Rocketry: మాధవన్‌ ‘రాకెట్రీ’ని మెచ్చిన సీబీఐ అధికారులు

చేయని నేరానికి జైలు పాలై, నిర్దోషిగా బయటకొచ్చిన  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ’.

Published : 28 Jun 2022 02:10 IST

దిల్లీ: చేయని నేరానికి జైలు పాలై, నరకయాతన అనుభవించి నిర్దోషిగా బయటకొచ్చిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ (Nambi Narayanan) జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ’ (Rocketry). స్వీయ దర్శకత్వంలో మాధవన్‌ (R Madhavan) నటించిన సినిమా ఇది. ఈ ప్రాజెక్టు జులై 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ అధికారుల కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. దిల్లీలోని సిరి ఫోర్ట్‌ ఆడిటోరియం ఇందుకు వేదికైంది. మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌తో సహా పలువురు సీబీఐ అధికారులు, కొందరు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని తిలకించారు. అనంతరం, తమ అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘‘రాకెట్రీ చిత్రం చాలా అర్థవంతంగా, ఆకర్షణీయంగా, వినోదాత్మకంగా ఉంది. సైన్స్‌, టెక్నాలజీ, ఎమోషన్‌ కలగలసిన అద్భుతమైన సినిమా ఇది’’ అని సీబీఐ మాజీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పి.ఎం.నాయర్‌ తెలిపారు. నంబి నారాయణన్‌లా ఇస్రో అభివృద్ధి కోసం తమ జీవితాన్ని ధారపోసిన వేలాదిమంది శాస్త్రవేత్తలకు ఈ చిత్రం అంకితమని కేంద్ర సమాచార, ప్రసార శాఖల కార్యదర్శి అపూర్వ చంద్ర అభివర్ణించారు.

నంబి నారాయణన్‌ గురించి చాలామందికి నిజం తెలియదని, ఆయనపై ఉన్న మచ్చను చెరపాలనే ఉద్దేశంతో మాధవన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ఇదే. సాంకేతికత అంశాలతో కూడుకున్న ఈ కథకు డైరెక్షన్‌ చేయడం ఒకెత్తైతే.. నారాయణన్‌లా కనిపించేందుకు మాధవన్‌ శరీరాకృతిని మార్చుకోవడం మరో ఎత్తు. సిమ్రన్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో సూర్య (దక్షిణాది భాషల్లో), షారుఖ్‌ ఖాన్‌ (హిందీ, ఆంగ్లం) అతిథిలుగా కనిపిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని