Ajay Devgn: ‘ఆ మాటలు అనేవారికి మా కష్టం తెలియదు’.. బంధుప్రీతిపై అజయ్‌ దేవ్‌గణ్‌ వ్యాఖ్యలు

కరణ్‌ జోహర్‌ (Karan Johar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan) షోలో పాల్గొన్నారు నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn), దర్శకుడు రోహిత్‌ శెట్టి. సినీ పరిశ్రమలో తమ ప్రస్థానాన్ని వెల్లడించారు.

Updated : 21 Dec 2023 17:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువ అంటూ సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న చర్చను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn). ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం తాము ప్రతిరోజూ కష్టపడుతూనే ఉంటామని ఆయన తెలిపారు. అయితే, తమ కష్టాలు బయటవాళ్లకు తెలియదన్నారు. సినీ పరిశ్రమలోకి తన తండ్రి ఎలా వచ్చారో కూడా వివరించారు.

‘‘పంజాబ్‌కు చెందిన మా నాన్న 13 ఏళ్ల చిన్న వయసులో ఇంట్లో నుంచి పారిపోయి రైల్లో ముంబయి వచ్చారు. టికెట్‌ లేకుండా రైలులో ప్రయాణించినందుకు కొన్నిరోజులు జైల్లో పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ఆకలితో రోజులు గడిపారు. కొంతకాలం పాటు ట్యాక్సీలు శుభ్రం చేసే పనిలో చేరారు. ఇల్లు లేకపోవడంతో ట్యాక్సీల్లోనే నిద్రపోయేవారు. ఆ తర్వాత ఓ ముఠాలో గ్యాంగ్‌స్టర్‌గా చేరారు. ఓసారి వీధి గొడవలో మా నాన్న ఫైట్స్‌ చూసిన యాక్షన్‌ డైరెక్టర్‌ రవి ఖన్నా సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అలా, మా నాన్న స్టంట్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పరిశ్రమలోకి వచ్చాక కూడా ఆయన సమస్యలు ఎదుర్కొన్నారు. సినిమా అవకాశాల కోసం నిర్మాణ సంస్థల చుట్టూ తిరిగారు’’

Dunki Review: రివ్యూ: డంకీ.. ఈ ఏడాది షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టారా..?

‘‘ప్రస్తుతం సోషల్‌మీడియా వేదికగా చాలామంది బంధుప్రీతి గురించి మాట్లాడుతున్నారు. మేము ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉందన్న విషయాన్ని వాళ్లు గుర్తించడం లేదు. ఈ స్థాయికి రావడం అంత తేలికైన విషయం కాదు. ఈ పోరాటంలో దాదాపు 40 ఏళ్లు గడిచిపోయాయి. నా శ్రమను వాళ్లు చూడటం లేదు. అసిస్టెంట్‌గా రోహిత్‌ శెట్టి  పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు.. తినడానికి కూడా అతని వద్ద డబ్బుల్లేవు’’ అని అజయ్‌ చెప్పారు.

తన కుమార్తె నైసాపై వస్తోన్న ట్రోల్స్‌ను ఉద్దేశించి.. ‘‘ఆ ట్రోల్స్‌, మీమ్స్‌ చూసి మేము ఎంతో బాధపడ్డాం. కొంతమంది మన గురించి అనవసర వ్యాఖ్యలు చేయొచ్చు. అంటే దాని అర్థం ప్రపంచం మొత్తానికి మనపై అదే విధమైన అభిప్రాయం ఉందని కాదు.  మనం మంచి విషయాలు రాస్తే.. దాన్ని చదవడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. అందుకే కొంతమంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు’’ అని అజయ్‌ అన్నారు. ప్రస్తుతానికి తన కుమార్తెకు సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని, భవిష్యత్తులో ఆమె ఆలోచన ఎలా ఉంటుందో తనకు తెలియదన్నారు. భవిష్యత్తులో ఆమె ఇండస్ట్రీలోకి వస్తానంటే అంగీకరిస్తానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని