Neru Movie Review: రివ్యూ: మోహన్‌లాన్‌ నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘నెరు’ ఎలా ఉంది?

Neru Movie Review: మోహన్‌లాల్‌, ప్రియమణి కీలక పాత్రల్లో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘నెరు’ ఎలా ఉందంటే?

Updated : 23 Jan 2024 22:13 IST

Neru Movie Review; చిత్రం: నెరు; నటీనటులు: మోహన్‌లాల్‌, నందు, అనస్వర రాజన్‌, దినేష్‌ ప్రభాకర్‌, ప్రియమణి, కృష్ణ ప్రభ, సిద్ధిఖ్‌, జగదీష్‌, శంకర్‌ ఇందు చూడన్‌ తదితరులు; సంగీతం: విష్ణు శ్యామ్‌; సినిమాటోగ్రఫీ: సతీష్‌ కురుప్‌; ఎడిటింగ్‌: వి.ఎస్‌.వినాయక్‌; రచన: శాంతి మాయాదేవి, జీతూ జోసెఫ్‌; నిర్మాత: ఆంటోనీ పెరంబవూర్‌; దర్శకత్వం: జీతూ జోసెఫ్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

మోహన్‌లాల్‌ (Mohanlal) కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన కోర్టు రూమ్‌ డ్రామా ‘నెరు’ (Neru).  డిసెంబరు 21న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar) వేదికగా అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? (Neru movie review) తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా?

కథేంటంటే: సారా మహ్మద్‌ (అనస్వర రాజన్‌) అంధురాలు. గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగడతాడు. ఈ దుర్మార్గానికి తెగబడింది ఎవరో గుర్తించలేక పోలీసులు సైతం ఓ దశలో చేతులు ఎత్తేస్తారు. స్వతహాగా శిల్పి అయిన సారా తనపై దారుణానికి పాల్పడిన వ్యక్తి రూపాన్ని శిల్పంగా తయారుచేస్తుంది. ఆ విగ్రహానికి దగ్గర పోలికలున్న మైఖేల్‌ జోసెఫ్‌ (శంకర్‌ ఇందుచూడన్‌) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేస్తారు. అతడు ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు కావడంతో ఈ కేసు సంచలనంగా మారుతుంది. ఎంతటి క్లిష్టమైన కేసునైనా తన వాదనా పటిమతో గెలిపించగలిగే రాజశేఖర్‌ (సిద్ధిఖ్‌)ను మైఖేల్‌ తండ్రి అడ్వకేట్‌గా నియమించుకుంటాడు. దీంతో మైఖేల్‌కు బెయిల్‌ వస్తుంది. ఈ కేసును వాపసు తీసుకోమని మైఖేల్‌ కుటుంబం నుంచి సారాకు సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ వస్తుంది. (Neru movie review) అయితే, అందుకు భిన్నంగా తాను ఓడిపోయినా పర్వాలేదని, న్యాయం కోసం పోరాటం చేస్తానని సారా చెబుతుంది. ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ సూచన మేరకు సారా తండ్రి.. లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ను కలిసి, తన కేసు వాదించమని కోరతాడు. ఇంతకీ సారాపై అత్యాచారం చేసింది ఎవరు? విజయ్‌ మోహన్‌ కేసు టేకప్‌ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి?విజయ్‌మోహన్‌, పూర్ణిమా రాజశేఖర్‌ (ప్రియమణి)ల మధ్య ఉన్న బంధం ఏంటి? చివరకు అత్యాచారం చేసిన వ్యక్తిని ఎలా గుర్తించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: మోహన్‌లాల్‌- జీతూ జోసెఫ్‌ అంటే మన అందరికీ గుర్తొచ్చేది ‘దృశ్యం’ చిత్రాలే. మలయాళంలోనే కాదు, ఇతర భాషల్లోనూ ఘన విజయం సాధించిన చిత్రాలవి. అలాంటి కాంబినేషన్‌లో మూవీ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. వాటికి తగినట్లే ‘నెరు’ని తెరకెక్కించడంలో సఫలమయ్యాడు దర్శకుడు. సారా ఇంట్లోనే ఆమెపై అత్యాచారం చేసిన ఘటనతోనే కథను మొదలు పెట్టి, తర్వాత జరగబోయే పరిణామాలను ఆసక్తిగా తిలకించేలా ప్రేక్షకులను సన్నద్ధం చేశాడు. (Neru movie review) జీతూ జోసెఫ్‌ శైలి కాస్త డిఫరెంట్‌. సినిమా అరగంట  పూర్తయిన తర్వాత కథకు సంబంధించి చాలా విషయాలు ప్రేక్షకుడి ముందు పెట్టేస్తాడు. క్రైమ్‌ చేసింది ఎవరు? కోర్టు ప్రొసీడింగ్స్‌ ఎలా సాగుతాయి? కీలక పాత్రలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి? వంటి అంశాలపై ఒక అవగాహన వచ్చేస్తుంది. అయినా కూడా సినిమా ఆసక్తిగా చూడటానికి కారణం ఆయన స్క్రీన్‌ప్లే మేజిక్‌. ‘నెరు’లోనూ అది వర్కవుట్‌ అయింది. కంటిచూపు లేని ఓ యువతి.. ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తిని ఎలా కనిపెడుతుందన్నది యూనిక్‌ పాయింట్‌. అయితే, ఆమె శిల్పాలు చేయగలదన్న ఎలిమెంట్‌ జోడించి, కథను ముందుకు నడిపిన తీరు బాగుంది. లాయర్‌ విజయ్‌మోహన్‌గా మోహన్‌లాల్‌ వచ్చిన తర్వాతే కథలో కాస్త వేగం పెరుగుతుంది. అక్కడి నుంచి కోర్టులో సాగే, వాదోపవాదాలు, చర్చలు, మధ్యలో ఎదురయ్యే ప్రతిబంధకాలు వాటిని పరిష్కరిస్తూ వచ్చే క్లూలు ఇలా ప్రతి ఎలిమెంట్‌ ఆసక్తిగా అనిపించినా, వాటిని తెరపై ఎగ్జిక్యూట్‌ చేసిన విధానం కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. ముఖ్యంగా బాధితురాలిని కోర్టులో మైఖేల్‌ తరపు న్యాయవాది వేసే ప్రశ్నలు, కాస్త గందరగోళంగా అనిపిస్తాయి. ఎవిడెన్స్‌లు, వాదన ప్రతివాదనల సందర్భంగా సెక్షన్లు చెబుతూ సాగే డ్రామా సాధారణ ప్రేక్షకుడిని తికమక పెడుతుంది. అక్కడక్కడా ‘దృశ్యం’, ‘వకీల్‌సాబ్‌’ వంటి చిత్రాల రిఫరెన్స్‌లు కనపడతాయి. ఓవరాల్‌గా ఓ మంచి కోర్టు రూమ్‌ డ్రామాగా ‘నెరు’ మెప్పిస్తుంది.

ఎవరెలా చేశారంటే: లాయర్‌ విజయ్‌ మోహన్‌ లాంటి పాత్రలు మోహన్‌లాల్‌కు అరటిపండు ఒలిచినట్లే. కథకు, పాత్రకు తగినట్లు ఆయన ఒదిగిపోయారు. అంధురాలి పాత్ర పోషించిన అనస్వర రాజన్‌ నటన, పలికించిన హావభావాలు సినిమాకు హైలైట్‌. సిద్ధిఖ్‌, ప్రియమణి, దినేష్‌ ప్రభాకర్‌ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విభాగం పనితీరు బాగుంది. కోర్టు రూమ్‌ డ్రామాకు అవసరమైన అన్ని ఎలిమెంట్స్‌ చక్కగా కుదిరాయి. (Neru movie review) జీతూ జోసెఫ్‌ స్టైల్‌ టేకింగ్‌ గురించి చెప్పుకోవాలి. తన సినిమాల్లో క్రైమ్‌ చేసింది ఎవరో తెలిసినా.. తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో నడిపే కథనమే ప్రేక్షకుడిని కూర్చోబెడుతుంది. ఇందులోనూ అది వందశాతం వర్కవుట్‌ అయింది.

కుటుంబంతో చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.

  • బలాలు
  • + మోహన్‌లాల్‌, అనస్వర రాజన్‌ నటన
  • + దర్శకత్వం
  • + భావోద్వేగ సన్నివేశాలు
  • బలహీనతలు
  • - సుదీర్ఘంగా సాగే కొన్ని కోర్టు సీన్స్‌
  • చివరిగా: నెరు.. ఎంగేజింగ్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా (Neru movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని