‘మాయాబజార్‌’ అంటే జంధ్యాలకు అంత మక్కువ

తెలుగు సినీ తెరపై నవ్వుల పువ్వులు పూయించడమే కాకుండా తనదైన శైలిలో ప్రాసలు, పంచ్‌ డైలాగులతో ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుల్లో జంధ్యాల ఒకరు. ఆయన తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికీ సినీ ప్రియుల్ని ఆకర్షిస్తున్నాయంటే...

Updated : 25 Apr 2021 16:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సినీ తెరపై నవ్వుల పువ్వులు పూయించడమే కాకుండా తనదైన శైలిలో ప్రాసలు, పంచ్‌ డైలాగులతో ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుల్లో జంధ్యాల ఒకరు. ఆయన తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికీ సినీ ప్రియుల్ని ఆకర్షిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే.. జంధ్యాలకు ‘మాయాబజార్‌’ చిత్రమంటే మక్కువ. మరీ ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే ‘మాయాబజార్‌’ విడుదలైన సుమారు 30 యేళ్ల తర్వాత కూడా ఆయన తెరకెక్కించిన కొన్ని చిత్రాలకు ఆ సినిమాలోని పాటల్నే టైటిల్స్‌గా పెట్టుకున్నారు. ఇంతకీ ఆ సినిమాలేమిటో మీరూ చూసేయండి.

‘అహ నా పెళ్లంట.. ఒహో! నా పెళ్లంట’

‘అహ నా పెళ్లంట.. ఒహో నా పెళ్లంట’ అంటూ ‘మాయాబజార్‌’లో అలనాటి నటి సావిత్రి చేసే సందడి అంతా ఇంతా కాదు. అందుకే ఆ పాటను ఇప్పటికీ పలువురు నోటి నుంచి వింటూనే ఉంటాం. ఆ పల్లవినే టైటిల్‌గా పెట్టి జంధ్యాల తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘అహ నా పెళ్లంట’. అంతేకాకుండా ‘ఒహో నా పెళ్లంట’ అనే చిత్రాన్ని కూడా ఆయనే రూపొందించారు.

‘వివాహ భోజనంబు’

‘వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు’ అంటూ ప్రముఖ నటుడు ఎస్వీరంగారావు పాకశాలలో చేసే జిమ్మిక్కులతో అందర్నీ ఆకర్షిస్తారు. 1988లో అదే పాటని టైటిల్‌గా మార్చుకుని జంధ్యాల తెరకెక్కించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. ఈ సినిమాతో ఆయన అందర్నీ ఎంతో నవ్వించారు.

‘చూపులు కలసిన శుభవేళ’

‘చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము...’ అనే ప్రణయ గీతంలో ఏఎన్నార్, సావిత్రిల మధ్య చూపించే అనుబంధం ఎంత మధురంగా ఉంటుందో, ఆ పల్లవితో జంధ్యాల తెరకెక్కించిన ‘చూపులు కలసిన శుభవేళ’ చిత్రమూ అంతే చూడముచ్చటగా ఉంటుంది.

‘హై హై నాయకా’

కేవలం పాటలకు మాత్రమే పరిమితం కాకుండా అందులోని ఓ ఫేమస్‌ డైలాగును సైతం జంధ్యాల టైటిల్‌గా మార్చేశారు. ఘటోత్కచుడి శిష్యగణం ఆయనకు జేజేలు పలుకుతూ చెప్పే ఈ డైలాగ్‌నూ టైటిల్‌గా చేసి ‘హై హై నాయకా’ సినిమా తీయడం జంధ్యాలకే చెల్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని