Pushpa 2: ‘పుష్ప ది రూల్‌’ రిలీజ్‌ డేట్‌.. ప్రకటించిన టీమ్‌

‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule) రిలీజ్‌ డేట్‌ వెలువడింది. ఈ మేరకు చిత్రబృందం పోస్ట్‌ పెట్టింది. 

Published : 11 Sep 2023 16:08 IST

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule) ఒకటి. అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ తాజాగా వెలువడింది. ‘పుష్ప ది రూల్‌’ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. దీని ప్రకారం, వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనపై బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్‌’ (Pushpa The Rise). 2021లో విడుదలైన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘పుష్ప ది రూల్‌’ సిద్ధమవుతోంది. రష్మిక (Rashmika) కథానాయికగా శ్రీవల్లి పాత్రలో అలరించనున్నారు. ప్రతి నాయకుడి పాత్రలో ఫహద్ ఫాజిల్ కనిపించనున్నారు. పార్ట్‌ 1కు వచ్చిన విశేష ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌ లెవల్‌లో తెరకెక్కించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్‌పై ఇది నిర్మితమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. మరోవైపు, పుష్ప పార్ట్‌ 1కు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. 

‘పుష్ప ది రైజ్‌’లో ఏం చూపించారంటే: ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా పుష్పరాజ్‌ పాత్ర పోషించాడు. సాధారణ కూలీ నుంచి స్మగ్లింగ్‌ సిండికేట్‌ శాసించే స్థాయికి అతడు ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో అతడు మంగ‌ళం శ్రీను (సునీల్‌), కొండా రెడ్డి (అజ‌య్ ఘోష్‌) నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే ఆసక్తికర విషయాలను ఇందులో చూపించారు. ఎస్పీ భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్ (ఫహాద్ ఫాజిల్‌)తో పుష్పరాజ్‌కు ఎలాంటి విరోధం ఏర్పడింది. పుష్పరాజ్‌ను అంతం చేయడానికి షెకావత్‌ ఏం చేశాడు? స్మగ్లింగ్‌ సిండికేట్‌కు కింగ్‌ అయిన తర్వాత పుష్పరాజ్‌ తదుపరి స్టెప్‌ ఏమిటి? అనే విషయాలతో ‘పుష్ప 2’ ఉండొచ్చని సినీ ప్రియులు అనుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని