Ruhani Sharma: సైకో పాత్రలు చేయాలనుంది... జుట్టు లేకున్నా అందమే

మేమిద్దరం వేరే ఒక ప్రాజెక్ట్‌ చేస్తున్న సమయంలో శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. ఆరు నెలల తర్వాత ఫోన్‌ చేసి ‘నూటొక్క జిల్లాల అందగాడు’ కథను వినిపించారు. వినగానే నచ్చేసింది.

Updated : 10 Aug 2022 12:23 IST

‘చి.ల.సౌ’ చిత్రంలో అంజలిగా తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ రుహాని శర్మ. అందులో తన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత హిట్‌, డర్టీ హరి సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు అవసరాల శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ హీరోయిన్‌గా చేసింది.  సెప్టెంబర్‌ 3న ఆ చిత్రం ప్రేక్షకులు ముందుకొస్తుంది. ఈ సందర్భంగా రుహాని శర్మ మీడియాతో మాట్లాడారు.  ఆ విషయాలు ఆమె మాటల్లోనే.. 

అందగాడి కథ అలా మొదలైంది

మేమిద్దరం వేరే ఒక ప్రాజెక్ట్‌ చేస్తున్న సమయంలో శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. ఆరు నెలల తర్వాత ఫోన్‌ చేసి ‘నూటొక్క జిల్లాల అందగాడు’ కథను వినిపించారు. వినగానే నచ్చేసింది. హీరోహీరోయిన్ల పాత్రలను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. బట్టతలతో బాధపడే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది.  తనను తాను అంగీకరించి ఎలా ముందుకు సాగాడనే కథాంశంతో  తెరకెక్కింది. నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేను. కానీ కథలో కీలకంగా మారే పాత్ర నాది. నిడివి కూడా ఎక్కువగానే ఉంటుంది.  


 రెండు సన్నివేశాలు చాలు

‘నూటొక్క జిల్లాల అందగాడు’ కథను రాసింది శ్రీనివాసే అయినా, డైరెక్టర్‌ విద్యాసాగర్‌ దాన్ని సొంతం చేసుకొని తెరకెక్కించారు. సినిమా ద్వారా డైరెక్టర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. నా నుంచి, ఇతర నటీనటుల నుంచి ఎలాంటి నటనను రాబట్టుకోవాలో వారికి తెలుసు. వాళ్లిద్దరికీ కథపైన స్పష్టత ఉంది. శ్రీనివాస్‌ రచయితగా కథ గురించి దర్శకుడితో చర్చిస్తూ  తగిన మార్పులు,చేర్పులు చేస్తుండేవాడు. నేను తెరపై ఎంతసేపు కనిపిస్తాననేది ఆలోచించను. స్క్రిప్ట్, నా పాత్ర బాగుండేలా చూసుకుంటాను. నటనకు ప్రాధాన్యముంటే  రెండు సన్నివేశాలున్నా  చాలనిపిస్తుంది. ‘చిలసౌ’ తర్వాత ‘హిట్‌’, ‘డర్టీ హరి’ సినిమాలు చేశాను. వాటిలో కూడా నా పాత్ర నిడివి తక్కువే ఉంటుంది. సినిమా స్ర్కిప్ట్‌ నా మొదటి ప్రాధాన్యత, ఆ తర్వాత నా పాత్ర బాగుందనిపిస్తే  చేసేందుకు వెంటన ఒప్పుకుంటాను. రెండు పాటల కోసం హీరోయిన్‌గా చేయాలని ఉండదు. 


సరదాగా సాగింది

‘చి.ల.సౌ’ తర్వాత ఒప్పుకున్న సినిమా ఇదే. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. దీనికన్నా ముందు ‘హిట్‌’, ‘డర్టీ హరి’ వచ్చాయి. తమిళం, మలయాళం, హిందీలోనూ సినిమాలు చేశాను. మా సినిమా చిత్రీకరణంతా సరదాగా సాగిపోయింది.  శ్రీనివాస్‌ ఇప్పుడు మంచి స్నేహితుడయ్యాడు. షూటింగ్‌ మొదలైన రెండు, మూడు రోజులు కొంత అసౌకర్యంగానే అనిపించింది. కానీ ఆ తర్వాత ఇద్దరం కలిసిపోయాం. నేరుగా వెళ్లి సలహాలు అడిగేంత చనువు ఏర్పడింది. సినిమాలు, ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటాం. అవసరాల శ్రీనివాస్‌ దర్శకుడు,రచయితగా ఎంత మంచి ప్రతిభ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన గత చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది. అయితే  దర్శకుడు, రచయిత కన్నా ముందు మంచి వ్యక్తిత్వమున్న నటుడాయన. 


జుట్టు లేకున్నా అందమే

భర్తకు బట్టతల ఉందని నా స్నేహితులు కొందరు వాపోతుంటారు. ఆ మాటలు విన్నప్పడు షాక్‌కి గురవుతాను. బట్టతల అనేది చాలా సాధారణ సమస్య.  అమ్మాయిలకు కూడా జుట్టు ఊడిపోతుంది. నా సన్నిహితులు కొందరు ఇదే సమస్యతో బాధపడుతుంటారు. జుట్టు లేకున్నా మీరు అందంగానే కనిపిస్తారని వారికి చెబుతుంటాను. చికిత్స చేయించుకునేందుకు సిద్ధమవుతుంటారు. బయటకు ఎలా కనిపించామనేది అందం కానే కాదు. ఇంత సున్నితమైన సమస్యను మా సినిమాలో భావోద్వేగంగా మలిచారు దర్శకరచయితలు. అయితే  బాలీవుడ్‌లో వచ్చిన సినిమాలకు మాకు ఎలాంటి సంబంధం లేదనే చెబుతాను.  ‘బాలా’, ‘ఉజ్డా చమ్మన్‌’ చూడలేదు. కానీ ఆ చిత్రాల్లాగే ‘నూటొక్క జిల్లాల అందగాడు’ కూడా బట్టతల చుట్టూ తిరిగే కథే.  అయితే వాటితో  పోల్చితే ఈ సినిమా కథ, దాన్ని తీర్చిదిద్దిన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటాయి.


సైకో పాత్రలు చేయాలనుంది

తెలుగులో చేసింది నాలుగు సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి విశేషమైన ప్రేమాభిమానాలు దక్కాయి. ఇప్పటికీ  ప్రేక్షకులు ‘చి.ల.సౌ’లోని అంజలి పాత్ర గురించి మాట్లాడుకుంటారు. నేను తెలుగులో చేసిన నాలుగు సినిమాలు పూర్తి భిన్నమైన సినిమాలే. కానీ నాకు వ్యక్తిగతంగా ప్రేమకథలు, సైకో పాత్రలు చేయాలని ఉంది. మరీ బోల్డ్‌గా నటించలేను. సౌకర్యంగా అనిపిస్తేనే చేస్తాను. హిందీ పరిశ్రమలో అవకాశాలు కష్టం. నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి విభిన్నంగా ఉంటుంది.  రెండు,మూడు ఆడిషన్స్‌కి హాజరవ్వాల్సి ఉంటుంది. అయినా హిందీ పరిశ్రమలోనూ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ ప్రస్తుతం నా దృష్టంతా టాలీవుడ్‌పైనా ఉంది.   ప్రస్తుతం నాని నిర్మిస్తున్న ‘మీట్‌ క్యూట్‌’లో చేస్తున్నాను. ఇది 5 కథల సమాహారం. ఇందులో సత్యరాజ్‌తో కలిసి నటిస్తున్నాను. దీంతో పాటు ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ తెలుగులో చేస్తున్న ఆంథాలజీని ఓకే చేశాను. కథ బాగుంటే ఏ పరిశ్రమలో చేయడానికైనా నేను సిద్ధమే. తెలుగులో స్వయంగా డబ్బింగ్‌ చెప్పడానికి  ప్రయత్నాలు చేస్తున్నాను. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని