Tollywood: తెలుగులో వచ్చిన తొలి డబ్బింగ్‌ చిత్రమిదే

ఒక భాషలో విజయం అందుకున్న చిత్రాన్ని మరో భాషలోకి అనువాదం చేస్తుంటారనే విషయం తెలిసిందే. అలా ఓ ఇండస్ట్రీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సినిమా కథని ఇతర పరిశ్రమల ప్రేక్షకులకి పరిచయం చేసే ప్రక్రియే డబ్బింగ్‌.

Published : 04 Jul 2021 19:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక భాషలో విజయం అందుకున్న చిత్రాన్ని మరో భాషలోకి అనువాదం చేస్తుంటారనే విషయం తెలిసిందే. అలా ఓ ఇండస్ట్రీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సినిమా కథని ఇతర పరిశ్రమల ప్రేక్షకులకి పరిచయం చేసే ప్రక్రియే డబ్బింగ్‌. నాటి నుంచి నేటి వరకు హిందీ, తమిళ, మలయాళం, కన్నడ తదితర భాషల్లోని ఎన్నో చిత్రాలు తెలుగువారిని అలరిస్తూనే ఉన్నాయి. వాటిల్లో నటించిన తారలూ ఇక్కడవారికి సుపరిచితులయ్యారు. మరి టాలీవుడ్‌లో ఈ పద్ధతి ఎప్పుడు ఆరంభమైంది? డబ్బింగ్‌ అయిన తొలి సినిమా ఏది? తెలుసుకుందామా...

1931లో తొలిసారి తెలుగు తెరపై మాటలు వినిపించాయి. అంతకు ముందే తెలుగు సినిమా పుట్టినా కేవలం మూకీకే (మాటలు లేకుండా అభినయం) పరిమితమైంది. అలా మూకీగా ఉన్న తెలుగు సినిమా టాకీగా మారి, విభిన్న కథల్ని, నేపథ్యాల్ని పరిచయం చేసింది. ఈ క్రమంలో అనువాద ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. 1950 నుంచి తెలుగులో డబ్బింగ్‌ సినిమాల రాక మొదలైంది. అలా వచ్చిన తొలి అనువాద చిత్రమే ‘ఆహుతి’. బాలీవుడ్‌లో (1946-1-1న విడుదల) విజయం అందుకున్న ‘నీరా ఔర్‌ నందా’ సినిమాకి అనువాదంగా 1950 జూన్‌ 22న విడుదలైంది ఈ చిత్రం. జయసింహ, రూప్ బసంత్, శశి, నిశి బరన్‌ తదితరులు నటించిన ఈ సినిమాకి ఆర్‌.ఎస్‌. జున్నాకర్‌ దర్శకత్వం వహించారు. మాతృకకి పి.శంకర్‌ స్వరాలు సమకూర్చగా తెలుగులో సాలూరి రాజేశ్వరరావు సమకూర్చారు. ఈ సినిమాతోనే మహాకవి శ్రీశ్రీ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాకి మాటలు, పాటలు రాసి తొలి ప్రయత్నంలోనే చిత్రపరిశ్రమని తనవైపునకు తిప్పుకున్నారు. ‘సంఘ సంక్షేమానికి బలైన ప్రేమికుల కథ’ అంటూ తెలుగు వారికి ఈ సినిమాని అందించింది నవీనా ఫిలిమ్స్‌ నిర్మాణ సంస్థ. ఈ వినూత్న ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో అనువాద చిత్రాల జోరు మెల్ల మెల్లగా మొదలైంది. ఈ క్రమంలో ‘ప్రేమలేఖలు’ (1953), ‘రోహిణి’ (1953) తదితర చిత్రాలు బాలీవుడ్‌ నుంచి విచ్చేశాయి. తర్వాతర్వాత తమిళం, మలయాళం, కన్నడ తదితర పరిశ్రమల చిత్రాలూ సందడి చేశాయి. చేస్తూనే ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని