Narappa ఆ ఎమోషనల్‌ సీన్స్‌ అద్భుతం: వెంకటేశ్‌

ఎమోషనల్‌ పరంగా తన కెరీర్‌లో అత్యుత్తమంగా నటించిన చిత్రం ‘నారప్ప’ అని, సరైన సమయంలో మంచి సినిమా చేశానని టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ అన్నారు. సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ తెరకెక్కింది

Published : 19 Jul 2021 18:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎమోషనల్‌ పరంగా తన కెరీర్‌లో అత్యుత్తమంగా నటించిన చిత్రం ‘నారప్ప’ అని, సరైన సమయంలో మంచి సినిమా చేశానని టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ అన్నారు. సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేశ్‌ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..

‘‘ఫస్ట్‌లుక్‌ నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. అద్భుతమైన కథతో పాటు భావోద్వేగాలు కలగలిపిన చిత్రం ఇది. ఇలాంటి సినిమా నా కెరీర్‌లో ఎప్పుడూ చేయలేదు. కథ వినగానే సినిమా చేయాలని అనుకున్నాను. కమర్షియల్‌ సినిమాలు చాలా వస్తాయి. కానీ.. ఇంత యదార్థంగా, రఫ్‌గా చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. డ్రామా, హైవోల్టేజ్‌, ఎలివేషన్‌ ఇలా చాలా విషయాలు ఉన్నాయిందులో. సరైన సమయంలో సరైన సినిమా చేశానని భావిస్తున్నాను. ఇలాంటి పాత్ర దొరకడం నిజంగా అదృష్టం అనుకుంటున్నా. ఎన్నో సినిమాల్లో నేను నటించాను. కానీ.. ఈ సినిమా నాకు బాగా కనెక్ట్‌ అయింది. షూటింగ్‌ సమయంలో ఏదైనా షాట్‌ వేరేలా చేద్దామన్నా చేయలేకపోయాను. ఎందుకంటే ఇది రియలిస్టిక్‌గా ఉండాలి. అందుకే బయట కూడా నారప్ప పాత్రలో ఉండిపోయాను. అవే కాస్టూమ్స్‌లో పడుకునేవాడిని.. అలాగే భోజనం చేసేవాడిని’’ అని వెంకటేశ్‌ అన్నారు.

‘‘ప్రేక్షకులు అన్ని రకాల కథలు చూస్తారు. కథ పరంగా నేను చేసిన సినిమాల్లో ఇది ఒక మెట్టు పైనే ఉంటుంది. దాదాపు రెండు నెలల పాటు ఒకే గెటప్‌లో ఉండటం కాస్త అలసటగా అనిపించింది. అయితే.. సినిమా సెట్‌కు వెళ్లగానే ఏదో శక్తి వచ్చి నాలో చేరినట్లు అనిపించేది. డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల గురించి చెప్పాలంటే.. మా ఇద్దరి మధ్య మొదటి రోజు నుంచి మంచి సమన్వయం ఉంది. ఆర్డినరీ సినిమాలా కాకుండా.. ఏ ఒక్క ఎమోషన్‌ మిస్‌ కాకూడని మేం చర్చించుకునేవాళ్లం. ఏ సినిమాలో అయినా.. ఆ విషయంలో మినహాయింపులేమి ఉండవు. వందశాతం కష్టపడి పనిచేయాల్సిందే. ముఖ్యంగా ఈ సినిమాలో రెండు మూడు ఎమోషనల్‌ సన్నివేశాలు ఉంటాయి. అలాంటివి నా కెరీర్‌లోనే ఎప్పుడూ చేయలేదు. డబ్బింగ్‌ చెప్పే సమయంలో కూడా నాకు ‘నేను చెప్పగలనా’ అని అనుమానం వచ్చింది. నిజంగానే భావోద్వేగానికి గురయ్యాను. నారప్ప పాత్ర అందరికీ బాగా కనెక్ట్‌ అవుతుంది. కుటుంబంతో కలిసి చూడగలిగే మంచి చిత్రం ఇది. నేను కూడా ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ఎదురుచూస్తున్నాను’’ అని వెంకటేశ్‌ ‘నారప్ప’ ముచ్చట్లు ముగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు