Eesari Pandaga Manade: ‘ఈసారి పండగ మనదే’.. అదరగొట్టిన విజయ్‌, మృణాళ్‌ జోడీ!

‘ఈసారి పండగ మనదే’ (Eesari Pandaga Manade) అంటూ స్పెషల్‌ ప్రోగ్రామ్‌తో ఈటీవీ ఉగాది నాడు వినోదాల విందును పంచింది.

Published : 09 Apr 2024 15:34 IST

హైదరాబాద్‌: ప్రతీ పండగకు ప్రత్యేక కార్యక్రమాలను, వినోదాలను పంచుతూ తెలుగు ప్రేక్షకుల మది దోచుకుంటున్న టీవీ ఛానల్‌ ‘ఈటీవీ’ (ETV). ఈ ఉగాదికి కూడా ‘ఈసారి పండగ మనదే’ (Eesari Pandaga Manade) అంటూ స్పెషల్‌ ప్రోగ్రామ్‌తో వినోదాల విందును పంచింది. ఈ కార్యక్రమానికి ‘ఫ్యామిలీస్టార్‌’ (Family Star) టీమ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మృణాళ్‌ ఠాకూర్‌ (Mrunal Thakur), దర్శకుడు పరశురామ్‌, నిర్మాత దిల్‌రాజు వచ్చి సందడి చేశారు. #90s వెబ్‌సిరీస్‌ టీమ్‌ ఒకవైపు ‘బలగం’ టీమ్‌ మరోవైపు సందడి చేస్తూ మొదలైన షోలో సుధీర్‌, ఆది తదితరుల పంచ్‌లతో పాటు, కామెడీ స్కిట్‌లు కడుపుబ్బా నవ్వించాయి. #90s వెబ్‌సిరీస్‌ టీమ్‌కు శివాజీ పెద్దగా, ‘బలగం’ టీమ్‌కు ఆ చిత్ర దర్శకుడు, నటుడు వేణు వెల్దండ లీడర్‌గా వ్యవహరించారు. చిన్నచిన్న గేమ్స్‌తో రెండు టీమ్‌ల వారు సందడి చేశారు. ఇక ‘అలయ్‌ బలయ్‌’ అంటూ రామ్‌ మిర్యాల పాడిన పాట మరోసారి యువతను విశేషంగా ఆకట్టుకుంది.

ఈవెంట్‌లోకి ‘ఫ్యామిలీస్టార్‌’ టీమ్‌ అడుగుపెట్టిన తర్వాత వినోదాల విందు రెట్టింపైంది. ఈసందర్భంగా మృణాళ్‌కు సుధీర్‌ తెలుగు నేర్పే ప్రయత్నం చేయడం, ఆమె విషయం అర్థమై తెలివిగా సమాధానాలు చెప్పడంతో అక్కడున్నవారే కాదు, టీవీ చూస్తున్న ప్రేక్షకులు కూడా నవ్వాపుకోలేకపోయారు. హావభావాలతో సినిమా పేరు కనిపెట్టే గేమ్‌ అయితే, ప్రతిఒక్కరినీ కడుపుబ్బా నవ్వించింది. పాత సినిమాల పేర్లు చెప్పాల్సి వచ్చినప్పుడు అందరూ పడిపడి నవ్వారు. ఎప్పుడూ వేదికలపై కాస్త అగ్రెసివ్‌గా మాట్లాడే విజయ దేవరకొండ ఈ ఈవెంట్‌లో చాలా కూల్‌గా కనిపించారు. ఆది, సుధీర్‌ వేసే పంచ్‌లను ఆస్వాదిస్తూనే ఆయన కూడా తన డైలాగ్స్‌తో నవ్వులు పంచారు. ఇక చివరిగా ‘గుంటూరు కారం’ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు సుధీర్‌ స్టెప్‌లు వేయడం షోకు హైలైట్‌గా నిలిచింది. ఈసందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. పండగ అందరూ కలిసి చేసుకోవాలని, తెలుగువారి పండగకు వచ్చిన ‘ఫ్యామిలీస్టార్‌’ను మరింత ఆదరించాలని కుటుంబ ప్రేక్షకులను కోరారు. తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ‘ఈటీవీ విన్‌’లోనూ ఈ కార్యక్రమం స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వినోదాల సందడి ‘ఈసారి పండగ మనదే’ ఎపిసోడ్‌ను చూస్తూ మీరు ఆస్వాదించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు