Bappi Lahiri: ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి (69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబయిలోని ఆస్పత్రిలో

Updated : 16 Feb 2022 15:23 IST

ముంబయి: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి (69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. బప్పి లహిరి మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

1952లో పశ్చిమబెంగాల్‌లోని జల్పాయ్‌గురి నగరంలో బప్పిలహిరి జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ సంగీతకారులు కావడంతో బప్పి లహిరి చిన్నప్పటి నుంచే సంగీతంలో ప్రావీణ్యం పొందారు. మూడేళ్ల వయసులోనే తబలా నేర్చుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా సినీ పరిశ్రమ వైపు అడుగులేశారు. మాతృభాష అయినా బెంగాలీతో పాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌లో పలు చిత్రాలకు సంగీతం అందించారు. ‘డిస్కో డ్యాన్సర్‌’, ‘సాహెబ్‌’, ‘డ్యాన్స్‌ డ్యాన్స్‌’, ‘గురు దక్షిణ’, ‘కమాండో’, ‘గురు’, ‘ప్రేమ ప్రతిజ్ఞ’, ‘త్యాగి’, ‘రాక్‌ డ్యాన్సర్‌’, ‘ది దర్టీ పిక్చర్‌’, ‘బద్రినాథ్‌ కీ దుల్హనియా’ వంటి చిత్రాల్లో ఆయన అందించిన పాటలు మంచి పేరు సొంతం చేసుకున్నాయి. అలాగే, సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన ‘సింహాసనం’తో బప్పి లహిరి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ సినిమా ఆల్బమ్‌ సూపర్‌ హిట్‌ కావడంతో ఆయనకు తెలుగులోనూ వరుస ప్రాజెక్ట్‌లు వరించాయి. అలా, ‘త్రిమూర్తులు’, ‘సామ్రాట్‌’, ‘స్టేట్ రౌడీ, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘రౌడీ అల్లుడు’, ‘నిప్పు రవ్వ’, ‘బిగ్‌బాస్‌’ సినిమాలకు సంగీత దర్శకుడిగా, గాయకుడిగా పని చేశారు. ఆయన చివరిగా హిందీలో తెరకెక్కిన ‘భాఘి-3’లో ఓ పాటను ఆలపించి, సంగీతం అందించారు. సంగీతలోకంలో శ్రోతల్ని కొన్నేళ్లపాటు అలరించిన ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయాలనే ఉద్దేశంతో 2014లో భాజపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని