Amazon Prime Video: అమెజాన్‌ ప్రైమ్‌ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?

గత కొంతకాలం వరకూ ఎలాంటి ప్రకటనలూ లేకుండా సినిమాలు, సిరీస్‌లను అందించిన ఓటీటీ వేదికలు నెమ్మదిగా అటువైపు అడుగులు వేస్తున్నాయి.

Published : 24 Sep 2023 02:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తోంది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టాక్‌ షో, క్రికెట్‌ మ్యాచ్‌లు ఒక్కటేంటి? మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం ముఖ చిత్రాన్నే ఓటీటీలు మార్చేశాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, జీ5, సోనీలివ్‌, ఆహా, ఈటీవీ విన్‌ వంటి ఓటీటీ వేదికలు నెల, వార్షిక చందాలు తీసుకున్న వారికి ప్రీమియం కంటెంట్‌ ఇస్తున్నాయి. ప్రస్తుతం జియో ఒక్కటే ఉచిత కంటెంట్‌ను అందిస్తోంది. గత కొంతకాలం వరకూ ఎలాంటి ప్రకటనలూ లేకుండా సినిమాలు, సిరీస్‌లను అందించిన ఓటీటీ వేదికలు నెమ్మదిగా అటువైపు అడుగులు వేస్తున్నాయి. ఈ విషయంలో డిస్నీ+హాట్‌స్టార్‌ ఒకడుగు ముందే ఉంది. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కూడా అదే బాట పట్టనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం తీసుకున్న వారికి ఏదైనా సినిమా, సిరీస్‌ చూడటం ప్రారంభించగానే ఒక యాడ్‌ వస్తోంది. అది కూడా స్కిప్‌ చేయొచ్చు. ఇక వీడియో పూర్తయ్యే వరకూ ఎలాంటి ప్రకటనా రాదు. కానీ, ఇక నుంచి పరిమిత సంఖ్యలో ప్రకటనలను ప్రసారం చేయాలని అమెజాన్‌ భావిస్తోందట. అమెరికాతో పాటు పలు దేశాల్లో ఉన్న ప్రైమ్‌ చందాదారులు సినిమా చూడాలంటే ప్రకటనలను కూడా భరించాల్సిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కసరత్తులు ప్రారంభించింది. 2024 ప్రారంభంలో దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. అయితే, యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ చూడాలనుకుంటే, అదనంగా మరికొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రైమ్‌ సభ్యత్వానికి ఇది అదనం. ఇందుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్‌ను ప్రైమ్‌ చందారులకు తెలియజేస్తుందట. ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌ వార్షిక చందా రూ.899 ఉండగా, యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ పొందాలంటే  ‘సూపర్‌+ ప్లాన్‌’ రూ.1099 ఎంచుకోవాలి. అంటే అదనంగా రూ.200 చెల్లించాలి. లేదంటే సినిమా, సిరీస్‌ మధ్యలో ప్రకటనలు వస్తూనే ఉంటాయి. 

ఓటీటీ వేదికలు కొత్త చందాదారులను పెంచుకోవడంతో పాటు, తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రకటనలను ఇవ్వడంతో పాటు, పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను పరిమితం చేయడం, వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటనలతో కూడిన అతి చవకైన ప్లాన్‌ను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రకటనల బాట పట్టడం చూస్తుంటే ఆదాయాన్ని పెంచుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్నట్లు అనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్‌ మార్కెట్‌లో ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌ నెం.1. అయితే, భారత్‌లాంటి దేశాల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో టాప్‌లో ఉంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రైమ్‌ సభ్యత్వం తీసుకున్న వారు కేవలం ఎంటర్‌టైన్‌ ఆస్వాదించడమే కాదు.. అమెజాన్‌ ఇ-కామర్స్‌ ద్వారా అనేక సౌకర్యాలను పొందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని