Cheppalani Vundi: మీరు మా ఊరు రాకండి.. వస్తే కొడతారని చెప్పారు: ప్రీతి నిగమ్‌

ప్రముఖ బుల్లితెర నటి ప్రీతి నిగమ్‌ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. ఆవిడ నట ప్రస్థానం గురించి పంచుకున్నారు.

Updated : 24 Apr 2023 15:35 IST

ఋతురాగాలు సీరియల్‌తో బుల్లితెర నట జీవితానికి శ్రీకారం చుట్టిన ప్రీతి నిగమ్‌ (Preeti Nigam) అంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కావ్యాంజలి సీరియల్‌లో నటించి జాతీయ అవార్డును అందుకున్నారు. ‘స్టూడెంట్ నెం.1’ (Student No: 1) చిత్రంతో తెలుగు సినిమాలోకి అరంగేట్రం చేశారు. తెలంగాణ ఉద్యమ చిత్రాల్లో చాకలి ఐలమ్మ వంటి వీర వనితల పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు.  అటు సీరియల్స్‌లో, ఇటు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు దశాబ్దాల నట ప్రస్థానంలో తన జీవితంలోని సంఘటనలను ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi ) కార్యక్రమంలో పంచుకున్నారు ప్రీతి నిగమ్‌.

మీ పూర్తి పేరు ఏంటి. ఉద్యోగం చేసే స్త్రీలకు మీరు ఇచ్చే సలహా ఏంటి?
ప్రీతి నిగమ్‌: నా పూర్తి పేరు ఇదే. ప్రీతి నిగమ్‌. పెళ్లి అయ్యాక ఇంటి పేరు మారుతుందేమో అనుకున్నా. మా వారు నువ్వు పుట్టినప్పటి నుంచి ఉన్న పేరునే కొనసాగించు అన్నారు. అందుకే పెళ్లి అయ్యాక కూడా నిగమ్‌ అలానే ఉంది. ప్రస్తుతం టీనేజ్‌లో పిల్లలకు కూడా ఓపిక ఉండడం లేదు. అన్ని పనులు త్వరగా అయిపోవాలి అనుకుంటున్నారు. సహనం లోపించింది. ఇంతకు ముందు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి.. ఇద్దరి మధ్య గొడవ వస్తే ఎవరో ఒకరు సర్ది చెప్పేవాళ్లు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే విడాకులు కూడా ఎక్కువయ్యాయి. ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. ఇదే నేను ఇచ్చే సలహా.

నాట్యం ఎప్పుడు నేర్చుకున్నారు. ప్రదర్శనలు ఇవ్వడం ఏ వయసు నుంచి మొదలు పెట్టారు?
ప్రీతి నిగమ్‌: ఐదో తరగతిలో ఉన్నప్పుడు నేర్చుకున్నా. ఆరో తరగతి నుంచి ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టా. కూచిపూడి, కథక్‌, ఫోక్‌ డ్యాన్స్‌ మూడూ నేర్చుకున్నా. మా అమ్మ ప్రోత్సాహంతోనే నేర్చుకున్నా. నాన్నకు కూడా ఇష్టమే కానీ, అమ్మాయి అలా బయటకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తే నలుగురు ఏమనుకుంటారో అనుకునే వారు. తర్వాత ఆయన కూడా చాలా ఎంకరేజ్‌ చేశారు. మా అమ్మ మమ్మల్ని అబ్బాయిల్లాగే పెంచారు.  మా నాన్న మేమందరం టీచర్లు అవ్వాలని కోరుకున్నారు. ఆ వృత్తి అయితే ఆడపిల్లలకు బాగుంటుందని ఆయన ఉద్దేశం. కానీ మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. మమ్మల్ని కూడా అలానే పెంచింది. మా ఇంట్లో వాళ్లంతా ఆమెను ఝూన్సీ లక్ష్మీభాయ్‌ అంటారు.

మీది చిత్రగుప్తుల వంశమని అంటుంటారు నిజమేనా?
ప్రీతి నిగమ్‌: మా ఇంటి పేరు నిగమ్‌. అది చూసి మేము బెంగాలీ అనుకుంటారు. కానీ మాది చిత్రగుప్తుల వంశం. చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు. వాళ్ల పిల్లల పేర్లే మా ఇంటి పేర్లయ్యాయి. నేను, మా అమ్మవాళ్లు, అమ్మమ్మ, తాతయ్య అందరం ఇక్కడే పుట్టి పెరిగాం. అంతకు ముందుతరం వాళ్లు ఉత్తర భారతదేశంలో ఉండే వాళ్లు. నిజాం పాలన సమయంలో కొంతమందిని బలవంతంగా హైదరాబాద్‌ తీసుకువచ్చారు. అలా మా పూర్వీకులు ఇక్కడకు వచ్చారు. నిజాం పాలనలో వాళ్లంతా మంచి పదవుల్లో ఉండేవాళ్లు.

నృత్య ప్రదర్శనల గురించి చెప్పండి?
ప్రీతి నిగమ్‌: నేను ఏడో తరగతి వరకు ట్రైన్‌ కూడా ఎక్కలేదు. నేను మొదటిసారి ఏడో తరగతిలో  ఉన్నప్పుడు విజయవాడలో జరిగిన ‘మహానాడు’ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చాను. అక్కడ మొదలైంది.. ఇప్పటి వరకు చాలా ప్రదర్శనలు ఇచ్చాను. దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో నేను ఈవెంట్స్‌కు వెళ్లాను. 1990లో మొదటిసారి విదేశాల్లో ప్రదర్శన ఇచ్చాను. మన దేశంలో కంటే విదేశాల్లోనే భారతదేశ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లి స్థిరపడిన వాళ్లు మన సంస్కృతిని చాలా బాగా కాపాడుతున్నారు. 

నటించే అవకాశం ఎప్పుడు వచ్చింది? తెలుగు రాదని ఓ మూగ పాత్ర ఇచ్చారని విన్నాం. ఎందులో అది?
ప్రీతి నిగమ్‌: డ్యాన్స్‌ షోలు చేసేటప్పుడే నాకు అవకాశాలు వచ్చాయి. మా కుటుంబ నేపథ్యం అది కాదు అని మా గురువుగారు ఆసక్తి చూపలేదు. ఒకసారి స్టేజ్‌పై డ్యాన్స్‌ చేస్తుంటే అమ్మాయి బాగుంది.. పెద్ద కళ్లు ఉన్నాయి. అని ఒక డాక్యుమెంటరీ అవకాశం వచ్చింది. అందులో మా గురువుగారు నేను కలిసి చేశాం. ఆ తర్వాత సూర్యచంద్ర గారు ఓ సినిమాలో మూగ అమ్మాయి పాత్ర ఇచ్చారు. నన్ను చూసి ఆయన రాసుకున్న కథలో మార్పులు చేసి మరీ ఓ మూగ పాత్రను సృష్టించారు. ఆ తర్వాత  ‘మాయల మరాఠీ’లో కూడా ఆయనే అవకాశం ఇచ్చారు.

ఋతురాగాలు సీరియల్ అవకాశం ఎలా వచ్చింది?
ప్రీతి నిగమ్‌: ఆ సీరియల్‌ నాకే కాదు చాలా మందికి జీవితాన్నిచ్చింది. తెలిసిన కెమెరామ్యాన్‌ ఒకాయన ఆ సీరియల్ ఆడిషన్స్‌ గురించి చెప్పారు. వెళ్లగానే సెలక్టయ్యా. ఇండస్ట్రీలోకి వచ్చి 33 సంవత్సరాలు అవుతోంది. మొదటిరోజు ఎంత భయంగా షూటింగ్‌కు హాజరయ్యానో ఇప్పటికీ అలానే వెళ్తాను. నా వృత్తిని నేను అంత గౌరవిస్తా.

ఋతురాగాల్లో తమ్ముడి పాత్ర చేసిన నగేష్‌ గారిని ఎలా ప్రేమించారు?
ప్రీతి నిగమ్‌: మాది ప్రేమ వివాహం కాదు. ఆయన నన్ను సంవత్సరం గమనించారట.. ఏం గమనించారో నాకు తెలీదు. అందుకే ఇప్పుడు గొడవ పడుతుంటా(నవ్వుతూ). మొదట నగేష్‌ వాళ్లింట్లో వాళ్లతో చెప్పారు. మా అత్తగారు అంగీకరించలేదు. తర్వాత ఆవిడ నన్ను కూతురిలా చూసుకున్నారు. మా అత్తింటి వాళ్లు ఏరోజూ నన్ను కోడలిగా చూడలేదు. కూతురిలానే చూశారు.

‘కావ్యాంజలి’ సీరియల్‌ మీకు జాతీయ అవార్డును తెచ్చింది. దాని గురించి చెప్పండి?
ప్రీతి నిగమ్‌: నేను చేసిన సీరియల్స్‌ అన్నీ ఒకసారి చూసుకుంటే.. నాకు పేరుతెచ్చిన వాటిల్లో చాలా సీరియల్స్‌ ఈటీవి నుంచే ఉంటాయి. కస్తూరి సీరియల్‌లో నెగెటివ్‌ పాత్ర చేశాను. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. కావ్యాంజలిలో కూడా మంజుల గారే నన్ను ఎంపిక చేశారు. అణిముత్యాల్లాంటి సీరియల్స్‌ అన్నిట్లో నేను నటించాను అని గర్వంగా ఫీలవుతా.

సీరియల్స్‌లో విలన్‌గా నటించిన మిమ్మల్ని బయట ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు?
ప్రీతి నిగమ్‌: సీరియల్‌లో ఒక పాత్ర సృష్టించాలంటే చాలా టీం వర్క్‌ చేయాల్సి ఉంటుంది. అన్ని పాత్రల కంటే విలన్‌ పాత్రల్లో నటించడం చాలా కష్టం. ఒకసారి విజయవాడ హోటల్‌లో ఆఫీస్‌ బాయ్‌ నావైపు ఏదోలా చూశాడు.  ఏంటి ఇలా చూస్తున్నాడని మొదట భయపడ్డా. తర్వాత ఎందుకు నన్ను అలా చూస్తున్నావని ఆ అబ్బాయిని అడిగాను. ‘మీరు ఆ సీరియల్లో చేశారు కదా.. మా అమ్మమ్మ రోజూ మిమ్మల్ని తిట్టకుంటుంది’ అని చెప్పాడు.  ఒక సారి వైజాగ్‌ ట్రైన్‌ ఎక్కితే ఒకావిడ వచ్చి..‘మీరు మా వైజాగ్‌ రాకండి మా వాళ్లంతా కొడతారు’ అని చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. వాళ్లు నేను చేసిన పాత్రల్లో అంత లీనమైయ్యారు. వాటిని ప్రశంసలుగా స్వీకరిస్తాను.

వెండితెరకు ఎలా పరిచయమ్యారు?
ప్రీతి నిగమ్‌: మొదట హిందీ సినిమాలో నటించాను. శ్యాంబెనగల్‌ గారి దగ్గర పనిచేసే అదృష్టం దక్కింది. బాలీవుడ్‌లో అంత పెద్ద దర్శకుడి దగ్గర అవకాశం రావడం చాలా గర్వంగా ఉంటుంది. తెలుగులో  ‘స్టూడెంట్ నెం.1’ నా మొదటి సినిమా. అమితాబచ్చన్‌తో కలిసి నటించాలని కోరిక ఉండేది. ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించాను. నా కల నెరవేరింది. మేకప్‌ లేకుండా కూడా చాలా సినిమాల్లో నటించాను.

తెలంగాణ ఉద్యమ సినిమాల్లో నటించే అవకాశం ఎలా వచ్చింది?
ప్రీతి నిగమ్‌: తెలంగాణ పోరాట సినిమా అనగానే నాకు తెలియని ఉత్సాహం వస్తుంది. అలాగే చాకలి ఐలమ్మ (Chakali Ilamma) పాత్ర.. ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి. అలాంటి పాత్రలో నేను నటించాను. ఆవిడ గురించి పుస్తకాలు చదివి తెలుసుకున్నా. ఇలాంటి పాత్రలన్నీ మనస్ఫూర్తిగా చేస్తాను. నేనైతే అమ్మ పాత్రలు పోషించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నన్ను బుల్లితెర జయసుధ అంటారు. నిజంగా అదృష్టవంతురాలిని అలాంటి గొప్ప వారితో పోలుస్తున్నారు. మేము నటించిన పాత్రల పేర్లు మీద చీరలు కూడా అమ్మేవారు. స్వప్న శారీస్‌, హరిత శారీస్‌ అని (నవ్వుతూ).

మీరు బొట్టుపెట్టుకోవడంలోనూ కొత్తదనాన్ని సృష్టించారు కదా.
ప్రీతి నిగమ్‌: ఆ విషయంలో ఈటీవీకి థ్యాంక్స్‌ చెప్పాలి. నాకు బొట్టు పెట్టుకోవడానికి టైం ఇచ్చేవాళ్లు. ఎండమావులు సీరియల్‌లో రకరకాల డిజైన్లు పెట్టుకున్నా. అవన్నీ నేను గీసుకుని తయారు చేసుకున్నా. మావారితో కలిసి మాయబజార్‌ సీరియల్‌లో నటించాను. అందులో శివపార్వతులుగా నటించాం. అప్పుడు నేను ప్రెగ్నెంట్‌ను. ఈటీవీ2లో న్యూస్‌ రీడర్‌గా కూడా చేశాను.

మీ అబ్బాయి గురించి చెప్పండి?
ప్రీతి నిగమ్‌: తన పేరు ఆర్యన్‌. సౌత్‌ నుంచి హాకీ టీంకు తొలి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆ విషయంలో చాలా గర్వంగా ఫీలవుతా. నన్ను ప్రీతి నిగమ్‌గా కంటే ఆర్యన్‌ వాళ్ల అమ్మగా గుర్తిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. వాడి కోసం మా వారు జాబ్‌ మానేశారు. వాడిని పోటీలకు తీసుకెళ్లేవారు. మా వారు నన్ను కూడా చాలా ప్రోత్సహిస్తారు. 

మీ డ్రీమ్‌ రోల్‌ ఏంటి? యువ నటీనటులకు మీరిచ్చే సలహా ఏంటి?
ప్రీతి నిగమ్‌: డ్యాన్స్‌ ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో చేయాలని కోరిక ఉంది. అలాగే కామెడీ పాత్రలోనూ నటించాలని ఉంది. ఎవరికైనా నేనిచ్చే సలహా ఒక్కటే.. సహనంతో ఉండాలి. మన వృత్తిని గౌరవించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని