Money movie: చిరంజీవి సినిమాకు పోటీగా ‘మనీ’ విడుదల చేసిన ఆర్జీవీ

Money movie: జేడీ చక్రవర్తి కీలక పాత్రలో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘మనీ’ చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Published : 15 Jul 2023 10:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జేడీ చక్రవర్తి, చిన్నా, జయసుధ, పరేశ్‌ రావల్‌ కీలక పాత్రల్లో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన కామెడీ థ్రిల్లర్‌ ‘మనీ’ (Money). దర్శకుడు రాంగోపాల్‌వర్మ (Ramgopal Varma) ఈ సినిమాను నిర్మించారు. 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో ‘ఖాన్‌ దాదా’గా బ్రహ్మానందం కామెడీ సినిమాకే హైలైట్‌. హీరో అవ్వాలనుకుని మోసపోయే వ్యక్తిగా ఆయన పాత్ర తెగ నవ్వులు పంచింది. అయితే, ఆర్జీవీ ఈ సినిమాను చిరంజీవి నటించిన ‘మెకానిక్‌ అల్లుడు’కు పోటీగా విడుదల చేయటం గమనార్హం.

అప్పట్లో ఎవరైనా స్టార్‌ హీరో సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటే అత్యధిక థియేటర్‌లలో 50, 100 రోజులు ఆడేది. చిరంజీవిలాంటి అగ్ర కథానాయకుల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమాలకు థియేటర్లు దొరకాలంటే కాస్త కష్టమే. కనీసం మూడు, నాలుగు వారాల తర్వాత కానీ, మిగిలిన సినిమాలను ప్రదర్శించే వెసులుబాటు కలిగేది. ఈ సమయంలో దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సాహసం చేశారు. తాను నిర్మించిన ‘మనీ’ని చిరంజీవికి ‘మెకానిక్‌ అల్లుడు’ విడుదలై రెండు వారాలు కూడా కాకుండా పోటీగా విడుదల చేయాలని అనుకున్నారు. వర్మ నిర్ణయం విని ‘ఏంటి నీకు పిచ్చా. చిరంజీవి సినిమా ఆడుతుంటే దానికి పోటీగా విడుదల చేస్తావా’ అని అన్నారు. ‘ఏది ఏమైనా నా సినిమా విడుదల చేస్తా’ అని వర్మ అన్నారట. అది విని ఇండస్ట్రీలోని వారంతా ఆర్జీవీకి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అని నవ్వుకున్నారు.

ఈ విషయం తెలిసి కథానాయకుడు జేడీ చక్రవర్తి కూడా వర్మ దగ్గరకు వెళ్లి ‘సార్‌.. చిరంజీవిగారి సినిమాకు పోటీగా మన చిత్రం విడుదల చేయటం అవసరమా’అని అడిగారట. దీంతో వర్మ ఓ చిన్న లాజిక్‌ చెప్పారట. ‘‘ఆయన సినిమా థియేటర్‌లలో ఆడుతుండగా మన మూవీని విడుదల చేస్తున్నాం. ఒకవేళ మన చిత్రం ఫ్లాప్ అయిందనుకో..  ‘వీళ్లకు కొవ్వు కాకపోతే చిరంజీవి సినిమాకు పోటీగా విడుదల చేస్తే ఆడుతుందా? పెడుతుందా?’ అని అనుకుంటారు. కథ, గురించి ఇందులో నటీనటుల నటన గురించి పెద్దగా ఆలోచించరు. హిట్‌ అయిందనుకో.. ‘చిరంజీవి సినిమా ఉన్నా కూడా బాగా ఆడింది’ అని అంటారు. పైగా పబ్లిసిటీ కూడా వస్తుంది. అప్పుడు నిర్మాతగా నా కెరీర్‌, దర్శకుడిగా నాగేశ్వరరావు, హీరోగా నీ కెరీర్‌ సెట్‌ అయిపోయినట్టే’’ అని అన్నారట. అంతకు ముందు పలు సినిమాలకు కార్టూన్స్‌ రూపంలో పోస్టర్‌లు వేసినా, ఈ సినిమాతో మళ్లీ వాటిని వర్మ అందరికీ గుర్తు చేశారు. ఆర్టిస్ట్‌ మల్లిక్‌తో ‘మనీ’ కోసం ప్రత్యేక పోస్టర్లు డిజైన్‌ చేశారు.

ఇక్కడ మరో విషయం ఏంటంటే, సినిమా విడుదలకు ఒక రోజు ముందు పోస్టర్లు ముద్రించడం గమనార్హం. ఎందుకంటే, కనీసం పోస్టర్లు వేయడానికి కూడా చాలినన్ని డబ్బులు లేవట. ‘మనీ’ విడుదలైన మొదటి రోజే పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుని బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.55లక్షలతో సినిమాను నిర్మిస్తే ఐదు రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది. ఇందులో రెండు పాటలను కథానాయకుడు జేడీ చక్రవర్తి పాడటం విశేషం. తొలుత ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కీరవాణిని తీసుకున్నారు. ఆయన రెండు పాటలు కూడా కంపోజ్‌ చేశారు. ఆ తర్వాత ఆయనకు వరుస అవకాశాలు రావడంతో బిజీ అయిపోయారు. దీంతో  శ్రీనివాసమూర్తి వచ్చి, మిగిలిన పాటలను పూర్తి చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని