Tharun bhaskar: సల్మాన్‌ఖాన్‌కు నో చెప్పాను: తరుణ్‌ భాస్కర్‌

అతని సినిమాల్లో కంటెంట్‌తో పాటు కామెడీ కూడా బిందాస్‌గా ఉంటుంది. షార్ట్‌ ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించి రచయితగా, దర్శకుడిగా అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్స్‌తో ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయ్యారు ఈ యూత్‌ఫుల్‌ డైరెక్టర్‌.

Updated : 01 Jun 2022 10:27 IST

అతని సినిమాల్లో కంటెంట్‌తో పాటు కామెడీ కూడా బిందాస్‌గా ఉంటుంది. షార్ట్‌ ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించి రచయితగా, దర్శకుడిగా అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్స్‌తో ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయ్యారు ఈ యూత్‌ఫుల్‌ డైరెక్టర్‌. నటుడిగా కూడా చక్కటి పాత్రల్లో నటించి మల్టీ టాలెంటెడ్‌ అనిపించుకుంటున్నాడు. క్రేజీ ఎంటర్‌టైనర్స్‌తో యూత్‌ని అలరిస్తోన్న తరుణ్‌ భాస్కర్‌ తన సినీ ప్రయాణం గురించి ఆలీతో చెప్పిన ముచ్చట్లేంటో చూద్దాం.

తరుణ్‌ భాస్కర్‌ యాక్టరా, డైరెక్టరా, సింగరా, డ్యాన్సరా...? మీది ఏ ఊరు?

తరుణ్‌ భాస్కర్‌: కుక్‌ కూడా. నాకు నాన్‌ వెజ్‌ అంటే చాలా ఇష్టం. అది లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. అప్పుడప్పుడు మిమిక్రీ చేస్తా. పెయింటింగ్‌ బాగా వేస్తా. చాలా అవార్డులు కూడా వచ్చాయి. అమ్మ వాళ్లది తిరుపతి. నాన్న వాళ్లది వరంగల్‌. భాస్కర్‌ అనేది మా ఇంటి పేరు కాదు. అది తాతయ్య పెట్టిన పేరు. అలా కొనసాగుతూ ఉంది.

షార్ట్‌ఫిల్మ్స్‌తో కెరీర్ మొదలు పెట్టారు కదా?అసలు షార్ట్‌ఫిల్మ్స్‌ చేయాలన్న ఆలోచన ఏలా వచ్చింది?

తరుణ్‌ భాస్కర్‌: మనకంటే తెలివైనది మన స్మార్ట్‌ఫోన్‌. నాకు ఉన్న ఆసక్తి కొద్దీ నేను ఒక ప్రయోగం చేద్దామనుకున్నాను తప్ప సినిమాలు చేసేసి వంద కోట్లు సంపాదించేద్దామన్న ఆశ ఎప్పుడూ లేదు. తప్పులు చేసి నేర్చుకోవడం కంటే పెద్ద గురువు మరొకరు ఉండరు. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు.

దర్శకుడిగా అవకాశం ఎప్పుడు వచ్చింది?

తరుణ్‌ భాస్కర్‌: ‘సైన్మా’ అని ఒక షార్ట్‌ఫిల్మ్‌ చేశా. అది లక్ష్మీ మంచు చూశారు. తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగారు. ఓ ప్రేమ కథ రాస్తున్నాను అని చెప్పి వినిపించాను. తనకు చాలా నచ్చింది. తను వెంటనే ఈ సినిమా నాతోనే చేయ్యాలి అని అక్కడే ఒక చెక్‌ ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. చాలా ప్రయత్నాలు చేశాక. ఒకరోజు రాజ్‌ కందుకూరి ప్రొడ్యూస్‌ చేస్తే సినిమా అయింది.

విజయ్‌ దేవరకొండని ఎక్కడ చూశారు. ‘పెళ్లిచూపులు’ సినిమా యూత్‌కి ఎందుకు అంతలా నచ్చిందంటారు?

తరుణ్‌ భాస్కర్‌: విజయ్‌తో నేను కలిసి తిరిగేవాడిని. మంచి మిత్రులం. ఒకరోజు ఎవరితోనో ఎందుకు మనమే చేద్దాం సినిమా అనుకుని మొదలుపెట్టాం. నేను తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా. అలా నేచురల్‌గా తీశాము కాబట్టి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. మళ్లీ విజయ్‌తో సినిమా తీస్తాను. కానీ దానికి టైమ్‌ ఉంది.

‘ఈ నగరానికి ఏమైంది’ దర్శకుడిగా రెండో సినిమా కదా? మళ్లీ సినిమాలు ఎందుకు చేయలేదు?

తరుణ్‌ భాస్కర్‌: ఈ సినిమా 2018లో వచ్చింది. నా నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. నాకు చాలా నచ్చిన సినిమా. నేను స్నేహానికి చాలా గౌరవం ఇస్తా. ఈ సినిమా తర్వాత నేను ఒక వెబ్‌సిరీస్‌ ప్రొడ్యూస్‌ చేశాను. తర్వాత రెండు తమిళ సినిమాలకు డైలాగ్స్‌ అనువాదం చేశాను. ఒక టీవీ షో చేశాను. నెట్‌ఫ్లిక్స్‌కు ఓ వెబ్‌సిరీస్‌ చేశాను.  

మీరు ఎందుకు అందరితో ఇంగ్లిషులో మాట్లాడతారుట? బాగా చదివే వాళ్లటగా నిజమేనా?

తరుణ్‌ భాస్కర్‌: నేను చదువుకున్న స్కూల్‌లో అంతా ఇంగ్లిషులోనే మాట్లాడాలి. వేరే భాష మాట్లాడితే కొట్టేవాళ్లు. అలా ఇంగ్లిష్‌లో మాట్లాడం అలవాటైంది. కానీ, ఇండస్ట్రీకి వచ్చాక అర్థమైంది తెలుగులో మాట్లాడకపోతే జనాలు కొడతారని(నవ్వుతూ). ఇక చదువు... దాని గురించి ఒక్కటే మాట చెప్తా.. నేను కట్టిన సప్లమెంటరీ ఫీజులతో ఓ బిల్డింగ్‌ కట్టి ఉంటారు(నవ్వులు). సుమారు ఓ 23 సార్లు కట్టి ఉంటా.

తరుణ్‌ భాస్కర్‌ యాక్టర్‌ ఎప్పుడు అయ్యాడు?ప్రతి సినిమాకు ఓ కమెడియన్‌ని పరిచయం చేస్తున్నారు. తర్వాత సినిమాలో ఎవర్ని చేస్తున్నావు?

తరుణ్‌ భాస్కర్‌: ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాలో నటించాను. ఆ సినిమాని విజయ్‌ ప్రొడ్యూస్‌ చేశాడు. ఇప్పుడు చూస్తే ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ‘మహానటి’లో సింగీతం శ్రీనివాస్‌ పాత్ర చేశాను. పెళ్లిచూపులు సినిమాతో ప్రియదర్శికి. ‘ఈ నగరానికి ఏమైంది’తో అభినవ్‌కి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఓ క్రైమ్‌ కామెడీ రాస్తున్నాను. ‘ఓరుగల్లు’ అనే వెబ్‌సిరీస్‌ తీస్తున్నాం.

‘పెళ్లిచూపులు’ తర్వాత హిందీ,తమిళం సినిమాల్లో ఆఫర్‌ వచ్చినా ఎందుకు వదులుకున్నారు?
తరుణ్‌ భాస్కర్‌: నేను ‘పెళ్లిచూపులు’ సినిమా కోసం వందశాతం కష్టపడ్డాను. ఆ సినిమా తర్వాత సల్మాన్‌ఖాన్‌ ముంబయికి రమ్మని పిలిచారు. ఆయన బంధువు అబ్దుల్‌ అగ్నిహోత్రిని కలిశాము. పెళ్లిచూపులు రీమేక్‌ చెయ్యమన్నారు. నేను నో చెప్పాను. ఎందుకంటే అదే కథని మళ్లీ వాళ్లకు చెప్పి నా సమయాన్ని వృథా చేసుకోవాలని నేను అనుకోలేదు. 

విజయ్‌మాల్యా తెలుసుటగా మీకు? వాళ్ల అమ్మాయి పెళ్లికి కూడా వెళ్లారట?

తరుణ్‌ భాస్కర్‌: అవును. నేను ఇంతకు ముందు వెడ్డింగ్‌ వీడియోగ్రఫీ చేసేవాడ్ని. అప్పుడు జోసఫ్‌ అని టాప్‌ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌ ఉన్నాడు. ఆయన ద్వారా విజయ్‌మాల్యా వాళ్ల అమ్మాయి వెడ్డింగ్‌కి వీడియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. అక్కడకు వెళ్లగానే నాకు కెమెరా ఇచ్చి దీపికాపదుకొణె వీడియో తీయమన్నారు.

మీ బ్రదర్‌ రాజకీయాల్లో ఉన్నారని విన్నాను నిజమేనా?

తరుణ్‌ భాస్కర్‌: అవును. చాలా మంది ఉన్నారు. మా నాన్న స్టూడెంట్‌ ఉస్మానియా యూనివర్సిటీలో యూనియన్‌ లీడర్‌గా ఉండేవాడు. మా బంధువు ప్రణయ్‌ భాస్కర్‌ ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా చేశారు. ప్రస్తుతం తెలంగాణ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ కూడా మా చిన్నాన్నే. అలా చాలా మంది ఉన్నారు. అందుకే ఏదైనా గొడవ జరిగితే వరంగల్‌కు రా చూసుకుందాం అంటాను. అక్కడ వాళ్లందరూ ఉంటారు కదా అందుకు(నవ్వుతూ).

ఓ పెద్ద హీరో నా ఇమేజ్‌ అంతా పక్కన పెట్టి నా గురించి కథ రాయమని అడిగారట ఎవరు ఆ హీరో.. ఏంటి ఆ కథ?

తరుణ్‌ భాస్కర్‌: అవును. ‘పెళ్లిచూపులు’ సినిమా తర్వాత మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌, నాగార్జున వీళ్లందరూ నిజంగా నన్ను ప్రోత్సహించారు. నాకు ఫోన్‌ చేసి అడిగారు. వాళ్లందరినీ కలిసే అవకాశం వచ్చింది. మొదట రవితేజ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఒకరు, ఇద్దరు కాదు చాలా మంది ఫోన్‌ చేశారు. చాలా బాగా చేశావు. ఎప్పుడూ ఇలానే ఉండాలి అని చెప్పారు. నేను పెద్ద హీరోతో సినిమా తీయాల్సి వస్తే ముందు భయపడతాను. ఎందుకంటే సినిమా బాగా వస్తే మంచి పేరు వస్తుంది. కానీ అది బాగా రాకపోతే అప్పటి వరకు ఉన్న పేరు కూడా పోతుంది.

‘ఈ నగరానికి ఏమైంది’ పార్ట్‌2 ఎప్పుడు తీస్తున్నారు?

తరుణ్‌ భాస్కర్‌: ఆ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా మీద అందరూ ఒక స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. తప్పకుండా 2024లో చేస్తాను. 

‘పెళ్లిచూపులు’ సినిమా సమయంలో ఏదో ప్రమాదం జరిగిందటా ఏంటది?నీ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ గురించి చెప్పు?

తరుణ్‌ భాస్కర్‌: సినిమా అంతా షూటింగ్‌ అయ్యాక లాస్ట్‌ సీన్‌ తీస్తున్నప్పుడు ట్రక్కు నడుపుదామనుకున్నాం. అందులో విజయ్‌, ప్రియదర్శి, అభయ్‌, నేనుఅందరూ ఉన్నాం. సడెన్‌గా బ్రేక్‌ ఫెయిల్‌ అయింది. చివరికి ఒక చెట్టును గుద్దుకొని ఆగింది. దీంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. నేను కాలేజీలో చేరినప్పుడు బైక్‌ కొనిపెట్టమని మా నాన్నని ఎప్పుడూ గొడవ చేసేవాడ్ని. అప్పుడు సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ కొనిచ్చాడు. అది నడుపుతూ పోతుంటే పార్ట్‌లన్నీ ఊడిపోతూ ఉండేవి.

తర్వాత ఏం చేయబోతున్నారు. యాక్టింగా, దర్శకత్వమా ?

తరుణ్‌ భాస్కర్‌: రెండూ ఉన్నాయి. యాక్టింగ్‌ ఆపేద్దాం అనుకున్నప్పుడు చాలా ఆసక్తికరమైన పాత్రలు వచ్చాయి. మంచి సినిమాల్లో అవకాశం వచ్చింది. అలాగే కొన్ని సినిమాలు డైరెక్ట్‌ చేయబోతున్నా. త్వరలోనే వాటి వివరాలను చెబుతాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని