Fahadh Faasil: రాజమౌళి సమర్పణ.. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఫహద్‌ ఫాజిల్‌ మూవీస్‌

Fahadh Faasil: విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫహద్‌ ఫాజిల్‌ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.

Published : 19 Mar 2024 16:18 IST

హైదరాబాద్‌: ‘పుష్ప’తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మలయాళ నటుడు ‘ఫహద్‌ ఫాజిల్‌’ (Fahadh Faasil). వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేసే ఆయన మరో రెండు ఆసక్తికర ప్రాజెక్టులతో అలరించేందుకు సిద్ధమయ్యారు. అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా కొత్త సినిమాలను ప్రకటించింది. మంగళవారం ఈ సినిమాలకు సంబంధించిన టైటిల్స్‌తో పాటు, పోస్టర్‌లను కూడా పంచుకుంది. ‘ఆక్సిజన్‌’ (OXYGEN) పేరుతో రూపొందబోయే సినిమాకు సిద్ధార్థ్‌ నాదెళ్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఆసక్తికర కథతో ఈ మూవీ రాబోతోంది. వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది దీన్ని తీర్చిదిద్దుతున్నారు. శోభ యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, కార్తికేయలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శశాంక్‌ యేలేటి దర్శకత్వంలో పట్టాలెక్కనున్న మరో చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ (Dont Trouble The Trouble). ఫన్‌, థ్రిల్‌, ఎమోషన్స్‌తో కూడిన కథగా  తీర్చిదిద్దబోతున్నారు.  జూన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ఫహద్‌ ఫాజిల్‌ ‘పుష్ప: ది రూల్‌’లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీకి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని