నాటకానికి రమ్మని జయప్రకాశ్‌ అడిగారు: చిరు

స్టేజ్‌పై తన నాటకం చూడటానికి రమ్మని సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి అడిగారని అగ్ర కథానాయకుడు చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆయన హఠాన్మరణం కలచివేసిందని పేర్కొన్నారు. ‘జయప్రకాశ్‌ రెడ్డి మృతి సినీ పరిశ్రమకి తీరని లోటు. జయప్రకాశ్‌ రెడ్డి గారితో నేను ఆఖరిగా.....

Updated : 15 Nov 2022 16:24 IST

‘డబ్బు కోసం నటించే వ్యక్తి కాదు..’

హైదరాబాద్‌: స్టేజ్‌పై తన నాటకం చూడటానికి రమ్మని సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి అడిగారని అగ్ర కథానాయకుడు చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆయన హఠాన్మరణం కలచివేసిందని పేర్కొన్నారు. ‘జయప్రకాశ్‌ రెడ్డి మృతి సినీ పరిశ్రమకి తీరని లోటు. జయప్రకాశ్‌ రెడ్డి గారితో నేను ఆఖరిగా ‘ఖైదీ నెంబర్ 150’లో నటించా. ‘నాటక రంగం నన్ను కన్నతల్లి.. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి.. అందుకే ఇప్పటికీ శని, ఆది వారాల్లో షూటింగులు పెట్టుకోనండి. స్టేజ్‌ మీద ప్రదర్శన ఇస్తుంటా. మీరెప్పుడైనా రావాలి..’ అని అడిగేవారు. ఆ అవకాశాన్ని నేను పొందలేకపోయా. సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ అంటే మొదట గుర్తొచ్చేది జయప్రకాశ్‌ రెడ్డి గారే. తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్‌ సృష్టించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా’ అని చిరు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్‌. రాజమౌళి, వి.వి. వినాయక్‌, కథానాయకులు అల్లు అర్జున్‌, రామ్‌, కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు కూడా సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేశారు.

దిగ్భ్రాంతి చెందా: పవన్‌ కల్యాణ్‌

‘ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. రాయలసీమ మాండలికాన్ని పలకడంలో తనదైన బాణీని జయప్రకాశ్‌ రెడ్డి గారు చూపారు. నాటక రంగం నుంచి వచ్చిన ఆయన ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘గబ్బర్ సింగ్’లో పోలీస్ కమిషనర్‌గా ఆయన నటించారు. పాత్ర ఏదైనా చక్కగా ఒదిగిపోయేవారు. చిత్ర రంగంలో ఎంత బిజీగా ఉన్నా నాటక రంగాన్ని మాత్రం మరువలేదు. తెలుగు సినీ, నాటక రంగాలకు జయప్రకాశ్‌ రెడ్డి గారు లేని లోటు తీరనిది’

ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం: రాజమౌళి

‘జయప్రకాశ్‌ రెడ్డి గారి హఠాన్మరణం గురించి విని షాక్‌ అయ్యా, బాధపడ్డా. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. గత కొన్ని దశాబ్దాలుగా మీదైన శైలిలో మధురమైన కమెడియన్‌ పాత్రలు, విలన్‌ పాత్రలు పోషించి మాకు వినోదం పంచినందుకు ధన్యవాదాలు సర్‌. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’

నా అన్ని సినిమాల్లో ఉన్నారు: వి.వి వినాయక్‌

‘జయప్రకాశ్‌ రెడ్డి గారు లేరు అనగానే షాక్‌కి గురయ్యా. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన కామెడీ టైమింగ్ ఇంకా ఇష్టం. నా అన్ని సినిమాల్లోనూ ఆయన ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తిని, మంచి నటుడ్ని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది’

ఆయన డైలాగ్‌లు చెబుతూ..: దేవిశ్రీ

‘షాక్‌ అయ్యా.. నా గుండె పగిలింది. నేను జయప్రకాశ్‌ రెడ్డి గారికి గొప్ప అభిమానిని. స్టూడియోలో మేమంతా ఆయన స్టైల్‌లో డైలాగ్‌లు చెబుతూ.. పగలబడి నవ్వుకునేవాళ్లం. ఇదే విషయాన్ని ఆయనకు పలుమార్లు చెప్పా. జయప్రకాశ్‌ రెడ్డి గారు ప్రముఖ నటుడైనప్పటికీ.. ఎంతో వినయంగా ఉండేవారు. ‘సరిలేరు నీకెవ్వరు’లో ఆయన నటనను చాలా ఎంజాయ్‌ చేశారు. ఆయన లోటు తీరనిది. మిస్‌ యు సర్‌.. లవ్‌ యు’

డబ్బు కోసం నటించే వ్యక్తి కాదు: శ్రీను వైట్ల

‘నేను ఈ రోజు ఉదయం నిద్రలేచి ఫోన్‌ ఆన్‌ చేయగానే..చాలా మిస్డ్‌‌ కాల్స్‌ ఉన్నాయి. నా స్నేహితుడికి కాల్‌ చేస్తే జేపీ గారు ఇకలేరని చెప్పారు. జేపీ గారికి, నాకు ఉన్న బంధం డైరెక్టర్‌, నటుడు కాదు. నేను అంకుల్‌ అనేవాడ్ని. ఆయన నాన్న అనేవారు. నా తొలి సినిమా నుంచి చివరి సినిమా వరకు అన్నింటిలోనూ ఆయన ఉన్నారు. ఏదో కొన్ని సినిమాల్లో మాత్రమే డేట్స్‌ కుదరక చేయలేదు. ఆయన సినిమాలో లేకపోతే నాకు లోటుగా ఉండేది. ఆయనతో ఉన్నంత సేపు చాలా పాజిటివ్‌గా, సరదాగా ఉండేది. ఆయనకు ఏదైనా క్యారెక్టర్‌ చెబితే.. కళ్లల్లో మెరుపు కనిపించేది. దాన్ని ఇంకా బాగా ఎలా చేయొచ్చు అని ఆలోచించేవారు. నాకు తెలిసి జేపీ గారు డబ్బుల కోసం నటించే వ్యక్తి కాదు, నిజమైన కళాకారుడు. అలాంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం అంటే బాధాకరం. ఈ మధ్య కూడా మేం మాట్లాడుకున్నాం. రెండు, మూడు రోజులకు ముందే మా రచయితతో మాట్లాడా. జేపీ గారికి మంచి పాత్ర రాయమని అడిగా. అలాంటి ఆయన గురించి ఆలాంటి వార్త వినడం చాలా ఆవేదనగా ఉంది. ఇది నాకే కాదు, పరిశ్రమకే పెద్ద లోటు. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం అంకుల్‌’ అంటూ శ్రీనువైట్ల కంటతడి పెట్టుకున్నారు.

‘విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించిన జయప్రకాశ్‌ రెడ్డి గారు ఇక లేరన్న వార్త విషాదకరం. మేము రాసిన ఎన్నో పాత్రలకు ఆయన అద్భుతమైన అభినయంతో  ప్రాణం పోశారు. ‘ఢీ’ సినిమాలో మాటలు లేని పాత్ర, ‘రెడీ’ సినిమాలో పాత్ర ఎన్నటికీ మరువలేనివి. మహా నటుడికి మా వినమ్ర శ్రద్ధాంజలి’గోపీ మోహన్‌

‘జయప్రకాశ్‌ రెడ్డి గారు ఇకలేరు అనడం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా సానుభూతి తెలుపుతున్నా’- అల్లు అర్జున్‌

‘ఇది అత్యంత ఆవేదనకు గురి చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్‌’- రకుల్‌ప్రీత్‌ సింగ్‌

‘ప్రియమైన జయప్రకాశ్‌ రెడ్డి సర్‌.. మాకు వినోదం పంచినందుకు థాంక్స్‌.  నేను మిమ్మల్ని ‘రెడీ’ సెట్‌లో మొదటి సారి కలిసినప్పుడు సర్‌ప్రైజ్‌ అయ్యా. మీ ఆత్మకు శాంతి కలగాలి సర్‌’-రామ్‌

‘మిమ్మల్ని మేం ఎప్పుడూ గుర్తుంచుకుంటాం జయప్రకాశ్‌ రెడ్డి సర్‌. మీ నటనతో మా జీవితాల్లో నవ్వులు నింపినందుకు థాంక్స్‌. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’-నిఖిల్‌

‘ఎన్నో సినిమాలలో తన సహజ అభినయంతో పాత్రకు, మాకు ఎంతో పేరు తెచ్చిన గొప్ప నటుడు జయప్రకాశ్‌ రెడ్డి గారి మరణం బాధాకరం’- కోన వెంకట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని