Sammathame: ‘సమ్మతమే’ అలాంటిదే.. అందుకే వారి వివరాలు బయటపెట్టలేదు: కిరణ్‌ అబ్బవరం

కొందరు నటులు తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకుంటారు. వరుస అవకాశాలు దక్కించుకుంటుంటారు. ఇలాంటి జాబితాలోకే వస్తారు కిరణ్‌ అబ్బవరం. ‘రాజా వారు రాణి గారు’తో కెరీర్‌ ప్రారంభించి, ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన వెంటనే ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’తో అలరించారు.

Updated : 07 Dec 2022 21:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొందరు నటులు తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకుంటారు. వరుస అవకాశాలు దక్కించుకుంటుంటారు. ఇలాంటి జాబితాలోకే వస్తారు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). ‘రాజావారు రాణి గారు’తో కెరీర్‌ ప్రారంభించి, ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన వెంటనే ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’తో అలరించారు. ఇటీవల ‘సెబాస్టియన్‌’తో సందడి చేశారు. ఇప్పుడు ‘సమ్మతమే’ (Sammathame) అంటూ ఓ ప్రేమకథను చూపించబోతున్నారు. గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం విలేకరులతో మాట్లాడారు.

* ‘సమ్మతమే’ ఎలా మొదలైంది?

కిరణ్‌: నేనూ దర్శకుడు గోపీనాథ్ నాలుగేళ్లుగా కలిసి ప్రయాణిస్తున్నాం. నేను హైదరాబాద్ వచ్చి షార్ట్ ఫిల్మ్స్‌ చేస్తున్నప్పుడు ఆయన నాకు పరిచయమయ్యారు. మేమిద్దరం సినిమాల గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. మాలో ఒకరికి నటన ఇష్టం, మరొకరికి దర్శకత్వం ఇష్టం. నేను హీరోగా మారి ‘రాజావారు రాణి గారు’, ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’ చిత్రాలు చేశా. తను పకడ్బందీగా ‘సమ్మతమే’ కథను రాశారు. ఆయన కథను రాయడానికి సమయం తీసుకున్నా ఔట్‌పుట్‌ మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. ఆ నమ్మకమే ఈ చిత్రాన్ని అంగీకరించేలా చేసింది. ఈ సినిమా పాయింట్‌ను ఇప్పటి వరకూ ఎవరూ టచ్‌ చేయలేదనుకుంటున్నా. ఇదొక యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

* ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

కిరణ్‌: నేనిందులో కృష్ణ అనే పాత్రలో కనిపిస్తా. కృష్ణ చిన్నతనంలోనే తల్లి మరణిస్తుంది. ఆ బాధలో ఆడవాళ్లు ఉంటేనే ఇంటికి వెలుగని తెలుసుకుంటాడు. అందుకే ఆ వయసులోనే పెళ్లి ఎప్పుడు చేస్తారని తన తండ్రిని అడుగుతాడు. అలాంటి కృష్ణ ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అతడికి ఎదురయ్యే సవాళ్లేంటి? ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

* ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో’ కమర్షియల్‌ హంగులున్నాయి. ఇందులో అవి ఆశించొచ్చా?

కిరణ్‌: ‘సమ్మతమే’ సాఫ్ట్‌గా కనిపించే సినిమా అయినా మాస్‌ అంశాలూ ఉంటాయి. హీరో బాడీ లాంగ్వేజ్‌, తను చెప్పే సంభాషణల్లో కమర్షియల్‌ అంశాలు కనిపిస్తాయి. నేనెంత ఖరీదైన దుస్తులు వేసుకుని, క్లాస్‌గా రెడీ అయినా తెలియకుండానే నాలోని మాస్‌ ఫ్లేవర్‌ బయటకు వస్తుంది (నవ్వుతూ..).

* నాయిక చాందిని గురించి చెప్తారా?

కిరణ్‌: హీరోయిన్‌ ఎంపిక చేసేందుకు చాలా సమయం పట్టింది. ఎందరో ఫొటోలు చూసి, వారిని తిరస్కరించాం. చివరకు తెలుగమ్మాయి చాందినీ అయితే బావుంటుందని నేనూ దర్శకుడు అనుకున్నాం. కథ ఆమెకు నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. చాందినీ నాలానే హైపర్‌ యాక్టివ్‌. తను స్నేహపూర్వకంగా ఉండటంతో చిత్రీకరణ సాఫీగా సాగింది.

* ఈ చిత్రంలోని ఇతర నటుల గురించి చెప్తారా?

కిరణ్‌: ఈ చిత్రంలో చాలామంది సీనియర్‌ నటులు నటించారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు అవాక్కవాలని వారి వివరాలు బయటపెట్టలేదు. ముందుగా ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో తీయాలనుకున్నాం. కానీ, చివరకు పెద్ద సినిమాగా మారింది. 75 లైవ్‌ లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్‌ చేశాం. నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ఆ ఫలితం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది.

* ఈ సినిమాలో ఏడు పాటలు పెట్టడానికి కారణం?

కిరణ్‌: కావాలని ఏడు పాటలను రూపొందించలేదు. కథ డిమాండ్ మేరకు అలా చేయాల్సి వచ్చింది. పాటలన్నీ సందర్భానుసారం వచ్చేవే. కథని సంగీతపరంగా చెప్పే క్రమంలో అన్ని పాటలు పుట్టాయి. ప్రస్తుతానికి మూడు పాటలు విడుదల చేశాం. మిలిగినవి థియేటర్లలోనే ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తాయి. శేఖర్‌ చంద్ర అద్భుతమైన స్వరాలందించారు.

* ‘సమ్మతమే’ టైటిల్ అందరికీ రీచ్‌ అవుతుందనుకున్నారా?

కిరణ్‌: ఇలాంటి టైటిల్స్ వినగా వినగా, పోస్టర్లపై చూడగా చూడగా రీచ్‌ అవుతుంటాయి. ‘బొమ్మరిల్లు’, ‘గీత గోవిందం’ ఈ కోవలోకే వస్తాయి. ఇలాంటి సినిమాలను చూసి ఎలాంటి ఫీలింగ్‌తో థియేటర్‌ నుంచి బయటకు వస్తామో ‘సమ్మతమే’ విషయంలోనూ అదే జరుగుతుంది.

* మీ ప్రతి సినిమా మధ్యతరగతి నేపథ్యంలో సాగుతుంది. కారణం ఏమైనా ఉందా?

కిరణ్‌: నాకు మధ్యతరగతి నేపథ్యంలో సాగే కథలంటే ఇష్టం. కారణం నేనూ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిని కావడం. ‘ఇది మన, మనోడి కథరా’ అనే ఫీలింగ్‌ ఉంటేనే నేను కథను ఒప్పుకొంటా. దర్శకనిర్మాతలూ నాకు ఇలాంటి కథలు సెట్‌ అవుతాయనుకుంటున్నారేమో!

* నెలల వ్యవధిలోనే సినిమాలు విడుదల చేస్తున్నారు. మీ ప్రణాళిక సరైందేనా?

కిరణ్‌: నా ప్రణాళిక సరైందేనని భావిస్తున్నా. కథానాయకులు వీలైన ఎక్కువ సినిమాలు చేయడమే కరెక్ట్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. వరుసగా సినిమాలు విడుదలవుతుంటే అందరికీ పని దొరుకుతుంది. వరుస సినిమాలు చేసే క్రమంలో తగిన జాగ్రత్తలూ తీసుకోవాలి. నేను ఖరారు చేసిన సినిమాల దర్శకులు, నిర్మాతలు నాకు బలం.

* తదుపరి ప్రాజెక్టుల విశేషాలు?

కిరణ్‌: ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమా ఆగస్టు, ‘వినరో భాగ్యం విష్ణుకథ’ సెప్టెంబరులో విడుదలకానున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థలో ఓ చిత్రం చేస్తున్నా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు