Shamsher Shankar: ఆ ఇద్దరు సీఎంలు తీసిన సినిమాల్లో నటించిన ఏకైక తెలుగు హీరో కృష్ణ

తమిళ రాజకీయ రంగంలో ఎంజీఆర్‌, ఎం.కరుణానిధి తిరుగులేని నాయకులు. సినీ రంగంలోనూ తమ ప్రతిభ చాటిన ప్రముఖులు.

Published : 02 Aug 2023 09:45 IST

హైదరాబాద్‌: తమిళ రాజకీయ రంగంలో ఎంజీఆర్‌, ఎం.కరుణానిధి తిరుగులేని నాయకులు. సినీ రంగంలోనూ తమదైన ముద్రవేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అటు ఎంజీఆర్‌కి, ఇటు కరుణానిధికి సంబంధించిన వ్యక్తులు హీరో కృష్ణతో తెలుగులో సినిమాలు తీయడం. ఇద్దరు తమిళనాడు ముఖ్యమంత్రులు తెలుగులో నిర్మించిన చిత్రాల్లో నటించడం హీరో కృష్ణకి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం. ఎంజీఆర్ సన్నిహితుడిగా పేరొందిన పి.పద్మనాభన్ ‘మక్కళ్‌ తిలగం మూవీస్’ పతాకంపై కృష్ణతో ఒకటి కాదు రెండు సినిమాలు తీశారు. అందులో మొదటిది ‘షంషేర్‌ శంకర్’. శ్రీదేవి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకుడు. తన చిత్రాల్లో ఉండే మాస్‌ అంశాలను మేళవించి, ‘షంషేర్‌ శంకర్‌’ తీశారు. పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ‘శంకర్‌’ పాత్రలో కృష్ణ అదరగొట్టేశారు. ఈ సినిమాలో ఆయన ధరించిన మారు వేషాలు అభిమానుల్ని అలరించాయి. ముఖ్యంగా ‘మాయదారి మల్లిగాడు’ గెటప్‌లో కృష్ణ మరోసారి కనిపించడం విశేషం.

ఇక రెండో సినిమా విషయానికొస్తే, తమిళ చిత్రాలకు దర్శకునిగా, ఛాయాగ్రాహకునిగా పనిచేసిన అమృతము దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం ‘అమ్మాయికి మొగుడు-మామకు అల్లుడు’ పుంపుహార్ ప్రొడక్షన్స్ బేనర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి మహారధి సంభాషణలు రాశారు. జమిందారీ కుటుంబ నేపథ్యంలో జరిగే కథ ఇది. ఇందుకోసం మైసూరులోని లలిత -మహల్ ప్యాలెస్‌ను చిత్రీకరణ కోసం తీసుకున్నారు. సినిమా కీలక సన్నివేశాలన్నీ బెంగళూరులోనే తీశారు. ఇక ఈ చిత్రంలో నటించిన రజనీ శర్మ నేపాలి. తమిళ, హిందీ, మలయాళ నేపాలి చిత్రాల్లో ఆమె నటించారు. శంకరాభరణం.. రాజ్యలక్ష్మి ఈ సినిమాలో మరో హీరోయిన్‌. టీజింగ్ క్యారెక్టర్‌ చేయడం హీరో కృష్ణకు బాగా అలవాటు కనుక చాలా హుషారుగా నటించారు. పాత్రలో జీవించారు. అలాగే మామ పాత్రను సత్యనారాయణ కూడా తనదైన శైలిలో పోషించారు. అలా ఇద్దరు తమిళ ముఖ్యమంత్రులు తీసిన సినిమాల్లో కృష్ణ భాగస్వామి అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని