Akhil Agent: ‘ఏజెంట్‌’కు ఏం కష్టాలు వచ్చాయ్‌ రా బాబూ.. ఇప్పట్లో ఓటీటీలో రానట్లేనా?

Akhil Agent ott: అఖిల్‌ కథానాయకుడిగా నటించిన ‘ఏజెంట్‌’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై సోషల్‌మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Published : 08 Jul 2023 17:57 IST

హైదరాబాద్‌: అఖిల్‌ (Akhil Akkineni) కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’ (Agent). ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో ఓటీటీలో వస్తే చూద్దామని పలువురు సినీ ప్రియులు వేచి చూస్తుండగా, అక్కడ కూడా వాయిదా పడుతూ వస్తోంది. (Agent Ott) ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌ ఈ సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకున్నసంగతి తెలిసిందే. రెండు వారాలకే సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ, అనుకున్న తేదీకి స్ట్రీమింగ్‌ వాయిదా పడింది. దీంతో కొత్త తేదీని ప్రకటిస్తామని సోనీలివ్‌ తెలిపింది.

మరోవైపు థియేటర్‌ వెర్షన్‌లో ప్రేక్షకులను విసిగించిన సన్నివేశాలను తీసేసి, ఎడిటింగ్‌లో కత్తెర వేసిన ఆసక్తికర సన్నివేశాలను జత చేస్తున్నారని టాక్‌ నడిచింది. అది పూర్తయిన తర్వాత స్ట్రీమింగ్‌ అవుతుందని అందరూ ఆశించారు. కానీ, అలాంటిదేమీ లేదని, థియేటర్‌ వెర్షన్‌లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర ఇటీవల తెలిపారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. చిత్ర బృందం ఇప్పటివరకూ సోనీలివ్‌కు ఎన్‌వోసీ (నిరభ్యంతర పత్రం) ఇవ్వలేదని టాక్‌. దీంతో ‘ఏజెంట్‌’ ఇప్పట్లో రావడం కష్టమేనని అంటున్నారు.

అయితే, ‘ఏజెంట్‌’ స్ట్రీమింగ్‌కు సంబంధించి సర్వహక్కులు సోనీలివ్‌కు ఉన్నాయని, ఈ విషయంలో మేకర్స్‌ చేసేదీ ఏమీ లేదని, అనిల్‌ సుంకర చెబుతున్నారు. సోనీలివ్‌ తమని ఇప్పటివరకూ స్ట్రీమింగ్‌ కోసం ‘ఏజెంట్‌’ ప్రింట్‌ అడగలేదని అంటున్నారు. ఇదే విషయాన్ని ఓ అభిమాని సోనీలివ్‌ను ట్విటర్‌ వేదికగా అడగ్గా ‘సినిమాలు, షోలకు సంబంధించిన ప్రకటనల కోసం ఎప్పటికప్పుడు మా సామాజిక మాధ్యమాలను అనుసరించండి’ అని ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చి చేతులు దులుపుకొంది. ఇదంతా చూసిన అభిమానులు ‘అయ్యగారి సినిమా ఏం కష్టాలు వచ్చాయ్‌ రా బాబూ’ అని ట్విటర్‌లో కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక ‘ఏజెంట్‌’ కథ విషయానికొస్తే, స్పై అవ్వడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న రిక్కీ అలియాస్‌ రామకృష్ణ (అఖిల్‌) అనే యువకుడు ఏం చేశాడు? భారత దేశాన్ని నాశనం చేసేందుకు గాడ్‌ అలియాస్‌ ధర్మ (డినో మోరియా) చైనాతో కలిసి చేపట్టిన మిషన్‌ రాబిట్‌ను ఎలా అడ్డుకున్నాడు? రా చీఫ్‌ మహదేవ్‌ (మమ్ముటి) ఆయన ఆదేశాల్ని పక్కకు పెట్టి రిక్కీ కొని తెచ్చుకున్న ప్రమాదాలేంటి? అసలు స్పై అవ్వాలన్న తన లక్ష్యం వెనకున్న బలమైన కారణం ఏంటి? వైద్య (సాక్షి వైద్య)తో అతని ప్రేమాయణం ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాక్షి వైద్య కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. అనిల్‌ సుంకర నిర్మించారు. రూ.80 కోట్లతో ‘ఏజెంట్‌’తీస్తే రూ.16 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు