bobbili raja: ఆ మార్పులతో కథ మొత్తం మారిపోయింది

సురేశ్‌ సంస్థ రజతోత్సవ సంవత్సరంలో నిర్మించిన ‘బొబ్బిలి రాజా’ చిత్ర నిర్మాణ బాధ్యతలు పూర్తిగా సురేశ్‌బాబుకి అప్పగించారు రామానాయుడు.

Updated : 08 Jul 2023 09:31 IST

వెంకటేశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ అత్యంత భారీ వ్యయంతో ‘ కలియుగ పాండవులు’ చిత్రం నిర్మించారు దిగ్గజ నిర్మాత రామానాయుడు. ఆ తర్వాత సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ‘ప్రేమ’, ‘ బ్రహ్మపుత్రుడు’ చిత్రాలతో ప్రభుత్వ అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్నాడు వెంకటేశ్‌. అయితే తన తమ్ముడికి ఒక బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇవ్వాలని, మాస్‌ హీరోగా నిలబెట్టాలని సురేశ్‌బాబు ఆలోచించి నిర్మించిన భారీ చిత్రం ‘బొబ్బిలిరాజా’. అంతకుముందు ఒకటో రెండో చిత్రాలకు నిర్మాతగా సురేశ్‌బాబు పేరు పెట్టినా.. వాటి నిర్మాణంలో ఆయన పాత్ర తక్కువే. అయితే సురేశ్‌ సంస్థ రజతోత్సవ సంవత్సరంలో నిర్మించిన ‘బొబ్బిలి రాజా’ చిత్ర నిర్మాణ బాధ్యతలు పూర్తిగా సురేశ్‌బాబుకి అప్పగించారు రామానాయుడు.

పల్లెటూరు నుంచి ఫారెస్ట్‌కు..

హీరో పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్లి  ప్రతీకారం తీర్చుకునే పాయింట్‌తో కథ సిద్ధం చేశారు పరుచూరి సోదరులు. అయితే ఇందులో కొత్తదనం ఏమీ లేదని పల్లెటూరు నుంచి అడవికి హీరోను తీసుకెళ్తే అది కొత్తగా ఉంటుందని సూచించారు సురేశ్‌ బాబు. ఆ ప్రకారం కథలో మార్పులు చేశారు పరుచూరి సోదరులు. మొదట ఇందులో వాణిశ్రీ పాత్రను ధనవంతురాలిగా చూపిద్దామనుకున్నారు. అయితే ఆ పాత్రను మినిస్టర్‌ చేస్తే బాగుంటుందని పరుచూరి వెంకటేశ్వర రావు సూచించారు. ఫారెస్ట్‌ బ్యాక్‌ డ్రాప్‌లో జరిగే కథ కనుక ఆమె పాత్రను అటవీశాఖ మంత్రిగా మార్చారు. సురేశ్‌ సంస్థతో వాణిశ్రీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంస్థ నిర్మించిన అనేక చిత్రాల విజయంలో ఆమెది ప్రముఖ పాత్ర. తన వివాహానికి ముందు ఈ సంస్థలో ఆమె నటించిన చివరి చిత్రం ‘ఎంకి-నాయుడు బావ’. మళ్లీ ‘బొబ్బిలిరాజా’ చిత్రంతో ఈ సంస్థలో ఎంట్రీ ఇచ్చారు వాణిశ్రీ. ‘రాష్ట్రాన్ని అయినా రాసిస్తాను కానీ ఈ పెళ్ళికి అంగీకరించను’ అనే డైలాగుతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు వాణిశ్రీ. ఆమె భర్తగా సత్యనారాయణ, సోదరులుగా కోట శ్రీనివాసరావు, విద్యాసాగర్‌ నటించారు. వెంకటేశ్‌ తాత పాత్రను గుమ్మడి, తల్లి పాత్ర సుమిత్ర పోషించారు.

ఆ చిత్రం స్ఫూర్తితో..

ఫారెస్ట్‌ నేపథ్యంలో ‘గాడ్స్‌ మస్ట్‌ బీ క్రేజీ’ పేరుతో ఓ ఆంగ్ల చిత్రం వచ్చింది. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని ‘బొబ్బిలి రాజా’లో రీమేక్‌ చేశామని పలు సందర్భాల్లో నిర్మాత సురేశ్‌బాబు పంచుకున్నారు. ఆయన కజిన్‌ కె.రవీంద్రబాబు ఈ సినిమాతోనే ఛాయాగ్రాహకుడు పరిచయమయ్యారు. ఫారెస్ట్‌ లొకేషన్స్‌ ఎంపిక కోసం ఆయన వందల కిలోమీటర్లు ప్రయాణించారు. చివరకు తమిళనాడులోని పొల్లాచి సమీపాన ఉన్న అన్నామలై అడవులకు వెళ్లి 40 రోజులు షూటింగ్‌ చేశారు. అలాగే పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, ఖడ్గమృగాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో రిస్క్‌ చేసి మరీ షూటింగ్‌ చేశారు. తలకోన ఫారెస్ట్‌లో, నంద్యాల- గిద్దలూరు అడవుల్లో కొన్ని సన్నివేశాలను తీశారు. హెలికాప్టర్‌కి సంబంధించిన దృశ్యాలు ముంబయిలో చిత్రీకరించారు.

ఆల్‌టైమ్‌ రికార్డు

1990 సెప్టెంబర్‌ 14న ‘బొబ్బిలిరాజా’ విడుదలైంది. ఫస్ట్‌ డే టాక్‌ బాగానే ఉన్నా, రెండో రోజు నుంచి కలెక్షన్స్‌ తగ్గాయి. సినిమా క్లాస్‌గా ఉందని, మాస్‌ ఎలిమెంట్స్‌ మరిన్ని పెట్టి ఉంటే పెద్ద హిట్‌ అయ్యేదని తండ్రి రామానాయుడు అనడంతో సురేశ్‌ బాబు ఆలోచనలో పడ్డారు. క్లాసీ మాస్‌ పిక్చర్‌ తీసి తప్పు చేశానా? అని ఆయన అనుకున్నారు. అయితే సురేశ్‌ బాబు నమ్మకాన్ని నిజం చేస్తూ రెండో వారం నుంచి బొబ్బిలి రాజా కలెక్షన్లు ఊపందుకున్నాయి. విడుదలైన ప్రతి కేంద్రంలోనూ ఘన విజయాన్ని అందుకుంది. ‘అయ్యో అయ్యో’ అనే వెంకటేశ్‌ ఊత పదం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. వెంకటేశ్‌ కు తొలి సిల్వర్‌ జూబ్లీ చిత్రమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని