రివ్యూ: షూట్‌ ఎట్‌ సైట్‌ (ఉత్తర్వు)

మిస్కిన్‌, విక్రాంత్‌ కీలక పాత్రల్లో గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘సుట్టు పిడిక్క ఉత్తర్వు’. తాజాగా దీనిని తెలుగులో ‘షూట్‌ ఎట్‌ సైట్‌(ఉత్తర్వు)’ పేరుతో అనువదించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో పలు చిత్రాలను

Updated : 15 Dec 2022 16:12 IST

చిత్రం: షూట్‌ ఎట్‌ సైట్‌ (ఉత్తర్వు)

నటీనటులు: విక్రాంత్‌, అతుల్య రవి, సుశీంద్రన్‌, మిస్కిన్‌, జేకే రితేశ్‌, మహిమ తదితరులు

సంగీతం: జేక్స్‌ బిజోయ్‌

సినిమాటోగ్రఫీ: సుజీత్‌ సారంగ్‌

ఎడిటింగ్‌: జి.రామారావు

నిర్మాత: రాజశేఖర్‌ అన్నభీమోజు

దర్శకత్వం: రామ్‌ ప్రకాశ్‌ రాయప్ప

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌

మిస్కిన్‌, విక్రాంత్‌ కీలక పాత్రల్లో గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘సుట్టు పిడిక్క ఉత్తర్వు’. తాజాగా దీన్ని తెలుగులో ‘షూట్‌ ఎట్‌ సైట్‌ (ఉత్తర్వు)’ పేరుతో అనువదించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో పలు చిత్రాలను ఓటీటీ ఫ్లాట్‌ఫాంల వేదికగా విడుదల చేస్తున్నారు. ఇటీవల శివ కార్తికేయన్‌ ‘శక్తి’ కూడా అలాగే విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రాన్ని కూడా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేశారు. మరి ఈ ‘షూట్‌ ఎట్‌ సైట్‌’ ఏంటి? ఎందుకు ఆ ఉత్తర్వు ఇవ్వాల్సి వచ్చింది?

కథేంటంటే: అశోక్‌ (విక్రాంత్‌) నేతృత్వంలో నలుగురు దుండగులు హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో దోపిడీ చేస్తారు. పోలీసులు వెంట పడటంతో ఓ కాలనీలోకి ప్రవేశించి, అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. దీంతో పోలీస్‌ కమిషనర్‌ ఇబ్రహీం (మిస్కిన్‌) షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్‌ జారీ చేస్తారు. మరి ఆ నలుగురు దుండగులు పోలీసుల నుంచి తప్పించుకున్నారా? లేక వారి చేతిలో ఎన్‌కౌంటర్‌ అయ్యారా? అసలు ఆ నలుగురు దొంగతనం చేయడం వెనుక కారణం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌. బ్యాంకు దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు వారి వెంటపడటం, వారి నుంచి దొంగలు తప్పించుకోవడం చాలా సినిమాల్లో చూశాం. ఈ చిన్న పాయింట్‌ తీసుకుని దానికి చుట్టూ కథ అల్లుకున్నారు. ప్రథమార్ధమంతా పోలీసులు దొంగల వెంటపడటం.. వారు ఆ కాలనీలోకి కొన్ని ఇళ్లలోకి వెళ్లి అడ్డు వచ్చిన వారందరినీ చంపుకొంటూ వెళ్లడం తదితర సన్నివేశాలతో సాగుతుంది. ఓ పాప ఆపరేషన్‌ కోసం డబ్బు దొంగిలించారన్న విషయం తెలిసిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకుని ఆ డబ్బు ఆస్పత్రికి ఎలా తీసుకెళ్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది. అదే టెంపోను కొనసాగించాల్సి దర్శకుడు అనవసర సన్నివేశాలతో విసుగెత్తించాడు. 

ముఖ్యంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు చేస్తున్న ఆపరేషన్‌ను చిత్రీకరించేందుకు ఒక అమ్మాయి, ఇద్దరు రిపోర్టర్లు చేసే హంగామా అతి అనిపిస్తుంది. పోలీసులు అశోక్‌ను కాల్చి చంపడంతో కథ, కీలక మలుపు తీసుకుంటుంది. నలుగురు దొంగల్లో చివరకు ఒక్కడే మిగులుతాడు. ఆ ఒక్కడు ఏం చేశాడన్నది మాత్రం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. క్లైమాక్స్‌ ట్విస్ట్ మాత్రం ఆశ్చర్యపరుస్తుంది. అయితే, అసలు విషయం తెలిసిన తర్వాత దీని కోసం ఇంత ఆపరేషన్‌ నిర్వహించాలా? అనే సందేహం ప్రేక్షకుల్లో కలగక మానదు. అందుకు లాజిక్‌ కూడా పోలీస్‌ కమిషనర్‌తో చెప్పిస్తాడు దర్శకుడు.

ఎవరెలా చేశారంటే: కీలక పాత్రల్లో కనిపించిన విక్రాంత్‌, మిస్కిన్‌ సహా ఎవరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని వ్యక్తులు. ‘డిటెక్టివ్‌’ చిత్ర దర్శకుడిగా మిస్కిన్‌ పేరును వినడమే తప్ప ఆయన్ను చూడలేదు. దీంతో ఎవరి పాత్రల పరిధి మేరకు వారు నటించారు. కథ ఉత్కంఠగా సాగే సమయంలో ఇద్దరు రిపోర్టర్లు, ఒక అమ్మాయి సన్నివేశాలు మాత్రం విసిగిస్తాయి. కథ, కథనాలపై దర్శకుడు ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేది. రెండు, మూడు భావోద్వేగ సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి ఇంకొన్ని రాసుకొని ఉంటే సినిమా ఇంకాస్త అలరించేది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌పైన దృష్టి పెట్టిన దర్శకుడు మిగిలిన సన్నివేశాల విషయంలో అంతే శ్రద్ధ కనబరిస్తే బాగుండేది. సుజీత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ, జేక్స్‌ బిజోయ్‌ నేపథ్య సంగీతం బాగున్నాయి. పాటలకు అవకాశం లేదు. కథ చిన్నదే కావడం, ఒకే కాలనీలో సాగడం అందుకు తగినట్లుగానే నిర్మాణ విలువలు ఉన్నాయి. ప్రస్తుతం థియేటర్‌కు వెళ్లి చూసే పరిస్థితి లేదు కాబట్టి, యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇష్టపడేవాళ్లు ఓసారి చూడవచ్చు.

బలాలు బలహీనతలు
+ క్లైమాక్స్‌ ట్విస్ట్‌ - సాగదీతగా అనిపించే కథనం
+ నేపథ్య సంగీతం - తెలిసిన నటీనటులు లేకపోవడం

చివరిగా: సా...గిన ‘షూట్‌ ఎట్‌ సైట్‌ ఉత్తర్వు’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని