Lal salaam: ‘లాల్‌ సలాం’ ఫెయిల్యూర్‌పై స్పందించిన ఐశ్వర్య రజనీకాంత్‌.. ఏమన్నారంటే!

‘లాల్‌ సలాం’ ఫలితం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు ఐశ్వర్య రజనీకాంత్‌ అన్నారు. ఆ సినిమాలో చేసిన మార్పుల వల్లే అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదన్నారు.

Published : 09 Mar 2024 12:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్‌ సలాం’ (Lal salaam). విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌ (Rajinikanth) అతిథి పాత్రలో కనిపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. తాజాగా దీని ఫలితంపై దర్శకురాలు స్పందించారు.

‘మేము మొదట రాసుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం రజనీకాంత్‌ పాత్ర సినిమాలో 10నిమిషాలు మాత్రమే ఉంటుంది. అదీ రెండోభాగంలో కనిపిస్తారంతే. కానీ, ఆయన కోసం సినిమాకు వచ్చేవారు నిరాశకు గురికాకూడదని ఆ పాత్రలో మార్పులు చేసి మొదటి నుంచి ఉండేలా స్క్రిప్ట్‌ ఎడిట్‌ చేశాం. విడుదలకు రెండు రోజుల ముందు మార్చాం . రజనీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్‌ నిడివి పెంచాం. దీంతో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఎక్కువగా జోడించాల్సి వచ్చింది. కంటెంట్‌ బలంగా ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మార్పులు చేయడంతో సినిమా అనుకున్న స్థాయిలో అలరించలేకపోయిందని అనుకుంటున్నా.  మొదటి భాగంలో కొంత గందరగోళానికి గురయ్యామని అభిమానులు నాతో చెప్పారు. సినిమా నిడివి మరో 20 నిమిషాలు ఉండుంటే బాగుండేదని తర్వాత అర్థమైంది. దీని ఫలితం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నా’ అని చెప్పారు.

‘ఈగల్‌’.. ఆ విషయంలో దర్శకుడిది సాహసమే: పరుచూరి గోపాలకృష్ణ

ప్రస్తుతం రజనీకాంత్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. టి.జి. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ చేస్తున్నారు. తెలుగులో ‘వేటగాడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్‌ కడపలో జరుగుతోంది. అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి చివరికి ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని