Aha Na Pellanta Review: రివ్యూ: అహ నా పెళ్ళంట

Aha Na Pellanta review: రాజ్‌తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన ‘అహ నా పెళ్ళంట’ ఎలా ఉందంటే?

Published : 17 Nov 2022 16:49 IST

వెబ్‌సిరీస్‌: అహ నా పెళ్ళంట; నటీనటులు: రాజ్‌ తరుణ్‌, శివానీ రాజశేఖర్‌, హర్షవర్థన్‌, ఆమని, పోసాని మురళీకృష్ణ, గెటప్‌ శ్రీను తదితరులు; సంగీతం: జుదాహ్‌ శాండీ; ఎడిటింగ్‌: మధు రెడ్డి; సినిమాటోగ్రఫీ: నాగేశ్‌ బన్నెల్‌, అక్షన్‌ అలీ; నిర్మాత: సూర్య రాహుల్‌ తమాడ, సాయిదీప్‌ రెడ్డి బొర్ర; దర్శకత్వం: సంజీవ్‌రెడ్డి; స్ట్రీమింగ్‌: జీ5

ఒకప్పుడు సగటు ప్రేక్షకుడికి వినోదం అంటే సినిమా, టెలివిజన్‌ మాత్రమే. ఇప్పుడు వాటి పక్కనే ఓటీటీ వచ్చి చేరింది. ఓటీటీ కోసం ప్రత్యేకంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు  తెరకెక్కుతున్నాయి. తెలుగులో ఈ ట్రెండ్‌ ఆలస్యంగా మొదలైనా, ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. యువ కథానాయకులు కూడా ఇందుకు ఆసక్తి చూపడం విశేషం. తాజా రాజ్‌తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన వెబ్‌సిరీస్‌ ‘అహ నా పెళ్ళంట’ (Aha Na Pellanta). తాజాగా జీ5 వేదికగా స్ట్రీమింగ్‌ మొదలైంది. మరి ఈ వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది? రాజ్‌తరుణ్‌, శివానీల నటన ఎలా ఉంది?

కథేంటంటే: చిన్నప్పుడు అమ్మకు ఇచ్చిన మాట కోసం శ్రీను (రాజ్‌తరుణ్‌) అమ్మాయిల వైపు కన్నెత్తి చూడడు. తండ్రి నోబాల్‌ నారాయణ (హర్షవర్థన్‌) క్రికెటర్‌ను చేద్దామనుకుంటే ఫిజియోథెరిపిస్ట్‌ అవుతాడు శ్రీను. ఒకరోజు సడెన్‌గా పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడంతో సంబంధాలు చూస్తారు. తీరా పెళ్లి పీటలెక్కిన తర్వాత పెళ్లికూతురు తను ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోతుంది. శ్రీను దీన్నో అవమానంగా భావిస్తాడు. తన పెళ్లి చెడిపోవడానికి మహా (శివానీ రాజశేఖర్‌) కారణమని తెలుస్తుంది. దీంతో ఆమె పెళ్లి కూడా చెడగొట్టి గుణపాఠం చెప్పాలనుకుంటాడు. స్నేహితుల సాయంతో మహాను కిడ్నాప్‌ చేసిన శ్రీనుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటి నుంచి తప్పించుకోవడానికి మహను తన ఫ్లాట్‌లోనే ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? (Aha Na Pellanta review) ఈ క్రమంలో శ్రీను, మహాల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? తనని కిడ్నాప్‌ చేసింది శ్రీనునే అని మహాకు ఎలా తెలిసింది? చివరకు ఇద్దరూ ఒక్కటయ్యారా? ఇలాంటి ప్రశ్నకు సమాధానం తెలియాలంటే వెబ్‌సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఫ్యామిలీడ్రామా, కథానాయకుడు పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికే వెండితెరపై ఎన్నో చిత్రాలు అలరించాయి. ఇటీవల విశ్వక్‌సేన్‌ ‘అశోకవనంలో అర్జున కల్యాణం’తో అలరించారు. ఇలాంటి కాన్సెప్ట్‌కు కావాల్సిందల్లా చక్కటి డ్రామా, సున్నితమైన హాస్యం. ఈ రెండు సమపాళ్లలో కలిపి ‘అహ నా పెళ్ళంట’ అంటూ  మంచి విందు భోజనాన్ని అందించడంలో దర్శకుడు సంజీవ్‌రెడ్డి విజయం సాధించారు. (Aha Na Pellanta review)అంతేకాదు, పెళ్లి తంతుకు సంబంధించి తెరసాల, పాణిగ్రహణం, బ్రహ్మముడి, సప్తపది, అరుంధతి నక్షత్రం, జీలకర్ర బెల్లం, మధుపర్కం , మంగళసూత్ర ధారణ పేర్లతో ఒక్కో ఎపిసోడ్‌కు పేరు పెట్టడం, అందుకు అనుగుణంగా నాయక-నాయికలను కలపడం బాగుంది.

శ్రీను చిన్నప్పటి సన్నివేశాలతో సిరీస్‌ కాస్త నెమ్మదిగా మొదలవుతుంది. పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా, చక్కటి హాస్యాన్ని పంచుతూ ఆ సన్నివేశాలు సాగుతాయి. ఆ తర్వాత శ్రీను పెళ్లి ఆగిపోవడం నుంచి తన పెళ్లి చెడిపోవడానికి కారణమైన మహాను కిడ్నాప్‌ చేయాలనుకోవడం వరకూ వచ్చే సన్నివేశాలు మాత్రం రొటీన్‌గా, సాగదీతగా అనిపిస్తాయి. కథనం అంతా నెమ్మదిగా సాగుతుంది. మధ్య మధ్యలో శ్రీను స్నేహితులు వేసే పంచ్‌లతో అక్కడక్కడా నవ్వులు పంచడం కాస్త రిలీఫ్‌. (Aha Na Pellanta review) కిడ్నాపర్స్‌ నుంచి తప్పించుకున్న మహా పోలీసుల ఎదుట చేసే హంగామా అతిగా అనిపిస్తుంది. కిడ్నాప్‌ తర్వాత మహా.. శ్రీను ఫ్లాట్‌కు చేరుకోవడం ఇద్దరి మధ్య స్నేహం, ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడినా, దాన్ని బయటకు వ్యక్తం చేయలేకపోవడం తదితర సన్నివేశాలతో తర్వాతి ఎపిసోడ్‌లు సాగుతాయి. అయితే, శ్రీను, మహాల మధ్య ప్రేమ చిగురించడానికి బలమైన సన్నివేశం, సంఘర్షణ కనిపించదు. లాజిక్‌ను పక్కన పెడితే, పతాక సన్నివేశాల్లో ట్విస్ట్‌, వాటిని తెరకెక్కించిన విధానం కాస్త డిఫరెంట్‌గా ఉంది.. వెబ్‌సిరీస్‌లు అంటే, హింస, అశ్లీల సన్నివేశాలకు అస్సలు కట్స్‌ ఉండవు.(Aha Na Pellanta review)  కానీ, ‘అహ నా పెళ్ళంట’ కుటుంబమంతా కలిసి కూర్చొని చూసేలా దర్శక-నిర్మాతలు తీర్చిదిద్దారు. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో వెబ్‌సిరీస్‌ చూడాలంటే ‘అహ నా పెళ్ళంట’ మంచి ఆప్షన్‌.

ఎవరెలా చేశారంటే: శ్రీనులాంటి పాత్రలు రాజ్‌తరుణ్‌కు కొత్తేమీ కాదు. చాలా ఈజ్‌తో చేసుకుంటూ వెళ్లిపోయాడు. తన పాత్ర పరిధికి మించి ఎక్కడా ఎక్కువ చేయలేదు. మహాగా శివానీ రాజశేఖర్‌ ఓకే. అక్కడక్కడా పాత్ర తాలుకూ అతి కనిపిస్తుంది. హర్షవర్థన్‌, ఆమని, పోసాని, మధునందన్‌, గెటప్‌ శ్రీను, తాగుబోతు రమేశ్‌ వారి పాత్రల పరిధి మేరకు నటించారు. రాజ్‌తరుణ్‌ స్నేహితులుగా రవితేజ, త్రిశూల్‌ఇద్దరూ తమదైన నటనతో నవ్వులు పంచారు. జుదాహ్‌ శాండీ పాటలు, పవన్‌ నేపథ్య సంగీతం ఓకే. (Aha Na Pellanta review) మధు రెడ్డి ఎడిటింగ్‌ కాస్త పని చెప్పాల్సింది. కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే, కథాగమనం ఇంకాస్త వేగంగా ఉండేది. నాగేశ్‌, అక్షర్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు సంజీవ్‌ రెడ్డి ఒక క్లీన్‌ యూత్‌ ఎంటర్‌టైనర్‌ను తీర్చిదిద్దారు. నిర్మాణవిలువలు బాగున్నాయి. ప్రతి సన్నివేశంలోనూ ఆ రిచ్‌నెస్‌ కనిపిస్తుంది.

బలాలు

+ నటీనటులు

+ సున్నిత హాస్యం, పంచ్‌డైలాగ్స్‌

+ దర్శకత్వం

బలహీనతలు

- అక్కడక్కడా సాగదీతగా అనిపించే సన్నివేశాలు

- హీరో-హీరోయిన్‌ పాత్రల మధ్య సంఘర్షణ లేకపోవడం

చివరిగా: ‘అహ నా పెళ్ళంట’.. క్లీన్‌ యూత్‌ ఎంటర్‌టైనర్‌

గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని