైనా చెయ్యొచ్చు. చాలా అరుదుగా కొంతమందికే మంచి సినిమాలపై డబ్బు చేసుకోవడం కుదురుతుంది. నాకు డబ్బు మీద పెద్ద ఆసక్తి లేదు. అందుకే సహజంగానే కేవలం మంచి సినిమాలపైకి దృష్టి వెళ్లిపోతుంది. నేనెప్పుడూ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఎలా ఫీలవుతారన్న దానిపైనే దృష్టి పెడతా. అందుకే సక్సెస్‌ వచ్చినా ఫెయిల్యూర్‌ వచ్చినా చాలా సెలక్టివ్‌ చిత్రాలే చేస్తున్నా’’.

భవిష్యత్తులో మళ్లీ సహాయ పాత్రలు చేస్తారా? శ్రుతిహాసన్‌తో చేయనున్న చిత్రమెలా ఉంటుంది?

‘‘సినిమాలో ఏ పాత్రైనా సరే ఆ కథని, సినిమాని నా పాత్ర ముందుకు నడిపించగలగాలి. అలాంటి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తాను. ఇక నేను, శ్రుతిహాసన్‌ కలిసి చేయనున్న సినిమా చాలా ఇంటెన్స్‌ యాక్షన్‌ లవ్‌ స్టోరీగా ఉంటుంది. ఇదొక కొత్త జానర్‌ చిత్రం’’.

మీ ప్రతి చిత్రంలోనూ రచనా పరంగా మీ వంతు సహకారం అందిస్తుంటారు. అలాగే దర్శకత్వంలోనూ చొరవ తీసుకుంటుంటారా?

‘‘నాకు తెలిసి నేను మంచి నటుణ్ని.. రచయితను మాత్రమే. దర్శకుణ్ని మాత్రం కాదు. ఎందుకంటే దర్శకత్వం చేయాలంటే చాలా ఓర్పు కావాలి. నాకది లేదు. అందులోనూ నా శైలి పూర్తిగా వేరు. ప్రతిదీ మనసుతో ఆలోచించేస్తా. నిజానికది నటుడు చేయాల్సిన పని. దర్శకుడు ఎప్పుడూ మెదడుతో ఆలోచిస్తుంటాడు. దీన్ని చాలా మంది సరిగ్గా అర్థం చేసుకోరు. నా రచనలెప్పుడూ నా చిత్రాలకే పరిమితం. నేను రాసేటప్పుడు ఎప్పుడూ నటుడిగా ఆలోచించను. అలాగే షాట్‌లో ఉన్నప్పుడు రచయితగా ఆలోచించను. ఇప్పుడు చేస్తున్న నా రెండు సినిమాలు పూర్తయ్యాక కేవలం నటుడిగానే మరో రెండు చిత్రాలు చేయనున్నా’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని