Kangana Ranaut: కంగనా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా?

Kangana Ranaut: ద్వారకలో కొలువై ఉన్న శ్రీకృష్ణుడి ఆలయాన్ని దర్శించుకున్న కంగనా రనౌత్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై స్పందించారు.

Published : 03 Nov 2023 17:35 IST

ద్వారక: త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై బాలీవుడ్‌ అగ్ర కథానాయిక కంగనా రనౌత్‌ (Kangana Ranaut) స్పందించారు. ద్వారకలోని శ్రీకృష్ణుడి ఆలయాన్ని సందర్శించిన ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజకీయ రంగ ప్రవేశంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మీరు పోటీ చేయబోతున్నారా’ అని అడగ్గా, ‘భగవాన్‌ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా పోరాటం చేస్తా’ అని బదులిచ్చారు. అంటే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. కంగనా గత కొద్ది రోజులుగా వివిధ సందర్భాల్లో భాజపా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ క్రమంలో కంగనా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అనంతరం ఆమె మాట్లాడుతూ... ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వ శక్తి సామర్థ్యాల కారణంగా సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం సాధ్యమైంది. సనాతన ధర్మ పతాకం ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడాలి. ద్వారక అనేది ఆధ్యాత్మికతకు నెలవు. ఇక్కడ ఉండేది ప్రతిదీ అద్భుతమే. ప్రతి అణువులోనూ ద్వారకావాసుడు ఉన్నాడు. వీలు కుదిరినప్పుడల్లా స్వామిని దర్శించుకునేందుకు ఇక్కడకు వస్తుంటా. నీట మునిగిన ద్వారకను పై నుంచి చూసినా కనపడుతుంది. కానీ, నీటి అడుగు భాగానికి వెళ్లి ఆ నాటి గుర్తులను చూసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అభిలషిస్తున్నా. నా వరకూ కృష్ణుడి ద్వారక ఒక స్వర్గంలాంటిది’’ అని కంగనా అభిప్రాయపడ్డారు.

ఇక కంగనా (Kangana Ranaut) సినిమాల విషయానికొస్తే, ఇటీవల ఆమె నటించిన ‘తేజస్‌’ (Tejas) బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇదే కాదు, గత నాలుగైదు చిత్రాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో నటించిన ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపిస్తున్నారు. దీని తర్వాత ‘తను వెడ్స్‌ మను  పార్ట్‌3’ చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని