రివ్యూ: ప‌లాస 1978

సినిమా బ‌ల‌మైన మాధ్యమం. వినోదం అందించ‌డ‌మే కాదు.. అప్పుడ‌ప్పుడు ఈ మాధ్యమం ద్వారా స‌మాజాన్ని మేల్కొలిపే ప్రయ‌త్నాలు కూడా జ‌రుగుతుంటాయి. ప్రేక్షకుల‌కు సుతిమెత్తగా ఒక పాఠం చెప్పాల‌ని చాలామంది ప్రయ‌త్నిస్తుంటారు. కొంతమంది దర్శకులు అలాంటివి తెరకెక్కించడంలో...

Updated : 13 Mar 2020 13:37 IST

చిత్రం: పలాస 1978

న‌టీన‌టులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ త‌దితరులు

పాటలు: భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల

కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు

ఛాయాగ్రహ‌ణం: అరుల్ విన్సెంట్ 

సంగీతం: రఘు కుంచె

స‌మ‌ర్పణ‌: త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ

నిర్మాత: ధ్యాన్ అట్లూరి 

రచన-దర్శకత్వం: కరుణ కుమార్

సంస్థ‌: సురేష్ ప్రొడ‌క్షన్స్‌

విడుద‌ల తేదీ: 06-03-2020

సినిమా బ‌ల‌మైన మాధ్యమం. వినోదం అందించ‌డ‌మే కాదు.. అప్పుడ‌ప్పుడు ఈ మాధ్యమం ద్వారా స‌మాజాన్ని మేల్కొలిపే ప్రయ‌త్నాలు కూడా జ‌రుగుతుంటాయి. ప్రేక్షకుల‌కు సుతిమెత్తగా ఒక పాఠం చెప్పాల‌ని చాలామంది ప్రయ‌త్నిస్తుంటారు. కొంతమంది దర్శకులు అలాంటివి తెరకెక్కించడంలో కొంత విఫలమవుతుంటారు. అయితే చాలా కొద్దిమంది ద‌ర్శకులు మాత్రం తెలివిగా తాము చెప్పాల‌నుకున్న విష‌యాన్ని, స‌గ‌టు ప్రేక్షకుడు ఆస్వాదించేలా వినోదాన్ని మేళ‌వించి చెబుతుంటారు. ‘ప‌లాస 1978’ కూడా ఈ కోవ‌కి చెందిన చిత్రమే. ఇంతకీ దాని కథేంటంటే.. 

క‌థేంటంటే: ప‌లాస‌లోని క‌ళాకారుల కుటుంబానికి చెందిన అన్నద‌మ్ములు మోహ‌న్‌రావు(ర‌క్షిత్‌), రంగారావు(తిరువీర్‌). ఇద్దరూ అన్యోన్యంగా మెలుగుతుంటారు. ఆ ఊళ్లోనే ఉన్న మ‌రో ఇద్దరు అన్నద‌మ్ములు పెద్ద షావుకారు(జ‌నార్దన్‌), చిన్న షావుకారు గురుమూర్తి(ర‌ఘుకుంచె). వీళ్ల మ‌ధ్య మాత్రం ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. వీళ్ల ఆధిప‌త్య పోరుకి మోహ‌న్‌రావు, రంగారావు పావులుగా మారిపోతారు. అధికారం కోసం ఎత్తులు, పైఎత్తులు సాగుతున్న క్రమంలో ఈ ఇద్దరు అన్నద‌మ్ముల జీవితాల్లో ఏం జ‌రిగింది?త‌రాలుగా న‌మ్ముకున్న వీళ్ల కుటుంబ క‌ళ ఏమైంది? ఆ ఊరికొచ్చిన ఎస్సై సెబాస్టియ‌న్(రామ‌రాజు) వీళ్ల జీవితాల్ని ఎలా ప్రభావితం చేశాడనే విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: స‌మాజంలో మ‌నుషుల మ‌ధ్య క‌నిపిస్తున్న అంత‌రాల్ని ఎత్తిచూపుతూ సాగే సినిమా ఇది. అలాగ‌ని ఇందులో సందేశాల కోస‌మ‌ని ఊక‌దంపుడు ప్రసంగాలు ఎక్కడా వినిపించ‌వు. స్థాయీ భేదాల్ని సూటిగా ప్రశ్నించే చిత్రమిది. వేరొక‌రిని తిట్టిపోసే ప్రయ‌త్నం కూడా ఎక్కడా జ‌ర‌గ‌లేదు. రాజ‌కీయాలంటే మేమే చేయాలి, మాకోసం ఊరి చివ‌రి వ్యక్తులు ఊడిగ‌మే చేయాలనే ఆలోచ‌న‌తో క‌నిపించే కొంత‌మంది వ్యక్తుల నైజాల్ని తెర‌పై చూపించే ప్రయ‌త్నం చేశాడు ద‌ర్శకుడు. ఇలాంటి విష‌యాల్ని ఒక క‌థ‌గా చెబితే ఎవ‌రైనా  స‌రే.. ఇదొక డాక్యుమెంట‌రీ త‌ర‌హా సినిమా అవుతుంద‌నుకుంటారు. కానీ ద‌ర్శకుడు క‌రుణ‌కుమార్ వాస్తవిక‌త‌కి పెద్దపీట వేస్తూ, స‌గ‌టు జీవితాల్ని, వాళ్ల జీవ‌భాష‌ని తెర‌పై ఆవిష్కరించి అందులోనుంచే వినోదం రాబ‌ట్టే ప్రయ‌త్నం చేశాడు. దాంతో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుందీ చిత్రం. 1978 మొద‌లుకుని నాలుగు ద‌శ‌ల్లో సాగుతుందీ చిత్రం. శ్రీకాకుళం ప‌ల్లె జీవితాల్ని స‌హ‌జంగా ఆవిష్కరిస్తూ, అక్కడి జాన‌ప‌దాల్ని వినిపిస్తూ క‌థ‌లో లీనం చేస్తాడు ద‌ర్శకుడు. మోహ‌న్‌రావు, రంగారావులకి ఎదుర‌య్యే అనుభ‌వాలు, వాళ్లు రౌడీలుగా మారే క్రమంతో సినిమా వేగం అందుకుంటుంది. భైరాగి ఎపిసోడ్‌, ఆ త‌ర్వాత అధికారం కోసం షావుకారు సోద‌రులు వేసే ఎత్తుగ‌డ‌లు, అందుకోసం మోహ‌న్‌రావు, రంగారావుల్ని విడ‌దీసి వాడుకునే విధానం ఆసక్తిని రేకెత్తిస్తాయి. విరామ స‌న్నివేశాలు మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటాయి. ఈ అన్నద‌మ్ములిద్దరి మ‌ధ్య ఏం జరుగుతుంద‌నే ఆస‌క్తితో ద్వితీయార్ధంలోకి అడుగుపెట్టగా ఊహించ‌ని మ‌లుపు చోటు చేసుకుంటుంది. ఇలాంటి మ‌లుపులు ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కూ సాగుతాయి. మోహ‌న్‌రావు ఎంచుకునే మార్గం ప‌తాక స‌న్నివేశాల‌కే హైలైట్‌గా నిలిచింది. ఏక‌ల‌వ్యుడి వేలుని అతికించేందుకు ఏ దేవుడూ రాలేదంటూ ఆ పాత్రతో చెప్పించిన సంభాష‌ణ‌లు కూడా ఆలోచ‌న‌ని రేకెత్తిస్తాయి. ప్రథ‌మార్ధంలో పలు స‌న్నివేశాలు న‌వ్వు తెప్పిస్తాయి. నాలుగు దశల్లో  సాగే క‌థే అయినా ద‌ర్శకుడు ఆ స‌న్నివేశాల్లో అంత‌గా వైవిధ్యం చూపించ‌లేదు. దాంతో సినిమా అంతా కూడా ఒకే దశలో సాగుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని స‌న్నివేశాలు ఊహ‌కు త‌గ్గట్టుగా సాగ‌డం, యాక్షన్ ఘ‌ట్టాలు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్ని త‌ల‌పించే స్థాయిలో ఉండ‌డం సినిమాకి మైన‌స్‌గా మారింది. 

ఎవ‌రెలా చేశారంటే: ఇందులో పాత్రలే క‌నిపిస్తాయి త‌ప్పా న‌టులు క‌నిపించరు. ఆయా పాత్రల కోసం న‌టీన‌టుల్ని ఎంపిక చేసుకున్న విధానం చాలా బాగుంది. మోహ‌న్‌రావు పాత్రలో రక్షిత్ ఒదిగిపోయాడు. ఆయన మాట‌లు కూడా పాత్రకి స‌హ‌జ‌త్వాన్ని తీసుకొచ్చాయి. తిరువీర్ న‌ట‌న మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటుంది. జ‌నార్దన్‌, ర‌ఘు కుంచె, రామ‌రాజు.. త‌దిత‌రులు వాళ్ల పాత్రల‌కి జీవం పోశారు. అయితే స‌హ‌జ‌త్వం పేరుతో కొన్ని పాత్రల‌కి మితిమీరిన మేక‌ప్ చేసిన‌ట్టు క‌నిపించింది. సాంకేతికంగా సినిమా మెప్పిస్తుంది. ర‌ఘు కుంచె న‌టుడిగానే కాకుండా సంగీత ద‌ర్శకుడిగా సినిమాపై చ‌క్కటి ప్రభావం చూపించాడు. ముఖ్యంగా నేప‌థ్య సంగీతంతో ఆయా స‌న్నివేశాల స్థాయి పెరిగింది. విన్సెంట్ కెమెరా ప‌నిత‌నం కొన్నిచోట్ల మెప్పిస్తుంది. దర్శకుడు కరుణకుమార్‌కి ఇదే తొలి చిత్రమైనా ఇలాంటి క‌థ‌ని ఎంచుకోవ‌డం, దాన్ని అంతే ప‌క్కాగా తెర‌పైకి తీసుకురావ‌డం ఆక‌ట్టుకుంటుంది. ప‌రిమిత వ్యయంతో తీసిన సినిమా కాబ‌ట్టి  కొన్ని స‌న్నివేశాలు సినిమా ప‌రిధిని చెప్పక‌నే చెబుతాయి.

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ క‌థ‌, క‌థ‌నం - యాక్షన్ ఘ‌ట్టాల మోతాదు
+ న‌టీన‌టులు   
+ సంగీతం   

చివ‌రిగా: స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డేలా.. ‘ప‌లాస 1978’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది కేవలం అతడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని