Chiranjeevi: నంది అవార్డులకు గద్దర్‌ పేరు.. ఆ నిర్ణయం సముచితమే: చిరంజీవి

నంది అవార్డులకు ప్రజాగాయకుడు గద్దర్‌ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సముచితమైనదని ప్రముఖ సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు.

Updated : 04 Feb 2024 13:45 IST

హైదరాబాద్‌: నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్‌ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సముచితమైందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరిగింది. పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్న వారిని సీఎం, మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు.

‘‘పద్మవిభూషణ్‌ పురస్కారం వచ్చాక వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ మనసారా ఆశీర్వదిస్తుంటే ఈ జన్మకిది చాలు అనిపిస్తోంది. మా అమ్మానాన్నల పుణ్యఫలం నాకు సంక్రమించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించాలనే ఆలోచన చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఇందుకు సీఎం, మంత్రులకు ధన్యవాదాలు. దీంతో కళలు, కళాకారులకు ప్రోత్సాహం అందించినట్లవుతుంది.

వెంకయ్య వాగ్ధాటికి పెద్ద ఫ్యాన్‌ను..

నంది అవార్డులు గత చరిత్రలా అయిపోయాయి. వాటిని త్వరలో ఇస్తామని సీఎం ప్రకటించడం ఆనందదాయకం. ఆ అవార్డులకు గద్దర్‌ పేరు పెట్టాలనే నిర్ణయం ఎంతో సంతోషకరం. కళాకారులకు అవార్డులు ఇస్తే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయాల్లో వెంకయ్యనాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడు. వాజ్‌పేయీ అంతటి హుందాతనం ఆయనలో ఉంది. వెంకయ్య వాగ్ధాటికి నేను పెద్ద ఫ్యాన్‌ను. చిన్నతనం నుంచి ఆయన మాకు స్ఫూర్తి. రాజకీయాల్లో రానురాను దుర్భాషలు ఎక్కువైపోతున్నాయి. నోరుజారి వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లకి బుద్ధి చెప్పే శక్తి ప్రజలకే ఉంది’’ అని చిరంజీవి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని