Drishyam: హాలీవుడ్‌లో రీమేక్‌ అయ్యే ‘దృశ్యం’ మోహన్‌లాల్‌దా..? అజయ్‌దా..? జీతూజోసెఫ్‌ ఏమన్నారంటే?

Drishyam: ‘దృశ్యం’ హాలీవుడ్‌ రీమేక్‌ విషయంలో వస్తున్న వార్తలను జీతూ జోసెఫ్‌ ఖండించారు.

Updated : 04 Mar 2024 17:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మోహన్‌లాల్‌ (Mohanlal) కీలక పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం’ (Drishyam). 2013లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌ అయింది. అంతేకాదు సింహళ, చైనీస్‌లోనూ రీమేక్‌ చేశారు. ఇప్పుడు హాలీవుడ్‌, కొరియన్‌ భాషల్లో రీమేక్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. ఈ సందర్భంగా ‘దృశ్యం’ మాతృకను తీసిన దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబం, ప్రేమ, భద్రత వంటి యూనివర్సల్‌ అంశాలే కథా వస్తువులుగా సినిమాను తీసినట్లు చెప్పారు. కథలో ఉండే సహజమైన భావోద్వేగాలకు ఏ భాష ప్రేక్షకుడైనా కనెక్ట్‌ అవుతారని అన్నారు.

ఈ క్రమంలో హాలీవుడ్‌లో రీమేక్‌ కాబోతున్నది మోహన్‌లాల్‌ మూవీ అంటూ కొందరు.. లేదు అది అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) ‘దృశ్యం’ అంటూ ఇంకొందరు చర్చకు లేవనెత్తారు. కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్స్‌ అజయ్‌ దేవ్‌గణ్‌ నటించిన ‘దృశ్యం’ అంటూ రాయడంతో సోషల్‌మీడియా వేదికగా చర్చ మొదలైంది. దీనిపై జీతూ జోసెఫ్‌ స్పందిస్తూ.. ఇవి అర్థం లేని వాదనలు అంటూ కొట్టిపారేశారు. అంతేకాదు, ఒక ప్రొడక్షన్‌ హౌస్‌కు రీమేక్‌ రైట్స్‌ అమ్మేశారని వస్తున్న వార్తలనూ ఆయన ఖండించారు. పలు హిందీ సినిమాలు మలయాళంతో పాటు, ఇతర భాషల్లో రీమేక్‌ చేసిన సందర్భాలున్నాయని, మాతృకతో పోలిస్తే, అవి మరింత ప్రాచుర్యం పొందాయని తెలిపారు. ‘దృశ్యం’ చూసిన ప్రతి ఒక్కరికీ అది మొదట మలయాళంలో తాను తీసిన సినిమానేనని తెలుస్తుందని అన్నారు.

జార్జ్‌కుట్టిగా హాలీవుడ్‌లో ఏ నటుడు నటిస్తే బాగుంటుందనగా తన దృష్టిలో ఎవరూ లేరని సమాధానం ఇచ్చారు. ఇక జీతూ జోసెఫ్‌ సినిమాల విషయానికొస్తే, మోహన్‌లాల్‌, ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన ‘నెరు’ (Neru) ఇటీవల విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు మోహన్‌లాల్‌తో కలిసి ‘రామ్‌’ (Ram) అనే సినిమాను జోసెఫ్‌ రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీలో త్రిష, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సాయికుమార్‌, సిద్ధిఖీ, అనూప్‌మేనన్‌ తదితరులు నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని