Dead Pixels Review: రివ్యూ: డెడ్‌ పిక్సెల్స్‌ (వెబ్‌సిరీస్‌).. రీ ఎంట్రీలో నిహారిక మెప్పించిందా?

నిహారిక కొణిదెల నటించిన తాజా వెబ్‌సిరీస్‌ ‘డెడ్‌ పిక్సెల్స్‌’.. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో విడుదలైంది. ఎవరు తెరకెక్కించారు? కథేంటి? అంటే.. ఇది చదివేయండి... 

Updated : 19 May 2023 22:30 IST

Dead Pixels Review: వెబ్‌సిరీస్‌: డెడ్‌ పిక్సెల్స్‌; తారాగణం: నిహారిక కొణిదెల, అక్షయ్‌ లగుసాని, సాయి రోనక్‌, వైవా హర్ష, భావన సాగి, రాజీవ్‌ కనకాల తదితరులు; మ్యూజిక్‌: సిద్ధార్థ సదాశివుని; ఎడిటింగ్‌: సృజన అడుసుమిల్లి; సినిమాటోగ్రఫీ: ఫహద్‌ అబ్దుల్‌ మజీద్‌; కథ: అక్షయ్‌ పూళ్ల; దర్శకుడు: ఆదిత్య మండల; నిర్మాతలు: సమీర్‌, సాయిదీప్‌ రెడ్డి, రాహుల్‌ (తమడ మీడియా); ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: డిస్నీ+ హాట్‌స్టార్‌.

కొన్నాళ్ల విరామం అనంతరం నిహారిక కొణిదెల (Niharika Konidela) నటించిన వెబ్‌సిరీస్‌ ‘డెడ్‌ పిక్సెల్స్‌’ (Dead Pixels). ఆమెతోపాటు సాయి రోనక్‌, అక్షయ్‌ లగుస్వామి, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో ‘మా వింత గాధ వినుమా’ ఫేం ఆదిత్య మండల తెరకెక్కించిన ఈ సిరీస్‌ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో శుక్రవారం విడుదలైంది. ఆ కథేంటి? ఎలా ఉంది? తెలుసుకోవాలనుకుంటే ఈ రివ్యూపై ఓ లుక్కేయండి (Dead Pixels Review)..

గేమింగ్‌ స్టోరీ: గాయత్రి (నిహారిక), భార్గవ్‌ (అక్షయ్‌), ఐశ్వర్య (భావన) ఫ్లాట్‌మేట్స్‌. ఒకే ఆఫీసులో పనిచేసే గాయత్రి, భార్గవ్‌కు ‘బ్యాటిల్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ గేమ్‌ అంటే ప్రాణం. అది మినహా వారికి వేరే ప్రపంచం అవసరం లేదు. వాస్తవంలో కంటే ఆన్‌లైన్‌లోనే కాలాన్ని గడుపుతారు. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే కాదు ఆఫీసు వేళల్లోనూ వారికి అదే ధ్యాస. వీరికి పైలట్‌ ఆనంద్‌ (వైవా హర్ష) గేమ్‌ ద్వారానే పరిచయం అవుతాడు. ముగ్గురు ఓ బృందంగా ఏర్పడి శత్రుమూకల్ని హతమార్చి రాజ్యాన్ని గెలవాలనుకుంటారు. మరి, వారి లక్ష్యం నెరవేరిందా? ఆ బృందంలో చేరిన గాయత్రి సహోద్యోగి రోషన్‌ (సాయి రోనక్‌) పరిస్థితేంటి? ఐశ్వర్య వారిని రియాలిటీలోకి తీసుకొచ్చిందా, లేదా? అన్నది మిగతా కథ (Dead Pixels Review).

ఎలా ఉందంటే: ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇతివృత్తంతో 6 ఎపిసోడ్లలో రూపొందిన సిరీస్‌ ఇది. గాయత్రి, ఐశ్వర్యలు బాయ్‌ఫ్రెండ్స్‌ గురించి చర్చించుకునే సన్నివేశంతో తొలి ఎపిసోడ్‌ ప్రారంభమవుతుంది. గాయత్రి క్యారెక్టర్‌ ఏంటన్నది అప్పుడే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. తర్వాత భార్గవ్‌, ఐశ్వర్య, ఆనంద్‌ల ప్రపంచం పరిచయమవుతుంది. ఐశ్వర్య తప్ప మిగిలిన మూడు పాత్రలూ వాస్తవ ప్రపంచంలో ఉండవు. అయితే, గేమ్‌ ఆడేటప్పుడు ఆయా పాత్రల మధ్య చోటు చేసుకునే సంభాషణలు నవ్వులు పంచుతాయి. కొన్ని అడల్ట్‌ సంభాషణలూ ఉన్నాయి. ఆ గేమ్‌ కాన్సెప్ట్‌ని గాయత్రి ద్వారా రోషన్‌ తరఫున ప్రేక్షకులకు వివరించాలనుకున్న దర్శకుడి ప్రయత్నం ఫలించలేదు. ‘నాకేం అర్థం కాలేదు’ అని రోషన్‌ పాత్రతో చెప్పించిన మాటే ఈ సిరీస్‌ విషయంలో ఆడియన్స్‌ మాట అవ్వొచ్చు. ‘గేమ్‌ ఇంట్రడక్షన్‌ ఇచ్చేశారు.. ఇకపై ఆసక్తిగా ఉంటుందేమో’ అని ఆశించిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. ‘బ్యాటిల్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ని ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయారు. ఆ ఆటలో ఎక్కువగా ఈ మిత్ర బృందమే కనిపిస్తుంది తప్ప శత్రువర్గం ముచ్చటే పెద్దగా వినిపించదు. పూర్తిగా కామెడీ నేపథ్యంలోనే నడిపించినా సిరీస్‌ చాలా బాగుండేది. అలా కాకుండా మధ్యలో.. తల్లిని కోల్పోయిన ఓ కుర్రాడి పాత్రతో సెంటిమెంట్‌ని ఇరికించారు. ఆన్‌లైన్‌లో నడిచే బాయ్‌కాట్‌ ట్రెండ్‌ గురించీ ప్రస్తావించి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. ఫ్లోలో వెళ్లకుండా ఇలాంటి లేయర్స్‌ జోడించడం వల్ల చెప్పాలనుకున్న దాన్ని దర్శక, రచయితలు సరిగ్గా చెప్పలేకపోయారనిపిస్తుంది (Dead Pixels Review).

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలై చాలామంది ప్రాణాలు తీసుకున్నారనే వార్తలు ఇటీవల తరచూ వస్తున్నాయి. ఇలాంటి అంశాల్ని హైలెట్‌ చేస్తూ కథను ఇంకా బలంగా రాసి ఉంటే బాగుండేది. మైదానంలో ఆడే క్రీడల గొప్పతనం గురించి రాజీవ్‌ కనకాల పోషించిన తండ్రి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అది అంతగా కనెక్ట్‌ కాదు. తన బలమేంటో ఆన్‌లైన్‌లో చూపిస్తానంటూ భార్గవ్‌ తండ్రికి ఛాలెంజ్‌ విసరడం, గేమ్‌లో తన తండ్రిని చంపానంటూ ఆనందపడడం రుచించని విషయం. రాజీవ్‌ కనకాల పాత్ర నిడివి పెంచి, బయట ఆడే ఆటలకు, వీడియో గేమ్స్‌ను మధ్య వ్యత్యాసాల్ని వివరించి ఉంటే ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బానిసలైన వారిలో కొంతైనా మార్పుతీసుకొచ్చేవారేమో. యువతే కాదు ఇలాంటి గేమ్స్‌ పెద్దలనూ అమితంగా ఆకర్షిస్తాయనే విషయాన్ని ఇద్దరు పిల్లలకు తండ్రైన ఆనంద్‌ పాత్ర కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. చేస్తున్న ఉద్యోగాన్ని, కట్టుకున్న భార్యని, కన్న పిల్లల్ని దూరం పెడితే జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో ఆ పాత్ర చూస్తే అవగతమవుతుంది. రియాలిటీకి, ఆన్‌లైన్‌లో బతకడానికి తేడా ఏంటో ఐశ్వర్య పాత్రతో చెప్పించిన తీరు ఆకట్టుకుంటుంది. సిరీస్‌ టీమ్‌.. హ్యాపీ ఎండింగ్‌ ఇస్తూనే సీజన్‌ 2 ఉంటుందని హింట్‌ ఇచ్చింది (Dead Pixels Review).

ఎవరెలా చేశారంటే: తనకు నచ్చినట్టు బతికే యువతి గాయత్రి పాత్రలో నిహారిక ఒదిగిపోయింది. తన పెర్ఫామెన్స్‌తో రీ ఎంట్రీలో మెప్పించింది. గాయత్రికి క్లోజ్‌ అయిన భార్గవ్‌, రోషన్‌గా అక్షయ్‌, సాయి రోనక్‌ మెప్పించారు. వైవా హర్ష బాగానే నవ్వించాడు. ఆన్‌లైన్‌లో మునిగిపోయిన స్నేహితులకు హితబోధ చేసే ఐశ్వర్య క్యారెక్టర్‌కు భావన న్యాయం చేసింది. సాంకేతికంగా సిరీస్‌ ఫర్వాలేదనిపిస్తుంది. కాన్సెప్ట్‌ బాగానే ఉన్నా దాన్ని బలంగా రాయడంలో రచయిత, తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యారు.

  • బలాలు:

  • నిహారిక నటన
  • + కొన్ని కామెడీ సన్నివేశాలు
  • బలహీనతలు: 

  • - కథ 
  • - ప్రతి ఎపిసోడ్‌లో సాగదీత

చివరిగా: కొన్ని జోక్స్‌ కోసం ఈ ‘డెడ్‌ పిక్సెల్‌’!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని