Updated : 12 Jan 2021 19:51 IST

‘మాస్టర్‌’ లీక్‌.. స్పందించిన డైరెక్టర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా లాక్‌డౌన్‌లో మూతపడ్డ థియేటర్లు మళ్లీ తెరచుకున్నాయో లేదో పైరసీ భూతం నిద్రలేచింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన ‘మాస్టర్‌’ లీక్‌ అయింది. విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు(జనవరి 13న) థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. విడుదలకు ముందే ఈ చిత్రానికి సంబంధించిన వీడియోలు లీక్‌ అయ్యాయి. అవి ఇంటర్నెట్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై చిత్రబృందం  స్పందించింది. సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని, కనీసం తమ శ్రమను గౌరవించాలని వేడుకుంది. థియేటర్లలోనే సినిమా చూడాలని కోరింది. 

పైరసీపై సినిమా దర్శకుడు లోకేశ్‌ స్పందిస్తూ.. ఓ ట్వీట్‌ చేశారు. ‘‘మాస్టర్‌’ను మీముందుకు తీసుకురావడానికి 1.5 సంవత్సరాలు సుదీర్ఘంగా ఓ పోరాటమే చేశాం. మీరు థియేటర్లలో సినిమా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. లీక్‌ అయిన వీడియో క్లిప్‌లను మీరు చూడటం గానీ.. వాటిని ఇతరులకు షేర్‌ చేయడం కానీ దయచేసి చేయకండి. ధన్యవాదాలు’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. విజయ్‌ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు సైతం ‘పైరసీ వద్దు.. థియేటర్లలోనే సినిమా చూద్దాం’ అంటూ ప్రచారం చేస్తుండటం విశేషం. చిత్రబృందం ఫిర్యాదుతో సోషల్‌ మీడియాలో ఆ వీడియోలను తొలగించారు. ఆ సినిమాను పైరసీ చేసిన ముగ్గురు వ్యక్తులను ఇప్పటికే తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమా నిజానికి గతేడాది వేసవిలోనే విడుదల కావాల్సి ఉంది. కరోనా.. లాక్‌డౌన్‌ వల్ల అది కుదరలేదు. కొంతకాలం క్రితం ఈ చిత్రం ‘ఓటీటీ’లో విడుదల అవుతోందన్న వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్రబృందాన్ని సంప్రదించింది కూడా. కానీ.. ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలన్న ఆలోచనతో దర్శకనిర్మాతలు అందుకు ఒప్పుకోలేదు. ఈ చిత్రంలో తమిళ దళపతి విజయ్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మాళవిక మోహనన్‌ కథానాయిక. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడు. ఆండ్రియా, శాంతను, అర్జున్‌దాస్‌ ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌.. ట్రైలర్లు యూట్యూబ్‌లో రికార్డులు బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. 

ఇవీ చదవండి!

‘పెళ్లి సందడి’కి పాతికేళ్లు

మన సంక్రాంతి వీడియో సాంగ్‌ చూశారా..


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని