Bollywood: ఇతిహాసాలపై బాలీవుడ్‌ చూపు

‘తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి’ అనే సామెతను నిజం చేస్తోంది బాలీవుడ్‌. ‘తీస్తే రామయణ, భారత గాథల్నే తీయాలి’ అన్నంత భారీగా సినిమాలు తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం బీ టౌన్‌ బడా

Updated : 14 Jun 2021 10:06 IST

రామాయణ, భారత గాథలతో బీటౌన్‌లో రానున్న చిత్రాలివే!

‘తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి’ అనే సామెతను నిజం చేస్తోంది బాలీవుడ్‌. ‘తీస్తే రామయణ, భారత గాథల్నే తీయాలి’ అన్నంత భారీగా సినిమాలు తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం బీ టౌన్‌ బడా సినిమాలన్నీ దాదాపు ఇతిహాసాల ఆధారంగా తీస్తున్నవే. ‘ఆది పురుష్‌’ నుంచి ‘రామసేతు’ వరకూ అన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నవే. వందల సంవత్సరాలుగా వింటూ వస్తున్న ప్రజలను ఇప్పటికీ రంజింపజేసే కథాంశాలు వాటిలో పుష్కలంగా ఉంటాయి. అందుకే బాలీవుడ్‌ మళ్లీ ఇతిహాసాల బాట పట్టింది. ఇప్పటికే కొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని ట్రాక్‌ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం!

ఆది పురుష్‌

‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు కథానాయకుడు ప్రభాస్‌. ఆయన రాముడిగా నటిస్తూ తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదిపురుష్’‌. సైఫ్‌ ఆలీఖాన్‌ లంకేశుడిగా చేస్తున్నారు. సీతగా కృతిసనన్‌ ప్రభాస్‌ సరసన నటించనుంది. ‘తానాజీ’తో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఓం రౌత్‌ దీనికి దర్శకుడు. రామాయణాన్ని కనీవినీ ఎరుగని రీతిలో త్రీడీ టెక్నాలజీతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అనువాదం చేసి వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది చిత్రబృందం.

రామసేతు

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం ‘రామసేతు’. అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్నారు. రామసేతు వంతెన కల్పనా? లేక నిజమా అనే కోణంలో ఇదొక మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతోంది. ఇందులో అక్షయ్‌ పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ కథానాయిక. ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియాలో తొలిసారి చిత్ర నిర్మాణంలో  పాలుపంచుకుంటోంది.

ఇమ్మోర్టల్‌ అశ్వథ్థామ

మహాభారతంలో గుర్తుండిపోయే మరో పాత్ర ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వథ్థామ. ఆయన కథాంశంతోనే ఇప్పుడు విక్కీ కౌశల్‌ హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.  దీన్నొక విజువల్‌ వండర్‌లా తీర్చిదిద్దేందుకు చిత్రబృందం ప్రయత్నాలు జరుపుతోంది. ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’తో విక్కీకి భారీ హిట్‌ను అందించిన ఆదిత్య ధర్‌ ‘ఇమ్మోర్టల్‌ అశ్వథ్థామ’ను తెరకెక్కిస్తున్నారు. సారా అలీఖాన్‌ కథానాయిక.

త్రీడీలో రామాయణం

అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్‌ మల్హోత్ర ‘రామాయాణ త్రీడీ’ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. ‘దంగల్‌’ దర్శకుడు నితీశ్‌ తివారి, ‘మామ్‌’ డైరెక్టర్‌ రవి ఉద్యవర్‌లు దర్శకులు. పాన్‌ ఇండియా చిత్రంగా భారీ ఎత్తున తీయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో చిత్రబృందం బిజీగా ఉంది.

జానకి కథ

‘రామాయణ త్రీడీ’, ‘ఆదిపురుష్‌’ సినిమాలతో పాటు మరో రామాయణ గాథ బాలీవుడ్‌ తెరపైకి రాబోతోంది. అలౌకిక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తిగా సీత కోణంలో నుంచి తెరకెక్కనుంది. కరీనా కపూర్‌ఖాన్‌ జానకిగా నటిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్‌ కథ, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. సీత పాత్రలో నటించేందుకు ఆమె భారీ రెమ్యునరేషన్‌ అడిగినట్లు బీటౌన్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అపరాజిత అయోధ్య

‘మణికర్ణిక’తో తొలిసారి మెగాఫోన్‌ పట్టింది బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ఇప్పుడు  మరోసారి  దర్శకురాలిగా అవతారమెత్తనుంది. ‘అపరాజిత అయోధ్య’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతేడాది ప్రకటించింది.  ఈ చిత్రానికి నిర్మాతగా కూడా ఆమె వ్యవహరించనున్నట్లు మీడియాకు తెలియజేసింది. అయోధ్య రామ మందిరం వివాదం చుట్టూ అల్లుకున్న కథతో ఇది తెరకెక్కనుంది. దీనికి కూడా కె. విజయేంద్రప్రసాద్‌ కథను అందించనున్నారని సమాచారం. 

ద్రౌపదిగా..

మహాభారతాన్ని ద్రౌపది దృష్టికోణం నుంచి తెరకెక్కించాలని సంకల్పించింది బాలీవుడ్. మధు మంతెన నిర్మాణంలో బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ద్రౌపదిగా నటించేందుకు ఒప్పుకుంది. భారీ ఎత్తున తీయాలనుకున్న ఈ సినిమాకు సరైన దర్శకుడు దొరక్కపోవడంతో ముందుకు కదల్లేదు. విశాల్‌ భరద్వాజ్‌తో తీయాలని ప్రయత్నించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమా తెరకెక్కితే మహాభారతాన్ని మరో కోణంలో చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కతుంది.

బ్రహ్మాస్త్ర

రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌ ఇలా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’.  ఫాంటసీ అడ్వెంచర్‌గా మొత్తం మూడు భాగాలుగా తీస్తున్నారు.  మన పురాణాల్లోని బ్రహ్మాస్త్ర ఆయుధం చుట్టూ తిరిగే కథ అని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. దీన్ని తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు  నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.  ‘వేక్‌ అప్‌ సిడ్’‌, ‘యే జవానీ హై దివాని’ సినిమాలను తీసిన అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. మొదటి భాగాన్ని గతేడాదే విడుదల చేయాల్సింది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు