రొటీన్‌ పాత్రలు చేసి బోర్‌ కొట్టింది: లావణ్య

తన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’తో అటు అందంలోనూ, ఇటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది లావణ్య త్రిపాఠి. తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. తాజాగా ‘చావు కబురు చల్లగా’, ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రాల్లో ఛాలెంజింగ్‌

Published : 27 Feb 2021 18:28 IST

తన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’తో అటు అందంలోనూ, ఇటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది లావణ్య త్రిపాఠి. తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. తాజాగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’,‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 5న విడుదల కానున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ విశేషాలను ఆమె ప్రేక్షకులతో పంచుకున్నారు. అవేంటో ఒకసారి చూసేద్దామా!

కొత్తదనం కోసమే ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’..

ఒకసారి ముంబయిలో సందీప్‌కిషన్‌ను కలిశాను. అప్పుడే ఈ సినిమా గురించి మాట్లాడుకున్నాం. స్టోరీ పాయింట్‌ వినగానే ఎగ్జైట్‌ అయ్యాను. నాక్కూడా రెగ్యులర్‌ పాత్రల్లో నటించి బోర్‌ కొట్టింది. అందుకే ఏదైనా ఛాలెంజింగ్‌ పాత్రలో నటించాలనే ఉద్దేశంతో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రం చేశా. ఈ చిత్రం తమిళ రీమేక్‌ అయినప్పటికి 50శాతం అసలు కథలో మార్పులు చేసి తెలుగులో తెరకెక్కించారు. అలాగే ఇందులోని పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉండటంతో సులభంగా పాత్రలోకి ఒదిగిపోయా. సందీప్‌ ఎంతగానే ప్రోత్సహించేవాడు.

నేనూ క్రీడాకారిణినే..

ఈ సినిమా హాకీ నేపథ్యంగా సాగుతుంది. అందుకోసం ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయలేదు. నేను మొదటి నుంచి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడం వల్ల పాత్రకు తగ్గట్టు కొన్ని కొన్ని వర్కౌట్లు మాత్రమే చేశా. అలాగే నా స్కూల్‌డేస్‌లో బాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌ ఆడేదాన్ని. హాకీ స్కూల్లో ఉండేది కాదు. కానీ, ఈ సినిమా చేసిన తర్వాత హాకీ కచ్చితంగా స్కూల్‌ గేమ్స్‌లో ఉండాలనిపించింది. అలాగే హాకీ క్రీడాకారుల బాడీలాంగ్వేజ్‌ ఎలా ఉండాలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. చెన్నైలో కోచ్‌ సుధీర్‌గారు నాకు శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్‌ని బాగా ఎంజాయ్‌ చేశా.

హాకీ మ్యాచ్‌లు చూసేదాన్ని..

ఒక నటిగా పాత్రల్లో నటించేటప్పుడు సహజంగా ఉండాలన్నదే నా అభిమతం. అందుకే ఈ సినిమా హాకీ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి మ్యాచ్‌లో భావోద్వేగాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అందుకోసం పాత హాకీ మ్యాచ్‌లు ఎక్కువగా చూసేదాన్ని. సందీప్‌, నేనూ రెగ్యులర్‌ హీరో, హీరోయిన్‌ పాత్రల్లో  నటించలేదు. ఒక హాకీ ప్లేయర్స్‌ ఎలా ప్రవర్తిస్తారో అలాగే చేశాం. కొన్ని సాంగ్స్‌లో గ్లామర్‌గా చేసినప్పటికీ ఆ ప్రభావం సినిమాపై పడకుండా జాగ్రత్తలు. ఎందుకంటే ఇందులో నా పాత్రకు పెద్దగా మేకప్‌ ఉండదు.

క్రీడల్లో రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తాం..

ప్రతీ క్రీడలోనూ రాజకీయాలు కచ్చితంగా ఉంటాయి. అవి ఆటకు ఒక్కోసారి ప్రతిబంధకంగా మారతాయి. ఎంతో మంది ప్రతిభావంతులు ఈ రాజకీయాల వల్ల నష్టపోతుంటారు. వాటన్నింటినీ చిత్రంలో సందేశాత్మకంగా చూపించాం. మా లవ్‌ ట్రాక్‌ కూడా అలరిస్తుంది.

పాత్రలు చేసేటప్పుడు శారీరక శ్రమ కూడా ఉండాలి..

ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ సినిమాలకు కమిట్‌ అవ్వలేదు. కారణం అన్నీ అంతకు ముందు నేను చేసిన పాత్రల్లానే ఉన్నాయి. కేవలం ఒక డైలాగ్‌ చెప్పేసి, ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చేస్తే సరిపోదు కదా. ఒక పాత్రకోసం శారీరకంగా కూడా కష్టపడాలి. అందుకే హాకీ బ్యాట్‌ పట్టి మైదానంలో చెమటలు చిందించాను. ఆ సమయంలో ఎంతో తృప్తిగా అనిపించేది.

సందీప్‌ కిషన్‌ నాకు మంచి స్నేహితుడు..

సందీప్‌తో నాకు ఎప్పటినుంచో పరిచయముంది. అంతకుముందు ఇద్దరం కలిసి ‘మాయావన్‌’లో నటించాం. ఈ చిత్ర నిర్మాతల్లో సందీప్‌ కూడా ఒకరు. అందుకే నాకేమైనా సమస్యలున్న అతనితో చర్చించేదాన్ని. నా మాటకు ఎంతో విలువనిస్తాడు. సందీప్‌ మంచి సహనటుడు కూడా. ‘మాయవన్‌’చిత్రంలో మా ఇద్దరి మధ్య పెద్దగా లవ్‌ ట్రాక్‌ ఉండదు. ఇందులో ఆ లోటు తీర్చాం. ఈ చిత్రం కోసం బైక్‌ నడపడం కూడా నేర్చుకున్నా.

అందరం కలిసికట్టుగా పనిచేశాం..

‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో చాలావరకు కొత్తవాళ్లే పనిచేశారు. ముఖ్యంగా డైరెక్టర్‌ డెన్నిస్‌ జీవన్‌తో  ఎంతో సరదాగా ఉండేది. ప్రతీ షాట్‌ను చక్కగా వివరించి చేయించేవారు. దీని తమిళ మాతృక చూశాను. కానీ ఆ చిత్రంతో పోల్చుకుంటే ఈ సినిమాలో నా పాత్రకు చాలా మార్పులు చేశారు. అందుకే చాలా కొత్తగా కనిపిస్తాను. సినిమాటోగ్రాఫర్‌ కెవిన్‌ నా సోదరుడిలా కలిసిపోయాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. అలాగే సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ తమిళ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాలను తన నేపథ్య సంగీతంతో  మరోస్థాయికి తీసుకెళ్లినట్టు మా యూనిట్‌ చెబుతోంది.

షూట్‌ చేస్తునప్పుడే ఆ భావన కలిగింది..

ఇప్పటివరకు ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చూడలేదు. కారణం, సినిమాను వెండితెరపైనే చూడాలనే బలమైన కోరిక. అలాగే ఈ చిత్రం షూటింగ్‌లోనే సూపర్‌హిట్ కొట్టబోతున్నామని అర్థమైంది. కొన్నిసార్లు నాకు అలా ముందే తెలిసిపోతుంది.

మామూలుగానే నా లైఫ్‌లో లాక్‌డౌన్‌ ఉంటుంది..

ఈ లాక్‌డౌన్‌లో ప్రత్యేకంగా నేను చేసిదంటూ ఏమీ లేదు. ఎందుకంటే మామూలు రోజుల్లో కూడా షూట్‌ లేకపోతే నేను ఇంట్లోనే ఉంటాను. ఇక ఓటీటీ విషయానికొస్తే ఒక స్క్రిప్ట్‌ విన్నా. చాలా బాగా నచ్చింది. కానీ కొన్నాళ్లపాటు సినిమాలు మాత్రమే చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నా. విలన్‌ పాత్రలు చేయడమన్నా నాకు చాలా ఇష్టం. ఆ తరహా పాత్రలు చేస్తేనే నటిగా మన సామర్థ్యం తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని స్క్రిప్టులు విన్నా. పాత్రలను బట్టి సినిమాలు ఎంపిక చేసుకుంటాను.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని