నేల దిగిన కథనం నింగికెగిసిన విజయం

మాస్‌ మసాల సినిమాలకు తెలుగుచిత్ర పరిశ్రమ చిరునామా. కమర్షియల్‌ చిత్రాలతో బాక్సాఫీస్‌ దుమ్ము దులపడంలో మన తర్వాతే ఎవరైనా. పంచ్‌ డైలాగ్‌లు, పోరాట సన్నివేశాలు,  ఉర్రూతలూగించే ఎలివేషన్లతో పసందైన వినోదాన్ని...

Updated : 11 Jan 2022 17:19 IST

మాస్‌ మసాల సినిమాలకు తెలుగుచిత్ర పరిశ్రమ చిరునామా. కమర్షియల్‌ చిత్రాలతో బాక్సాఫీస్‌ దుమ్ము దులపడంలో మన తర్వాతే ఎవరైనా. పంచ్‌ డైలాగ్‌లు, పోరాట సన్నివేశాలు,  ఉర్రూతలూగించే ఎలివేషన్లతో పసందైన వినోదాన్ని అందించడంలో టాలీవుడ్‌ది అందె వేసిన చేయి. అయితే తెలుగు తెరపై జీవితాన్ని ఆవిష్కరించే చిత్రాలు తక్కువగా వస్తాయని విశ్లేషకులు నేరుగానే విమర్శిస్తారు. మలయాళం, తమిళ భాషల్లో సామాన్యుల జీవనానికి అద్దం పట్టే సినిమాలు తరచుగా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటే తెలుగు కథా మారుతూ వస్తోంది. చుట్టూ కనిపించే గల్లీ కుర్రాళ్ల కథలు, నిత్యం తారసపడే మట్టి మనుషులు.. ఇలా కథలు నేలకు దించి జీవిత పరిమళాన్ని తెరకు అద్దే ప్రయత్నం చేస్తున్నారు నేటితరం దర్శకులు. ఈ ఏడాది తెలుగులో వచ్చిన అలాంటి సినిమాలు, కథలేంటో చూద్దాం..

నేల మార్గాన ‘సినిమా బండి’

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ నయా చిత్రం సినీ ప్రేమికులను తెగ అలరిస్తోంది. కమర్షియల్‌ హంగులు ఏ మాత్రం లేకుండా తెరకెక్కించాడు దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల. తెలుగు నుంచి వెళ్లి బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న దర్శకద్వయం రాజ్‌ డీకే నిర్మించారు. ఈ సినిమా కథంతా ఓ పల్లెటూర్లోనే జరుగుతుంది. ఆటో  డ్రైవర్‌కు కెమెరా   దొరకడం దాంతో ఆయన సినిమా తీసి ఊరికి పేరు తీసుకు రావాలని చేసిన ప్రయత్నాలే సినిమా బండి కథ. అందుకు సెలూన్‌ షాప్‌లో పనిచేసే ఓ యువకుడు హీరో, కూరగాయలు అమ్ముకునే గంగ హీరోయిన్, పెళ్లిళ్లకు వీడియోలు తీసే వ్యక్తిని సినిమాటోగ్రాఫర్‌గా పెట్టుకొని సినిమా చిత్రీకరణ మొదలెడతాడు. దాన్ని తెరకెక్కించే క్రమంలో వచ్చే సన్నివేశాలు, వారి అమాయకత్వం మంచి వినోదాన్ని అందిస్తాయి. ఎవరైనా సినిమా తీయొచ్చనే కోణంలోనే వినోదాత్మకంగా తెరకెక్కిందీ చిత్రం. తెలుగు, కన్నడ కలగలిసి ఉన్న యాస సినిమాకు కొత్త దనాన్ని తెచ్చింది. ఇలా మట్టి మనుషులను సినిమా ద్వారా పరిచయం చేయడం కొత్తగా ఉండటమే కాకుండా ప్రేక్షకుడిని మెప్పించె కొత్త కథలను తీరాలకు ఎలా చేర్చవచ్చో మార్గం చూపింది ‘సినిమాబండి’.


ఆ ‘మెయిల్‌’...ఈ మేలు

తెలంగాణ యాసలో సినిమాలు రావడం సర్వసాధారణమైంది. అయితే ఆ మట్టి పరిమళాన్ని అంతే అందంగా చూపించిన చిత్రాలు తక్కువనే చెప్పాలి. ‘దొరసాని’, ‘మల్లేశం’ లాంటివి ఆ జీవనాడిని పట్టుకుని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే కోవలోకి చేరుతుంది ‘మెయిల్‌’ సినిమా. ‘ఆహా’ ఓటీటీలో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. కంప్యూటర్‌ వచ్చిన కొత్తలో తెలంగాణ గ్రామాల్లోని పరిస్థితులను, పల్లెవాసుల అమాయకత్వాన్ని అందంగా చూపించారు దర్శకుడు ఉదయ్‌ గుర్రాల.


సామాన్యుడి బయోపిక్కు..

బట్టలమ్ముకునే ఓ వ్యక్తి బయోపిక్కు అంటూ ఆసక్తికర కామెడీ డ్రామాతో ముందుకొచ్చింది ‘బట్టలరామస్వామి బయోపిక్కు’. రామ్‌ నారాయణ దర్శకుడు. ఇదేమీ నిజంగా బయోపిక్కు కాదండోయి. అంతా కల్పితమే. బట్టలు అమ్ముకునే రామస్వామి అనుకోని  పరిస్థితుల్లో ముగ్గురిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ ముగ్గురి మధ్య సవితి పోరులో నలిగిపోయే భర్తగా రామస్వామి పడే పాట్లు ఏంటనేవే సినిమా. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది.  రామస్వామిగా అల్తాఫ్‌ హసన్‌ నటనే సినిమాకు ప్రధాన బలం.


తెరపై జోగిపేట అల్లరి

జోగిపేట నుంచి పట్నం వచ్చి ‘జాతిరత్నాలు’ చేసిన అల్లరి ఎంతగా హిట్టయ్యందో తెలిసిందే. ఊర్లో ప్రతి గల్లీకి అలాంటి స్నేహితుల గ్యాంగ్‌ ఉంటుంది. సినిమాటిక్‌ స్నేహంలా కాకుండా నిజజీవితంలో పల్లెటూరి స్నేహితులు ఎలా ఉంటారో.. అచ్చం అలాగే తెరపై చూపించి వినోదాన్ని పంచారు దర్శకుడు అనుదీప్‌.సంభాషణలు అలాగే రాసుకున్నారు. ప్రేక్షకులు ఆ పాత్రల్లో తమని తామూ చూసుకున్నారు గనకే అంత పెద్ద విజయం సాధించిందా సినిమా. ప్రాంతీయతకు తగినట్లుగా కథను అల్లుకుంటే ఇక్కడా విజయాలు సాధించొచ్చని నిరూపించిందా సినిమా.

గతేడాది వచ్చిన ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడిస్‌’ గుంటూరు యాసను, జీవితాన్ని ఆవిష్కరించి మంచి మార్కులు కొట్టేసింది. అలాగే రీమేక్‌ చిత్రమైన అరకు నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. అయితే ఇలాంటి చిత్రాలు ఓటీటీల్లో బ్రహ్మాండంగానే ఆడుతున్నాయి. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను థియేటర్లలోనూ విజయతీరాలకు చేర్చినప్పుడే మరికొన్ని కొత్త కథలకు, ప్రయత్నాలకు బీజం పడుతుంది.


గతమెంతో ఘనకీర్తి

లోకం తీరు తెలియని అమాయకుడి జీవితం ‘స్వాతిముత్యం’ అయితే... నృత్యం నేర్చుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని చూసే యువకుడి కథ ‘సాగర సంగమం’అవుతుంది. ఇలా అలనాడు సామాన్యుల కథలను ప్రేక్షకరంజకంగా చెప్పిన ఘనత దర్శకుడు విశ్వనాథ్‌కు ఉంది. సంగీతమే ప్రాణంగా బతికే ఓ పేద విధ్వాంసుడి జీవితాన్ని ‘శంకరాభరణం’గా తెరకెక్కించి ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నారు. బాపు, టి.కృష్ణ, దవళ సత్యం, ఆర్‌.నారాయణమూర్తి, క్రాంతికుమార్, ముత్యాలసుబ్బయ్య లాంటి కొందరు దర్శకులు అప్పట్లో సామాన్యుల జీవితాలను తెరకెక్కించి మెప్పించారు. ఆ తర్వాత ఇలాంటి మట్టివాసన ఉన్న కథలు తెలుగు చిత్రపరిశ్రమలో అరుదనే చెప్పాలి.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని