Chiranjeevi: బాలీవుడ్‌ ఆఫర్లకు అప్పట్లో నో చెప్పిన చిరంజీవి.. కారణమిదే!

స్టార్‌ హీరో చిరంజీవి (Chiranjeevi) బాలీవుడ్‌ చిత్రాల్లో ఎక్కువగా నటించలేదన్నది తెలిసిన విషయమే. దీని గురించి ఆయన గతంలో ఓ సందర్భంలో మాట్లాడారు.

Published : 27 Nov 2023 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం యంగ్‌ హీరోలు ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజుల్లోనే పాన్‌ ఇండియా స్థాయి సినిమాల్లో నటిస్తున్నారు. దీంతో బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అయితే, తన అద్భుతమైన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న చిరంజీవి మాత్రం బాలీవుడ్‌లో తక్కువ సినిమాల్లోనే నటించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి బీటౌన్‌ చిత్రాల్లో ఎక్కువగా ఎందుకు కనిపించలేదన్నది చాలా మందికి సందేహం. అయితే, చిరు పరిశ్రమకు వచ్చిన కొత్తల్లోనే ఆయనకు బాలీవుడ్ అవకాశాలు చాలా వచ్చాయి. ఆయనే వాటిని తిరస్కరించారు.

ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు. 1990లో చిరంజీవి ‘ప్రతిబంధ్’ అనే హిందీ సినిమాలో నటించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్‌ అయింది. ఆ తర్వాత 1991లో తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ను ‘ఆజ్‌ కా గుండా రాజ్‌’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఇదీ కూడా విజయాన్ని సాధించింది. ఆ తర్వాత తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘జెంటిల్‌మ్యాన్‌’ సినిమాను హిందీలో రీమేక్‌ చేశారు. ఇదే ఆయన నటించిన చివరి హిందీ చిత్రం ఆ తర్వాత ఆయన బాలీవుడ్‌లో సినిమాలు చేయలేదు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ విషయం గురించి మాట్లాడారు. ‘అప్పటి అగ్ర దర్శకులు మనోహన్‌ దేశాయ్‌, ప్రకాశ్‌ మెహ్రా, సజిత్ నదియావాలా నాకు చాలా కథలు వినిపించారు. అయితే, అవి నన్ను ఆకట్టుకోలేదు. కథ బాగుంటే కచ్చితంగా చేసేవాడిని. సినిమాకు కథే బలం. నాకు నచ్చిన కథలు వచ్చినట్లైతే చేస్తాను’ అని చిరంజీవి గతంలో ఓ సందర్భంలో చెప్పారు.

శివుడి పాత్రధారి నిజమైన పామును మెడలో ఎందుకు వేసుకోరంటే!

ఇక ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. ‘మెగా 156’ వర్కింగ్‌ టైటిల్‌తో వశిష్ట దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. వినూత్నమైన ఫాంటసీ అడ్వెంచర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ పతాకంపై మెగా157 చేయనున్నారు. అలాగే బోయపాటి శ్రీనుతో ఓ చిత్రం లైన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని