‘ఈ దగ్గు కూడా నాదే బాబూ’

‘దేవదాసు’ విడుదలై (1953) బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్న రోజులవి. అప్పట్లో ఘంటసాల నాటకాల్లో నటిస్తుండేవారు. ముఖ్యంగా ‘సక్కుబాయి’ అనే నాటకంలో యోగి వేషం వేశారు

Published : 30 Jul 2023 15:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘దేవదాసు’ విడుదలై (1953) బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్న రోజులవి. అప్పట్లో ఘంటసాల నాటకాల్లో నటిస్తుండేవారు. ముఖ్యంగా ‘సక్కుబాయి’ అనే నాటకంలో యోగి వేషం వేశారు. ‘రంగా రంగా యనండీ’ అన్న పాటతో ఆయన పాత్ర ప్రవేశం చేయాల్సి ఉంది. మిగిలిన నటులకంటే జనానికి ఘంటసాల అంటేనే ఎక్కువ ఆదరణ. దీంతో రెండు మూడు దృశ్యాలు అయిన దగ్గర్నుంచీ, ‘‘ఘంటసాల రావాలి, రావాలి’’ అని ప్రేక్షకుల్లో గోల, గగ్గోలు! ఆయన పాత్ర వచ్చినప్పుడు ఆయన వస్తారు గానీ, ముందే వచ్చేస్తారా? జనానికి అదేం సంబంధం లేదు. ఆయన రావాల్సిందే. మొత్తానికి ఆయన ‘‘రంగా రంగా’’ అని పాడుతూ రంగప్రవేశం చేస్తే, జనం ఒప్పుకోలేదు.

పాట వినరు. గోల! ‘‘దేవదాసు పాటలు పాడాలి... దేవదాసు’’... అంటూ ఈలలు, గోల గోల! ఇక లాభం లేదని ఘంటసాల పాట ఆపేసి, పాత్ర నుంచి బయటికొచ్చి, మైకు దగ్గర నిలబడి ‘‘బాబూ.. నాటకం జరగనివ్వండి. అయిన తర్వాత, పాటలు పాడతాను. దేవదాసు ఒక్కటే కాదు మీరు అడిగిన పాటలన్నీ పాడతాను. కాస్త ఓపిక పట్టండి’’ అని మాట ఇస్తే జనం సద్దుమణిగారు. నాటకం పూర్తి అవుతూనే, ఘంటసాల సినిమా పాటలు, గ్రామఫోన్‌ పాటలూ పాడారు. ముందుగా ‘‘జగమే మాయ’’ పాడారు. దానికి ‘వన్స్‌మోర్‌’లు పడ్డాయి. పాట చివర, దగ్గుతారు కదా! ఆ దగ్గు దగ్గి ‘‘ఈ దగ్గు కూడా నాదే బాబూ’’ అన్నారు. దాంతో మళ్లీ జనంలో ఈలలు, చప్పట్లు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని