National Film Awards: హిందీలో 27.. తెలుగులో ఒకరు.. ఇప్పటివరకూ జాతీయ అవార్డులు పొందిన నటులెవరంటే?

జాతీయ అవార్డుల్లో (National Film Awards) ఉత్తమ నటుడి కేటగిరి ఎప్పటి నుంచి మొదలైంది? ఇప్పటివరకూ ఆ అవార్డును అందుకున్న నటులు ఎవరంటే..?

Published : 25 Aug 2023 19:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారం నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ (National Film Awards). సినీ రంగానికి సేవలు అందిస్తోన్న పలువురు ప్రముఖులను గుర్తించి వివిధ విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తారు. గురువారం ప్రకటించిన జాబితాలో జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ అవార్డు దక్కించుకున్నారు. ఈ అవార్డును సొంతం చేసుకున్న తొలి తెలుగు నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. తెలుగు సినీ చరిత్రలో ఎందరో గొప్ప నటులున్నా ఇప్పటివరకూ ఎవ్వరికీ ఈ అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఎవరెవరు అందుకున్నారు? ఈ అవార్డును ఎప్పటి నుంచి ఇస్తున్నారు? అనే ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.

1954 నుంచి సినీ రంగానికి చెందిన ప్రముఖులకు జాతీయ చలన చిత్ర అవార్డులను ఇవ్వడం మొదలుపెట్టారు. 1967లో 15వ జాతీయ అవార్డుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడి పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. తొలి అవార్డును బెంగాలీ నటుడు ఉత్తమ్‌కుమార్‌ సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు హిందీ నటులు 27, మలయాళం నటులు 13, తమిళ నటులు 9, బెంగాలీ నటులు 5, మరాఠీ, కన్నడ నటులు మూడేసి చొప్పున, ఇద్దరు ఆంగ్ల చిత్ర నటులు ఈ అవార్డులను దక్కించుకున్నారు. దాదాపు 54 ఏళ్ల తర్వాత తొలిసారి తెలుగు నటుడు (అల్లు అర్జున్‌) ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

Allu Arjun: ఈ పాత్రలు చూస్తే.. ‘ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాలి.. జారిన ప్రతి నోరూ మూసుకోవాలి’

ఇప్పటివరకు ప్రకటించిన 54 అవార్డుల్లో అత్యధికంగా అమితాబ్‌ బచ్చన్‌ నాలుగుసార్లు, కమల్‌హాసన్‌, మమ్ముట్టి, అజయ్‌దేవగణ్‌ మూడేసిసార్లు, సంజీవ్‌కుమార్‌, నసీరుద్దీన్‌షా, ఓంపురి, మిథున్‌చక్రవర్తి, మోహన్‌లాల్‌, ధనుష్‌లు రెండేసిసార్లు చొప్పున గెలుచుకున్నారు. దక్షిణాదిలో ఎంజీ రామచంద్రన్‌, కమల్‌హాసన్‌, విక్రమ్‌, ప్రకాశ్‌రాజ్‌, ధనుష్‌, సూర్య (తమిళం), పీజే ఆంటోనీ, భరత్‌గోపి, బాలన్‌ కె.నాయర్‌, ప్రేమ్‌జీ, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, బాలచంద్రమేనన్‌, సురేష్‌గోపి, మురళి, సూరజ్‌ వెంజారమూడు (మలయాళం), ఎంవీ వాసుదేవరావు, చారుహాసన్‌, సంచారి విజయ్‌ (కన్నడ) ఈ అవార్డులను సొంతం చేసుకున్నారు.

నటీమణుల్లో తెలుగు/తమిళ/మలయాళ చిత్రాల ద్వారా ఈ ఘనత సాధించిన వారిలో ఊర్వశిగా పేరొందిన శారదకు 1968, 1972, 1978ల్లో జాతీయ ఉత్తమ నటి అవార్డులు దక్కాయి. 1987, 1988ల్లో వరుసగా రెండేళ్లు అర్చన తమిళ చిత్రం ‘వీడు’, తెలుగుచిత్రం ‘దాసి’ ద్వారా జాతీయ ఉత్తమ నటిగా నిలిచారు. 1990లో ‘కర్తవ్యం’లో ప్రదర్శించిన నటనకు విజయశాంతి, 2017లో ‘మామ్‌’ హిందీ చిత్రంలో నటించిన శ్రీదేవికి, 2018లో ‘మహానటి’లో సావిత్రి పాత్ర పోషించిన కీర్తిసురేష్‌లకు ఈ ఘనత దక్కింది. ఇక, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్‌ నటుడు పి.ఎల్‌.నారాయణ 1991లో ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ‘యజ్ఞం’ చిత్రానికి గానూ ఆయన ఈ అవార్డు దక్కించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని