Avatar 2: ఆయన ప్రతిభకు తలవంచాలని ఉంది..: అక్షయ్‌కుమార్‌

అవతార్‌2 (ది వే ఆఫ్‌ వాటర్‌)(Avatar2: The Way Of Water) సినిమా స్పెషల్‌ షో చూసిన ప్రముఖులు ట్విటర్‌ వేదికగా సినిమాకు జై కొడుతున్నారు. సినిమా అద్భుతమని వర్ణిస్తున్నారు.

Published : 15 Dec 2022 17:31 IST

హైదరాబాద్‌: అవతార్‌2 (ది వే ఆఫ్‌ వాటర్‌-Avatar2: The Way Of Water) సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన లోకంలో విహరించడానికి ఇప్పటికే కొన్ని లక్షల మంది టికెట్స్‌ బుక్‌ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సినీ ప్రముఖుల కోసం ఇటీవల అవతార్‌2 ప్రత్యేక షో ప్రదర్శించారు. అది చూసిన  ప్రముఖులు జేమ్స్‌ కామెరూన్‌(James Cameron)పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చూసిన అనంతరం బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, వరుణ్‌ ధావన్‌లు ట్విటర్‌ వేదికగా అవతార్‌2పై వాళ్ల అభిప్రాయాన్ని తెలిపారు.

‘రాత్రి అవతార్‌2 సినిమా చూశాను. ఈ సినిమా గురించి చెప్పడానికి అద్భుతం అనే పదం కూడా సరిపోదు. నేను మంత్రముగ్దుడినైపోయాను. ఇంకా ఆ సినిమాలో నుంచి బయటకు రాలేకపోతున్నా. జేమ్స్‌ కామెరూన్‌ ప్రతిభకు తలవంచాలని ఉంది’ అంటూ అవతార్‌2 సినిమాపై అక్షయ్‌ కుమార్(Akshay Kumar) పొగడ్తల వర్షం కురిపించారు.
వరుణ్‌ ధావన్‌ ఈ సినిమా గురించి మాట్లాడుతూ..‘అవతార్‌2లోని విజువల్స్‌, ఎమోషన్స్‌ చూసి ఆశ్చర్యపోయాను. నేను ఈ సినిమాను మళ్లీ త్రీడీలో చూడాలనుకుంటున్నా’ అని అన్నారు. ఇక సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా రేపు (డిసెంబర్‌ 16) ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం భారతదేశంలో 6 భాషల్లో అలరించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు కోట్లలో వ్యూవ్స్‌ వచ్చాయి. అవతార్‌ సినిమా వచ్చిన 13 సంవత్సరాలకు దాని సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని