Updated : 09 May 2020 14:05 IST

అలా తన కలను నెరవేర్చుకున్న విజయ్‌

క్రికెట్‌ కోసం సంగీతాన్ని వదులుకున్న హీరో

హైదరాబాద్: ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి తన స్టైల్, నటనతో టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరోగా ఎదిగారు విజయ్‌ దేవరకొండ. అనతి కాలంలోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ హీరో జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. నేడు అతడి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు

సింగర్‌ అవ్వాలనుకున్నాడు కానీ..

విజయ్‌ చిన్నప్పుడు సింగర్‌ కావాలనుకున్నాడు. క్లాసికల్‌ సంగీతంలో శిక్షణ కూడా తీసుకోవాలనుకున్నాడు. అదేసమయంలో క్రికెట్‌ శిక్షణ కారణంగా.. సమయాన్ని కేటాయించలేక సంగీతాన్ని వదులుకున్నాడు. అలా సింగర్‌ కావాలనే తన కలను ఆదిలోనే పక్కనపెట్టాడు. అయితే తాను ప్రారంభించిన ‘రౌడీ’ బ్రాండ్‌ ఆంథమ్‌ కోసం విజయ్‌ మొదటిసారి గొంతు సవరించుకున్నాడు. అలాగే ‘గీత గోవిందం’ చిత్రంలోని ‘వాట్‌ ది లైఫ్‌’ అనే పాట పాడి ప్రేక్షకులను అలరించాడు.

ఆ సినిమాతో వచ్చినప్పటికీ..

విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించిన ‘నువ్విలా’ సినిమాతో విజయ్‌ దేవరకొండ మొదటిసారి వెండితెరపై సందడి చేశాడు. 2011లో విడుదలైన ఈ సినిమాతో ఆరుగురు కొత్త నటీనటుల్ని రవిబాబు వెండితెరకు అందించారు. ఆ తర్వాత విజయ్‌.. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెప్పించాడు. ఆ రెండు సినిమాలు విజయ్‌కు అనుకున్నంతస్థాయిలో బ్రేక్‌ను ఇవ్వలేకపోయాయి. అలాంటి సమయంలోనే నాగ్‌అశ్విన్‌ దర్శకత్వం వహించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం విజయ్‌కు గుర్తింపు తీసుకువచ్చింది. నాని కథానాయకుడిగా 2015లో విడుదలైన ఈ సినిమాలో విజయ్‌ రిషి పాత్రలో మెప్పించాడు. 

క్లాస్‌ టు మాస్‌ 

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తర్వాత విజయ్‌ వెనుక్కి తిరిగి చూసుకోలేదు. అలా విజయ్‌ పూర్తి నిడివి ఉన్న పాత్రలో మెప్పించిన తొలిచిత్రం ‘పెళ్లి చూపులు’. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్‌ క్లాస్‌ లుక్‌లో కనిపించి.. అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టాడు. ఆ తర్వాత ఏడాదిలో ‘అర్జున్‌ రెడ్డి’గా కనిపించి మాస్‌ను ఆకట్టుకున్నాడు. బోల్డ్‌ పాత్రలో నటించి ఒక్కసారిగా విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతోపాటు ఎన్నో అవార్డులు అందుకున్నాడు. పరశురామ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గీతగోవిందం’ సినిమా విజయ్‌ కెరీర్‌లో మరో సూపర్‌హిట్‌ చిత్రంగా మెప్పించింది. ఈ సినిమా తర్వాత ‘నోటా’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది.  

బన్నీ మెచ్చిన ‘రౌడీ’ వేర్‌..

స్టైల్‌ విషయంలో విజయ్‌ తనకంటూ ప్రత్యేకమైన ట్రెండ్‌ను ఫాలో అవుతుంటాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ‘రౌడీ’ అనే పేరుతో ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టాడు. యువతీయువకుల్ని ఆకర్షించే బ్రాండ్‌ దుస్తులతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అగ్రకథానాయకుడు అల్లు అర్జున్‌ సైతం ‘రౌడీ’ బ్రాండ్‌కు ఫిదా అయ్యాడు. అందువల్లనే ఇటీవల బన్నీకి ప్రత్యేకంగా ‘రౌడీ’ దుస్తులను డిజైన్‌ చేసి పంపించాడు విజయ్‌.

విజయ్‌ సాయంతో అతనికి టైటిల్‌ వచ్చింది

సహాయం కోసం ఎదురుచూస్తున్నవారికి తనవంతు సాయం చేయడానికి విజయ్‌ ఎప్పుడూ ముందుంటాడు. అలా ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి గాను తాను అందుకున్న మొదటి ఫిలింఫేర్‌ అవార్డును రూ.25 లక్షలకు వెలం వేసి ఆ డబ్బులను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాడు. అంతేకాకుండా ఇటీవల గణేష్‌ అంబూరీ అనే వ్యక్తికి వాకో ఇండియన్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు రూ.24000 ఆర్థికసాయంగా అందించాడు. విజయ్‌ సాయంతో పోటీల్లో పాల్గొన్న గణేష్‌ ఛాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే ప్రస్తుతం కరోనా సమయంలో కూడా మధ్యతరగతి కుటుంబాలకు సాయం చేయడానికి ‘దేవర ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో ఆయన పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నాడు.

 

 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని