Chandrababu: భారతీ సిమెంట్‌పై లేని నియంత్రణ ‘భీమ్లానాయక్‌’పై ఎందుకు?

సినిమా పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. ‘భీమ్లానాయక్‌’ సినిమా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం...

Updated : 25 Feb 2022 13:20 IST

హైదరాబాద్‌: సినిమా పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. ‘భీమ్లానాయక్‌’ సినిమా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం చంద్రబాబు వరుస ట్వీట్లు పెట్టారు. ‘‘రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ ముఖ్యమంత్రి జగన్‌ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారు. ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తోన్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోంది. వ్యక్తులను టార్గెట్‌గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ ధరపై లేని నియంత్రణ ‘భీమ్లానాయక్‌’ సినిమాపై ఎందుకు? ప్రపంచస్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తోన్న జగన్... తన మూర్ఖపు వైఖరి వీడాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజాసమస్యలు అన్నీ పక్కన పెట్టి, థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వతీరు తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమవారిని రక్షించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రం ‘భీమ్లానాయక్‌’పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తప్పులను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. నిలదీస్తుంది..! ‘భీమ్లానాయక్’ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని చంద్రబాబు అన్నారు.

మరోవైపు నారా లోకేశ్‌ సైతం థియేటర్లపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘భీమ్లానాయక్‌’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. ఆ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నా. జగన్‌.. ఒక్కో పరిశ్రమను ధ్వంసం చేస్తున్నారు. పరిశ్రమల ధ్వంసంతో రాష్ట్ర ప్రజలు భిక్షాటన చేసే పరిస్థితికి తెచ్చారు. సినీ పరిశ్రమ ఇందుకు మినహాయింపు కాదు. అడ్డంకులను అధిగమించి ఈ సినిమా విజయం సాధించాలి’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని